నూతన సహస్రాబ్దికి స్వాగతం

(శ్రీ దుర్గాప్రసాద్‌ గారు కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఉంటారు. హైస్కూలు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి రిటైరయ్యారు.)

కాలమహిళ మళ్ళీ ఓ నూతన శిశువుకు
జన్మనిస్తున్న శుభ మంగళ వేళ
గతకాలపు చేదుగురుతులన్నీ అస్తమించిన మంచిసమయం
ఆగమి అబ్ది సుఖసంతోషాల నివ్వాలని కోరదాం

వార్తామాధ్యమంతో విశ్వం అంతా ఓ చిన్న గూటిలోనే ఉన్నట్లుంది
ఐనా ఇరుకుభావాలు రంగుల వైషమ్యాలు జాతిభేదాలు
చీలదీస్తున్నాయి కూలదోసి దూరం చేస్తున్నాయి
మనుషులు దగ్గరైనా అంతరంగాలు దూరమౌతున్నాయి

మంచే మనిషిని ఎదిగేట్లు చేస్తుంది
మానవత్వమే అందర్నీ దగ్గర చేరుస్తుంది

శాంతి సౌమనస్యం సర్వతోముఖాభివృద్ధి నిస్తుంది
ప్రేమే జగతిని జయించి అక్కున చేరుస్తుంది
కృషి, సాధించే పట్టుదలే విజయానికి సోపానాలు

అనంత కరుణామయుని అనంతరూపాలే మనం
అనేకత్వంలో ఏకత్వం చూసే మనసు మనది

చెదిరిపోయిన అనేకజాతుల జనస్రవంతులన్నీ
ఆ విశ్వమూర్తి సముద్రంలోకి చేరాల్సిందే

విశ్వచేతనలో మనం ఒకటవుదాం
విశ్వశాంతికై ఏకమనస్కులమై శ్రమిద్దాం.