అమెరిగల్పిక – ఎఫిషియెన్సీ, ప్లీజ్‌

సుబ్బారావు ఒక పెద్ద కంపెనీలో ఒక చిన్న మాన్యుఫాక్చరింగ్‌ ఫెసిలిటీకి ప్రొడక్షన్‌ మేనేజరుగా పనిచేస్తున్నాడు. ఒక రోజు ఉదయం ప్రొడక్షన్‌ ఫ్లోర్‌ పై తన అసిస్టెంట్లైన ఇంజనీర్లతో ఆ రోజు ప్రొడక్షన్‌ గురించి చర్చిస్తుంటే పీయే సిస్టంలోంచి వాన్నా వైట్‌ కి డూప్లికేట్లా ఉండే రిసెప్షనిస్ట్‌ డైసీ పిలుపు వినిపించింది, “మిస్టర్‌ రావ్‌ ప్లీజ్‌ పికప్‌ సిక్స్‌ హండ్రెడ్‌ మిస్టర్‌ రావ్‌ సిక్స్‌ హండ్రెడ్‌ ప్లీజ్‌” అంటూ.

ఆ భవనంలో సిబ్బంది చాలామంది ప్రొడక్షన్‌ ఫ్లోర్‌ మీద పని చేస్తుంటారు రోజంతా. అటూ ఇటూ తిరుగుతుంటారు డెస్కు దగ్గర ఒక చోట కూర్చుని చేసే పని కాకపోవటం వల్ల. వాళ్ళలో ప్రతి ఒక్కరికీ విడిగా ఫోన్లు లేవు. ఎవరికైనా ఫోన్‌ కాల్‌ వస్తే డైసీ అలా పీయే సిస్టంలో ప్రకటిస్తే ఆ వ్యక్తి ఫ్లోర్లో అక్కడక్కడా అమర్చిన ఫోన్లలో ఒకదాని దగ్గరకెళ్ళి, ఆవిడ చెప్పిన నెంబరు డయల్‌ చేస్తే వచ్చిన కాల్‌ కనెక్టవుతుంది.

సుబ్బారావు ఒక ఫోన్‌ దగ్గరకెళ్ళి 600 డయల్‌ చేశాడు. ఆ పిలుపు హెడ్డాఫీస్లో ఉండే అతని బాస్‌ దగ్గర్నించి. సారాంశమేవిటంటే కంపెనీ యాజమాన్యం వారు “ఎఫిషియెన్సీ పెంచు వేస్ట్‌ తగ్గించు” అనే తపస్సులో భాగంగా ఎఫిషియెన్సీ ఎక్స్పర్టులుగా దేశవ్యాప్తంగా పేరుగాంచిన ఒక కన్సల్టెంట్‌ ఫర్మ్‌ ని తమ కంపెనీ పనిచేసే తీరు తెన్నులు పరీక్షించడానికి నియోగించారు. ఆ కన్సల్టెంట్ల బృందం ఒక వారం పాటు సుబ్బారావు మేనేజ్‌ చేసే ప్రొడక్షన్‌ ఫెసిలిటీని ఆపాద మస్తకం పరిశోధించి, ఫెసిలిటీ నడకలో సిబ్బంది నడవడిలో వృధా అంశాల్ని పట్టుకుంటా రన్నమాట. ఆ ఎక్స్పర్టుల రాకకి తయారుగా ఉండమని బాసుగాడి(రి) ఆజ్ఞ.

ఈ “ఎఫిషియెన్సీ పెంచు, వేస్ట్‌ తగ్గించు” మంత్రోఛ్ఛాటన ఫలితంగానే ఈ మధ్య సుబ్బారావుకి ప్రమోషనొచ్చి, బాధ్యత పెరిగింది. ఇదివరకు సుబ్బారావు బాధ్యత ప్రొడక్షన్‌ మేనేజ్‌ చేసేవరకే. ఆఫీస్‌ సిబ్బందిగా పనిచేసే పదిమందినీ పర్యవేక్షించేందుకు వేరే ఆఫీస్‌ మేనేజర్‌ ఒకావిడ ఉండేది. ఇంత చిన్న ఫెసిలిటీని మేనేజ్‌ చేసేందుకు ఇద్దరు మేనేజర్లెందుకని కంపెనీ మేనేజ్మెంట్‌ వారు యోచించి, ఆఫీస్‌ మేనేజర్ని నరికేసి ( .. అంటే ఆవిణ్ణి కాదు, ఆ పదవిని), ఆ బాధ్యత కూడా సుబ్బారావుకే అంటగట్టారు ప్రమోషన్‌ పేరిట. ప్రమోష ననంగానే బాధ్యతతో పాటు జీతం కూడా సమంగా పెరిగిందని మీరనుకుంటే పొరబాటు. అక్కడే ఉంది మేనేజ్మెంట్‌ ఇంద్రజాలం! జీతం ఏదో నాం కే వాస్తే పెంచి, పదవీ నామానికి “సీనియర్‌” అన్న ప్రీఫిక్సొకటి తగిలించి ఒదిలి పెట్టారు.

ఏవైనా సుబ్బారావు వెరచే వాడు కాదు కాబట్టీ, వెన్ను చూపటం అతనికి వెన్నతో పెట్టిన విద్య కాక పోబట్టీ, జీతం ఆట్టే పెరక్క పోయినా పెరిగిన బాధ్యతల్ని నెత్తినేసుకున్నాడు. సుబ్బారావుకీ ఈ అదనపు బాధ్యత సరదాగానే ఉంది ఇంతదాకా. ఏమంటే ఈ ఆఫీస్‌ సిబ్బంది అంతా ఆడవాళ్ళు. ఈ ఆడాళ్ళందరి మీద,ముఖ్యంగా వాన్నా వైట్‌ కి డూప్లికేట్లా ఉండే రిసెప్షనిస్ట్‌ డైసీ మీద డైరెక్ట్‌ అజమాయిషీ చెయ్యడమంటే సుబ్బారావుకి సరదాయే మరి. పాపం చిన్నప్పణ్ణించీ మిషనరీలు నడిపే మగపిల్లల బళ్ళో చదూకోడం వల్ల గానీండి, ఇంజనీరింగ్‌ కాలేజీలోనూ, తరవాత బిజినెస్‌ స్కూల్లోనూ ఆడ జనాభా కరువు వల్ల గానీండి, తన బంధువులు కాని ఆడవాళ్ళతో చనువుగా ఉండే అవకాశం సుబ్బారావుకెప్పుడూ రాలేదు. అంచేత వాన్నా వైట్‌ కి డూప్లికేట్లా ఉండే రిసెప్షనిస్ట్‌ డైసీ తనని “బాస్‌” అని నోరారా పిలుస్తూ చిన్న చిన్న సేవలు చేసి పెడుతూంటే అతనికి హుషారుగానే ఉంది. ఆడ సిబ్బందిపై అజమాయిషీ అదో థ్రిల్‌ అంతే! అనుభవైక వేద్యం!!

మేనేజ్మెంట్‌ వారు పెట్టిన ముహూర్తానికల్లా ఎఫిషియెన్సీ ఎక్స్పర్టుల బృందం బిలబిలమంటూ రానే వచ్చింది. సుబ్బారావు ముందే ఇచ్చిన ఆదేశాల ప్రకారం వాన్నా వైట్‌ కి డూప్లికేట్లా ఉండే రిసెప్షనిస్ట్‌ డైసీ వాళ్ళ కోసం వేడి వేడి కాఫీ,తాజా తాజా డోనట్లూ సిధ్ధంగా ఉంచింది. ఎక్స్పర్టులు డోనట్లు నంచుకుంటూ కాఫీ సేవించేలోగా సుబ్బారావు తమ ఫెసిలిటీ నడిచే తీరుతెన్నుల్ని క్లుప్తంగా విశదీకరించి (అది ఆక్సీమోరానంటారా? ఈ ప్రయోగం బృహన్నారదీయం ఐదో ఆశ్వాసంలో ఉంది. ఋజువు కావల్సిన వారు ILP కి కనీసం ఇరవై డాలర్ల డొనేషన్‌ కట్టి ఆ రసీదుతో పాటు SASE పంపిస్తే వేలూరి వెంకటేశ్వర
రావు మేష్టారు సదరు కాపీ మీకు పంపగలరు) వాళ్ళని ప్రొడక్షన్‌ ఫ్లోర్‌ మీదికి తీసుకెళ్ళాడు. ఆతను వాళ్ళకి మొదటి మెషీన్‌ దగ్గర ప్రొడక్షన్‌ పధ్ధతిని వివరిస్తుంటే వాన్నా వైట్‌ కి డూప్లికేట్లా ఉండే రిసెప్షనిస్ట్‌ డైసీ గొంతు పీయే సిస్టం మీద తియ్యగా పలికింది, “మిస్టర్‌ రావ్‌ ప్లీజ్‌ పికప్‌ సిక్స్‌ జీరో సిక్స్‌ మిస్టర్‌ రావ్‌ సిక్స్‌ జీరో సిక్స్‌ ప్లీజ్‌” అంటూ.

ఎక్స్పర్టుల్ని ఒక ఇంజనీర్‌ చేతుల్లో పెట్టి సుబ్బారావు ఆ కాల్‌ రెసీవ్‌ చేసుకోడానికి వెళ్ళాడు. అది ముగించుకుని వచ్చి ఎక్స్పర్టులకి మిగతా ఫెసిలిటీ అంతా చూపించాడు. మధ్యమధ్యలో పీఏ సిస్టం మీద వాన్నా వైట్‌ కి డూప్లికేట్లా ఉండే రిసెప్షనిస్ట్‌ డైసీ గొంతు తియ్యగా పిలుస్తూనే ఉంది సుబ్బారావునో మరొకర్నో. ఫెసిలిటీ అంతా చూడ్డం పూర్తవడానికి రెండు గంటల పైనే పట్టింది.

ఎక్స్పర్టులు సుబ్బారావుకి కృతజ్ఞతలు చెప్పుకుంటూనే, ఇక అతను తన పని చూసుకోవచ్చనీ, వారం రోజులపాటు ఫెసిలిటీ తీరుతెన్నులన్నీ తామే గమనించి నివేదిక తయారు చేసి సమర్పిస్తామనీ సవినయంగా ఆజ్ఞాపించారు. వాళ్ళ మానాన్న వాళ్ళనొదిలేసి సుబ్బారావు తన పనిలో నిమగ్నమై పోయాడు.

వారం రోజులూ గిర్రున తిరిగి పోయాయి.

మరుసటి సోమవారం పట్టు వదలని సుబ్బారావు ఎప్పటివలెనే ఇంజనీర్లకి ప్రొడక్షన్‌ బాధ్యతలు అప్పగించాక తన ఆఫీసులో పని చేసుకుంటుండగా, పదిగంటల వేళ, వాన్నా వైట్‌ కి డూప్లికేట్లా ఉండే రిసెప్షనిస్ట్‌ డైసీ అతని ఆఫీసులోకి వచ్చింది. ఆమె ఒకచేతిలో సుబ్బారావుకి ఆ వేళకి రోజూ అందించే రెండో కప్పు కాఫీ, ఇంకో చేతిలో ఒక లావుపాటి ఫైలూ ఉన్నాయి. కప్పు బల్ల మీద పెట్టి, ఫైలు సుబ్బారావు ముందు పెట్టింది. అది ఎఫిషియెన్సీ ఎక్స్పర్టుల నివేదిక .. అప్పుడే స్పెషల్‌ కొరియర్లో వచ్చింది ఎఫిషియెంట్‌ గా. వాన్నా వైట్‌ కి డూప్లికేట్లా ఉండే రిసెప్షనిస్ట్‌ డైసీకి థాంక్స్‌ చెప్పి సుబ్బారావు ఆత్రంగా నివేదిక తెరిచాడు, కాఫీ చప్పరిస్తూ. రిపోర్టు లావుగా (అక్షరాలా రెండొందల తొంభైనాలుగు పేజీలు) ఉన్నా నీటుగా సెక్షన్లుగా విభజించ బడి ఉంది, ఎఫిషియెంట్గా చదివేందుకు వీలుగా. “రికమెండేషన్స్‌” అన్న సెక్షన్‌ టైటిల్‌ చూసి, ఆ ఎనిమిదో సెక్షన్ని తెరిచాడు సుబ్బారావు డైరెక్టుగా. ఎఫిషియెన్సీ పెంపుకి ఎక్స్పర్టుల సిఫారసులు పాయింట్ల వారీగా ఉన్నై. ఒక్కసారి ఊపిరి లోతుగా పీల్చుకుని, చదవటం మొదలు పెట్టాడు. ఎక్స్పర్టుల రికమెండేషన్లు ఇలా మొదలయ్యాయి.

8.1 వాన్నా వైట్‌ కి డూప్లికేట్లా ఉండే రిసెప్షనిస్ట్‌ డైసీ
8.1.1 వాన్నా వైట్‌ కి డూప్లికేట్లా ఉండే రిసెప్షనిస్ట్‌ డైసీ పీయే సిస్టంలో పనివారిని పిలిచేప్పుడు ప్రతి సారీ “ప్లీజ్‌” అనే పదం ఉపయోగించటం వల్ల ఆవిడ సమయమూ పరిశ్రమా రెండూ వృధా అవుతున్నాయని మేము గమనించాము. ఆ పదం ఉపయోగించడం మాని వేస్తే ఆవిడ ఎఫిషియెన్సీ పన్నెండు శాతం పెంచవచ్చని మా పరిశోధనలో తేలింది. ఇక మీదట వాన్నా వైట్‌ కి డూప్లికేట్లా ఉండే రిసెప్షనిస్ట్‌ డైసీ “ప్లీజ్‌” అనటం మానివెయ్యాలని మేము రికమెండ్‌ చేస్తున్నాము.

మొదటి పాయింటు చదివేప్పటికే సుబ్బారావుకి తాగుతున్న కాఫీ కాస్తా కొరబోయి చచ్చినంత చావయ్యింది.

ఆమెరిగల్పిక 2
వలయం

“నాసీ”

సుబ్బారావు ఆఫీసులోంచి బయటికొచ్చి కారెక్కాడు. ఇంటికెళ్ళే హడావుడిలో ఉన్నాడు. నాలుగేళ్ళుగా రోజూ నడిపి నడిపి అలవాటైన రోడ్డే. కళ్ళుమూసుకుని నడిపెయ్య గలడు. సాయంత్రం ఆరు దాటటంతో పెద్ద ట్రాఫిక్‌ లేదు. సర్వీస్‌ డ్రైవులో సుమారు మైలు దూరం పోతే అక్కడ ఫ్రీవే కలుస్తుంది. గతుకుల సర్వీస్‌ డ్రైవ్‌ మీద సుబ్బారావు కారు ఆత్రంగా పరుగెత్తుతోంది నున్నటి ఫ్రీవే స్పర్శకోసం తహతహ లాడుతూ. రియర్‌ వ్యూ మిర్రర్లో ఏదో మెరుపు మెరిసినట్టు అనిపిస్తే అటు చూశాడు.తన వెన్నంటే కాపు కారు నల్ల త్రాచులా నిగనిగ లాడుతూ. దాన్నెత్తిమీద ఎరుపూ నీలం రంగు లైట్లు నాగమణుల్లా మెరుస్తూ.

“డామ్‌!”
తప్పేదేవుంది? కారు స్పీడు తగ్గించి రోడ్డుపక్కగా ఆపాడు. అద్దం కిందకి దించి, లైసెన్సూ రిజిస్ట్రేషనూ పర్సులోంచి తీసి చేత్తో పట్టుక్కూచున్నాడు. కాపు కార్లోంచి లేడీ కాప్‌ తాపీగా దిగింది. “లేడీ కాప్‌ .. కాపుది!” అనుకున్నాడు. అంత టెన్షన్లోనూ సుబ్బారావుకి శ్రీనాథుడి చిలిపి చాటువు గుర్తొచ్చి నవ్వొచ్చింది.గబ్బి మిటారి చూపుల సంగతేమో గానీ ఈవిడే బెబ్బులిలా కనిపించింది బైర్లు కమ్మిన అతని కళ్ళకి. కాపుది సుబ్బారావు విండో పక్కకొచ్చి పలకరించింది.
“ఇవ్వాళ్ళెలా ఉన్నారు సర్‌”
“బానే ఉన్నా!” హీన స్వరంతో బదులిచ్చాడు. “లైసెన్సూ, రిజిస్ట్రేషన్‌ ఇస్తారా దయచేసి!” అందించాడు. కాపుది అవితీసుకుని హంసగమనంతో తన సర్ప వాహనం దగ్గరి కెళ్ళింది. సుబ్బారావు అలాగే కూర్చుని తననీ, ఆ రోడ్డునీ, రోడ్డుకున్న స్పీడ్‌ లిమిట్నీ, అది గమనించుకోని తన అజ్ఞానాన్నీ, వేరే పనీ పాటా లేక ఇలా దారే పోయే వాళ్ళందర్నీ ఆపి వేధించే రెడ్ఫోర్డ్‌ కాపుల్నీ మనసులోనే తిట్టుకుంటూ కూర్చున్నాడు. నాలుగేళ్ళుగా కారు నడుపుతున్నా ఎప్పుడూ ఒక్క సైటేషన్‌ కూడా రాలేదతనికి. చాలా జాగ్రత్తగా నడుపుతాడు. అట్లాంటిది ఈ మధ్య ప్రమోషన్‌ వచ్చినప్పణ్ణించీ డ్రైవింగ్లో పరధ్యాన్నం పెరిగి పోయింది. గత మూణ్ణెల్లల్లోనూ ఇది మూడో సారి సుబ్బారావు కాపుల పాలిట పడటం.

కాపుది తిరిగొచ్చి లైసెన్సూ రిజిస్ట్రేషన్‌ అతనికిస్తూ అడిగింది, “నేను మిమ్మల్నివ్వాళ్ళ ఎందుకాపానో తెలుసా సర్‌”
“ఎట్లాగూ ఇచ్చే టిక్కెట్టేదో ఇచ్చి చావక ఈ టార్చరెందుకు తల్లీ?” అని స్వగతం
చెప్పుకుని, పైకి మాత్రం కొంచెం అమాయకంగా మొహం పెట్టి, “నేను మరీ స్పీడుగా వెళ్ళట్లేదు గదా!” అన్నాడు.
“మీరు ముప్ఫై ఐదు మైళ్ళ రోడ్డు మీద యాభై దాటి వెళ్తున్నారు. లేసర్‌ గన్లో యాభై మూడు రికార్డైంది మీ స్పీడు. మీ రికార్డులో గత మూణ్ణెల్లలోనే రెండు వయొలేషన్స్‌ ఉన్నై.”
“అయాం సారీ” అన్నాడు, తన గొంతు పశ్చాత్తాపంతో దహించుకు పోతున్నట్టుగా ఆవిడకి వినిపించాలని ఆశ పడుతూ.
“పది మైళ్ళు ఎక్కువ స్పీడ్లో వెళ్తున్నట్టు మాత్రమే టిక్కెట్టు ఇస్తున్నా,” అంది కాపుది, అక్కడికేదో అతని మహా పాపాన్ని క్షమిస్తున్నట్టు. “టిక్కెట్టు రెండు వారాల్లోగా చెల్లించాలి. కానీ ఇది మీకు మూడో వయొలేషన్‌ కాబట్టి మీ డ్రైవింగ్‌ రికార్డ్ల్డ్‌లో పాయింట్లు పెరగవచ్చు. “దయచేసి క్షేమంగా డ్రైవ్‌ చెయ్యండి,” అంటూ వంద డాలర్లకి టిక్కెట్టు చేతపెట్టి గీతోపదేశం చేసి మరీ నిష్క్రమించింది కాపుది.

ఉసూరుమని కారు ఇంటి దారి పట్టించాడు సుబ్బారావు, ఫ్రీవే మీద కూడా రెణ్ణిమిషాలకో సారి స్పీడో మీటర్ని గమనించుకుంటూ.

కొన్ని నెలలకి అతని యావజ్జీవితాన్ని భీమా చేసుకున్న స్థానిక ఇన్స్యూరెన్సు కంపెనీ నుంచి సుబ్బారావుకి ప్రేమలేఖ వచ్చింది. మహారాజశ్రీ సుబ్బారావుగారి డ్రైవింగ్‌ రికార్డులో మూడు పాయింట్లు చేరడం వల్ల
వారిని బాధ్యత తెలీని డ్రైవర్గా పరిగణించాల్సి వస్తోందనిన్నీ,తత్ఫలితంగా వారి ఇన్స్యూరెన్సు ప్రీమియం ఆర్నెల్లకీ నూట యాభై డాలర్లు పెంచాల్సి వస్తోందనిన్నీ, ఇలా వారి డబ్బు అదనంగా గుంజటానికి తామెంతో బాధ పడుతున్నామనిన్నీ, ఐనా ఇది వారి శ్రేయస్సు కోసమే ననిన్నీ, ఈ విషయంలో వారికి ఎటువంటి ప్రశ్నలున్నా తమ స్నేహపూర్వకమైన ప్రతినిధిని తప్పక సంప్రదించ వలసినదనిన్నీ, సదా తాము శ్రీ సుబ్బారావుగారి సేవలో నిమగ్నమై ఉంటామనిన్నీ దాని సారాంశం.

తప్పేదేముంది? నిజదార సుతోదర పోషణార్థమై ఉద్యోగం తప్పుతుందా? ఉద్యోగాని కెళ్ళాలంటే కారు నడపక తప్పుతుందా? కారు నడిపేటప్పుడు స్పీడవక తప్పుతుందా? స్పీడై పట్టు పడ్డాక టిక్కెట్‌ముడుపులూ, హెచ్చిన ప్రీమియం ముడుపులూ చెల్లించక తప్పుతుందా? ఏదీ తప్పదు. అందుకని సుబ్బారావు అన్ని ముడుపులూ చెల్లిస్తూనే ఉన్నాడు.

మరికొద్ది నెలలకి “రెడ్ఫోర్డ్‌ స్టార్‌” అనబడే స్థానిక దినపత్రికలో మూడో పేజీలో స్థానిక వార్తల్లో ప్రముఖంగా ప్రచురించబడిన వార్త ఈ సంవత్సరం రోడ్డు ప్రయాణీకుల సంరక్షణలో రెడ్ఫోర్డ్‌ కాపుల అకుంఠిత దీక్షకి మెచ్చి స్థానిక ఇన్స్యూరెన్సు కంపెనీ వారు రెడ్ఫోర్డ్‌ కాపుల సంరక్షణ సంఘానికి యాభై వేల డాలర్లు విరాళం ఇచ్చారని.

ఎస్‌. నారాయణస్వామి

రచయిత ఎస్‌. నారాయణస్వామి గురించి: కథకుడిగా, అనువాదకుడిగా, సమీక్షకుడిగా అమెరికాలోనూ, ఇండియాలోనూ, బ్లాగుల లోకంలోనూ పేరు గడించిన ఎస్‌. నారాయణ స్వామి అమెరికా ఆంధ్రుల జీవన తలాల్లో కొత్తకోణాల్ని ఆవిష్కరిస్తున్న కథకుడిగా ఈమాట పాఠకులకు చిరపరిచితులు.  ...