“ఈ మాట” పాఠక శ్రోతలకు స్వాగతం!

ఎప్పట్లానే ఈ సంచికలో కూడ కొన్ని విశేషాలున్నయ్‌.

సంగీతం తెలియక పోయినా శ్రావ్యమైన పాటల్ని విని అందరం ఆనందిస్తాం. ఐతే ఆ పాట వెనక ఉన్న సంగీతం గురించి కొంత తెలిస్తే ఇంకా ఆనందించటానికి అవకాశం పెరుగుతుంది. కాని, ఎందువల్లనో గాని మనకు దొరికే సంగీత పుస్తకాలు చదివి అర్థం చేసుకోవటం సంగీతవిద్వాంసులకే తలకు మించిన పనౌతుంటుంది చాలా సార్లు. సామాన్యుల కోసం, సామాన్యుల భాషలో, అందరికీ తెలిసిన సినిమాపాటల్ని ఉదాహరణలుగా వాడుతూ మోహనరాగాన్ని వివరించే ఒక మల్టిమీడియా వ్యాసాన్ని ఇస్తున్నాం. ఇక్కడ ఓ పాట గురించి చెప్పే సందర్భంలో దాన్ని వినటానికి కూడ లింకులిచ్చాం.

విన్నకోట రవిశంకర్‌ కవిగా చిరపరిచితులు. ఇప్పుడు నాటికారచయితగా కూడ పరిచయం ఔతున్నారు. ఆయన రాసి, సౌత్‌ కేరలైనా లోని కొలంబియాలో ప్రదర్శింపజేసిన ఒక నాటిక ఈ సంచికలో ఉంది.దీన్ని ఎవరైనా ఎక్కడైనా ప్రదర్శించుకోవచ్చు. ఐతే రచయితకు  ఈమెయిల్‌ అడ్రసుకి తెలియజేయటం మర్యాద.

అలాగే, కథకుడిగా, కవిగా ఒక ప్రత్యేకస్థానాన్ని సాధించిన శ్రీ కనకప్రసాద్‌ ఒక ధారావాహిక నాటికను రాస్తున్నారు. విశాఖ మాండలీకంలో అతిసహజమైన రచనలు చేసే శ్రీ ప్రసాద్‌ గారి ఈ ప్రయోగం రసికపాఠకులందరికీ ఆనందదాయకమౌతుందని మా విశ్వాసం.

ఇక “ప్రభావతీప్రద్యుమ్నం” తో మొదలైన సంప్రదాయ కథాలహరిని కొనసాగిస్తూ ఈ సారి కృష్ణదేవరాయల ఆముక్తమాల్యదని తేలిక తెలుగులో అందిస్తున్నాం. పండితుల్లోనే చాలా కొద్దిమంది చదివే ఈ రచన ఎన్నో అందాల్నీ విశేషాల్నీ తనలో దాచుకుంది. “అసలు ఈ ఆముక్తమాల్యదలో ఏముందో” అనే ఏమాత్రం కుతూహలం ఉన్నవారైనా ఇలా సూక్ష్మంలో మోక్షం సంపాయించెయ్యొచ్చు.