“ఈ మాట” పాఠక శ్రోతలకు స్వాగతం!, మార్చ్‌ 1, 2000

“ఈ మాట” పాఠక శ్రోతలకు స్వాగతం!

క్రితం సంచికలో కొన్ని భాగవత పద్యాలను వినిపించాం. వాటికి అనూహ్యమైన అభినందనలు అందేయి. ఈ ప్రయోగం విజయవంతమైనందుకు మాకెంతో ఆనందంగా ఉంది.ఇప్పుడు అన్ని పద్యాలను వినవచ్చు.

సాలూరు రాజేశ్వరరావు గారి గురించిన రెండు వ్యాసాలు ఆయన సంగీత జీవితాన్ని రెండు విభిన్న కోణాల్నుంచి చూసేవి ప్రచురిస్తున్నాం. వీటికి అనుబంధంగా శ్రీ సాలూరి యాభై ఏళ్ళ వెనుక పాడిన రెండు లలిత గీతాల్ని వినిపిస్తున్నాం. రసికశ్రోతలకు ఇవి శ్రవణపేయాలౌతాయని మా భావన.

“ఈమాట” ప్రారంభించటంలో ఒక ముఖ్యోద్దేశ్యం ఇంటర్‌నెట్‌ వల్ల కలుగుతున్న అద్భుత పరిణామాల్ని ఉపయోగించుకుని తెలుగు లలిత కళా వ్యాసంగాల్ని ప్రోత్సహించటం. కనుక ఇకనుంచి పాఠ్యరచనలతో పాటుగా శ్రవ్యరచనల్ని కూడ ఆహ్వానిస్తున్నాం. ఉదాహరణకు, కవితలు పంపేవారు వ్రాత ప్రతినే కాకుండా వారే కాని మరెవరి చేతనైనా గాని చదివించి / పాడించి పంపవచ్చు. అలాగే వ్యాసాలు, కథలు కూడా పాఠ్యరచనలుగానే కాక శ్రవ్యరచనలుగా కూడ ప్రచురించాలని మా ఆశయం. దీనికి స్పందించి రచయిత(త్రు)లు ఉత్సాహంగా పాల్గొంటారని ఆశిస్తున్నాం.

ఆడియో పంపదలుచుకున్న వారు RealAudio format లో పంపితే బాగుంటుంది. అది వీలుకాని వారు మెయిల్‌లో కేసెట్‌ పంపవచ్చును. అలా కేసెట్‌ పంపదలచిన వారు ముందుగా ee_maata@yahoo.com అనే అడ్రస్‌కు ఈమెయిల్‌ పంపితే పోస్టల్‌ అడ్రస్‌ తెలియజేస్తాం.

ఈ సంచికలో ఎందరో ప్రముఖ రచయితల రచనలు ఉన్నాయి. సాహిత్య విమర్శ రంగంలో నిష్ణాతులైన శ్రీ యుతులు వెల్చేరు నారాయణరావు, వల్లంపాటి వెంకటసుబ్బయ్య, ద్వా.నా. శాస్త్రి వంటి దిట్టలు వారి రచనల్ని ఇచ్చి “ఈమాట” ను సర్వాంగసుందరంగా అలంకరిస్తున్నారు. ఐతే కథకులు మాత్రం ఎందుకో ఇంకా మందకొడిగానే ఉంటున్నారు. ఇది విచారణీయమైన విషయం. ఆంధ్రేతర ప్రాంతాల్లో కూడ మన భాష, సంస్కృతి బతికి ఉండాలంటే రచయిత(త్రి)లకు రచనలు చెయ్యవలసిన బాధ్యత మామూలుకన్నా ఎక్కువ ఉంటుంది మన అనుభవాల గురించి, సమస్యల గురించి, అన్వేషణల గురించి, ఆవేదనల గురించి మనం కాకపోతే మరెవరు రాస్తారు? రాయగలరు? ప్రవాసాంధ్రుల్లో రచయిత(త్రు)లే చాలా తక్కువ. వీళ్ళలోనూ రాయాలనే కోరిక ఉన్నవాళ్ళు ఇంకా తక్కువ. ఆ కొద్దిమంది లోను సమయం చేసుకుని రాసేవాళ్ళు ఇంకా తక్కువ. భాషను, అనుభవాలను గుర్తుంచుకునే మార్గం ఇది కాదు. రచనాశక్తి ఉన్న ప్రతి ఒక్కరు ఆలోచించవలసిన విషయం ఇది.

తెలుగు వారు సాధారణంగా ఏ విషయమైనా బాగున్నదని చెప్పటానికి ఎంతో సంకోచాన్ని, బాగు లేదని చెప్పటానికి పట్టలేని ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు, ఇది మన నైజం. ఐతే మనం ఉంటున్నది తెలుగునేల బయటగనక మనం ఉంటున్న ప్రాంతాల అలవాట్లు కూడ కొన్ని నేర్చుకోవటంలో తప్పులేదు. అలా, ఉత్సాహంగా చెప్పవలసింది ఏమీ కనిపించకపోయినా అప్పుడప్పుడు మీ అభిప్రాయాలు చెప్తుంటే అవి మాకు మార్గదర్శకాలుగా ఉంటాయి. మీ constructive criticism ను ఎప్పుడూ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాం.