తెలుగు సినిమా పాటల్లో కొన్ని రచనా విశేషాలు

మేము స్కూల్లో చదువుకొనే రోజుల్లో, రేడియోలో వచ్చే సినిమా పాటలు వినటం ఒక పెద్ద వ్యాపకంగా ఉండేది. అప్పట్లో మేముండే పిఠాపురంలో వివిధ భారతి కార్యక్రమాలు వినబడవు కాబట్టి, రెగ్యులర్‌కేంద్రాల్లో నియమిత సమయాల్లో వచ్చే పాటలే గతి. చిత్రసీమ, చిత్ర మాధురి, మధురిమ, మధుమంజరి,చిత్ర సుధ ఇటువంటి చిత్ర విచిత్ర నామాలతో ప్రసారమయ్యే ఈ పాటల కార్యక్రమాలకోసం ఎదురుచూసి వినటం గొప్ప ఎంజాయిమెంటుగా ఉండేది. వీటిలో ఒక సౌకర్యం కూడా ఉంది. ఈ కార్యక్రమాల్లో మధ్యన ఎక్కడా వాణిజ్యప్రకటనల వంటి అప్రస్తుతాంశాలు చోటు చేసుకొనేవి కావు. అందువల్ల, ఏకాగ్రత చెడకుండా పాటలు వినే అవకాశం ఉండేది.

ఇక ప్రతిరోజూ మధ్యాహ్నం గంట పాటు సిలోను రేడియోలో మీనాక్షీ పొన్నుదొరై వినిపించే పాటలొక బోనస్‌. ఇదికాకుండా, అప్పట్లో మా ఊళ్ళో ఉండే సినిమా టాకీసులవాళ్ళు, ప్రతి ఆటకి ముందర కాస్సేపు లౌడుస్పీకర్ల ద్వారా పాటలు వినిపించే సత్‌సాంప్రదాయం ఒకటి అమలులో ఉండేది. “నమో వెంకటేశా, నమొ నమో తిరుమలేశా” అనే ఘంటసాల వారి ప్రార్థనా గీతంతో మొదలయ్యే ఈ కార్యక్రమం ఒక అరగంటసేపు నిరాఘాటంగా కొనసాగేది. వీటిలో విన్నపాటలే మళ్ళీ మళ్ళీ వినటంవల్ల, అవన్నీ “మరపురాని గీతాలు ” గా మనసులో హత్తుకుపోయాయి.

పాటలు వినేటప్పుడు, అందులో రచనను ఫాలో కావటం, రాసిన వారి పేర్లు గుర్తుంచుకోవటం మా యింట్లో అందరికీ ఒక అలవాటు. ఈ అలవాటు కారణంగా కొన్నిపాటల్లో నేను గమనించిన విశేషాలను ఈ వ్యాసంలో ప్రస్తావిస్తాను. ఇందులో క్లాసిక్సునే కాకుండా, అన్ని రకాల పాటల్నీ తీసుకుంటాను. దీని ఉద్దేశ్యం, కొన్ని రచనా వైచిత్రుల్ని గుర్తించటమే గాని, ఉత్తమ రచనల్ని ఎన్నిక చెయ్యాలని కాదు. అందువల్ల కొన్ని మంచి రచనల గురించి చెప్తూనే, ఇతరత్రా విషయాల గురించి కూడా కొంత ముచ్చటిస్తాను.

ఇతర ప్రక్రియల కంటే, సినిమా పాటలలో ఒక ప్రత్యేకత ఉంటుంది. వాటి ద్వారా ఒక సన్నివేశాన్ని ఒప్పించే అవకాశం ఉంది.మాటల రచయత డైలాగ్సుతో ఎలాగైతే ఒక సన్నివేశాన్ని రక్తి కట్టిస్తాడో అదే పనిని పాటద్వారా కవి ఎయ్యగలుగుతాడు.ఈ పనిని అత్యద్భుతంగా నిర్వహిన్చిన ఒక పాట మూగమనసులు సినిమాలో “ముద్దబంతి పూవులో”పాట .”పూల దండ లో దారం దాగుందని తెలుసును, పాల గుండెలో ఏది దాగుందో తెలుసునా” ” అని ప్రశ్నించే ఈ పాటలో వ్యక్త మైన దానికంటే, అవ్యక్తంగా ఉన్నదే ఎక్కువ. ఆ పాత్ర తాలూకు మూగ ప్రేమ, డిసప్పాయింటుమెంటు, అమాయకత అన్నీ ఈ పాటలో నిండి ఉన్నాయి. అయితే, సన్నివేశం నాయిక పెళ్ళి చేసుకొని వెళుతుండటం కావటం వల్ల, అందులో శుభ కామనలే చెప్పబడాలి.

“ముక్కోటి దేవుళ్ళు మురిపి చూస్తుంటారు
ముందు జనమ బందాలు ముడివేసి పెడతారు
కన్నోళ్ళ కన్నీళ్ళు కడుపు తీపి దీవెనలు
మూగమనసు బాసలు మీకిద్దరికీ సేసలు”

ఇంత నిరాడంబరమైన చిన్న మాటల్లో, ఒక పాత్ర స్వభావాన్ని, మానసిక స్థితిని మొత్తంగా తీసుకురావటం వల్ల, యిది గొప్ప పాటగా నిలిచిపోతుంది. ఆత్రేయ రాసిన ఈ పాట తెలుగు సినిమా పాటల్లో రచనా పరంగా అత్యుత్తమమైన వాటిలో ఒకటిగా నేను భావిస్తాను.

ఒక సన్నివేశంతో లేదా కధతో ముడిపడి ఉండకుండా, పూర్తిగా జనరలైజ్‌చెయ్యబడ్డ కొన్ని గీతాలు కూడా నాకు నచ్చుతాయి. అందులోనూ, ముఖ్యంగా, ఒక రకమైన మెలాంకలీని కలిగి ఉండే పాటలు. “రాము ” సినిమాలో దాశరథి రాసిన “మంటలు రేపే నెలరాజా” అటువంటి పాట.

“ఆకాశానికి అంతుంది నా ఆవేదనకు అంతేది?
మేఘములోనా మెరుపుంది నా జీవితమందున వెలుగేది ?”

“మదిలో శాంతి లేనపుడు ఈ మనిషిని దేవుడు చేశాడు
సుఖము, శాంతి,ఆనందం నా నుదుటను రాయుట మరిచాడు”

ఇందులో సున్నితమైన బాధ ధ్వనిస్తుందే కాని, తీవ్ర స్థాయి దుఖం లేదు. ఆ బాధ కూడా, ఓటమి వల్లనా, విరిహం వల్లనా లేదా మరే కారణంవల్లనా అనేది, పాటలో ఎక్కడా ప్రస్తావింప బడలేదు. ఇది ఒక pure and unadulterated melancholy. ఎటువంటి వాళ్ళైనా, మనసు బాగోలేనప్పుడు హాయిగా పాడుకోవచ్చు. ఇటువంటి పాటలు అరుదుగా ఉంటాయి.

ఒకే పాటను కాకుండా , రెండు వేరు వేరు పాటల్ని సరిపోల్చి చూడటం కూడా ఆసక్తి కరంగా ఉంటుంది. ఇది రక రకాలుగా చెయ్యవచ్చు. వీటిలో అన్నిటికంటే సుళువైనది ఒకే సినిమాలో ఉన్న రెండు పాటల్ని తీసుకోవటం. కొంతకాలం సినిమాల్లో ఒక పద్ధతి పాటించేవారు. ఒకే పాట రెండు సందర్భాలలో వస్తుంది. అంటే, ఒకటి పరిస్థితులు బాగుండి సంతోషంగా ఉన్నప్పుడు, మరొకటి పరిస్థితులు క్షీణించి విచారంగా ఉన్నప్పుడు. ఈ రెండు పాటలు ఒకేలా మొదలై, తరువాత క్షీణించి విచారంగా ఉన్నప్పుడు. ఈ రెండు పాటలు ఒకేలా మొదలై, తరువాత పల్లవి లోనో, చరణాల దగ్గరో విడిపోతాయి. ( వీటిని వేరు వేరుగా గుర్తించటానికి, గ్రామ ఫోను రికార్డులమీద ఒకదానికి “నవ్వుతూ” అని , రెండో దానికి “ఏడుస్తూ” అని రాసేవారని గుర్తు) .”చేతిలో చెయ్యేసి చెప్పు బావ” (“దసరా బుల్లోడు “) , “బాబూ వినరా” (“పండంటి కాపురం “), “గున్న మామిడి కొమ్మమీద” (“బాల మిత్రుల కధ “) , “ముద్దుల నా బాబు నిద్దరోతున్నాడు” (“జీవన జ్యోతి “), “ఒసే వయ్యారీ రంగీ” (“పల్లెటూరి బావ “) మొదలైన పాటలు ఈ రకం ఫార్ములా మీద ఆధారపడి వచ్చినవి.ఇటువంటి పాటల్లో కొన్నిసార్లు ఒక పాటలో వచ్చిన వాక్యాన్ని రెండవదానిలో రిఫర్‌ చెయ్యటం ఉంటుంది. ఒక దానిలో “పాడుకొన్న పాటలుపాతబడిపోవని” అంటే రెండోదానిలో “పాడుకొన్నపాటలు పాతవనిమరిచిపో “అనటం వంటివి. అయితే, యిటువంటి సందర్భాలు చాలా తక్కువ. దాదాపు ఇటువంటి పాటలన్నింటిలోనూ రెండు పాటల్నీ ఒకరే రాసి ఉంటారనుకొంటాను. దీనికేమన్నా మినహాయింపు లున్నాయేమో ఎవరైనా సూచిస్తే బాగుంటుంది.

రెండు పాటల ఫార్ములాని సంతోషంవిచారం తెలియజెయ్యటానికే కాకుండా, కాలంలో జరిగిన మార్పును సూచించటానికో, లేదా పాత జ్ఞాపకాలను రేపటానికో ఉపయోగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. దేవదాసు సినిమాలో “ఓ! దేవదా!”, డాక్టర్‌చక్రవర్తి చిత్రంలో “పాడమని ” వంటివి ఈ కోవకు చెందుతాయి. డాక్టర్‌చక్రవర్తిలో రెండు పాటల్నీ వేరు వేరు పాత్రలు పాడతాయి. ఇటీవల వచ్చిన “రాజా” సినిమాలో చాలా కాలం తరువాత ఈ రకం పాటల్ని చూసాను. ఇందులో సీతారామ శాస్త్రి రాసిన “ఏదో ఒక రాగం పిలిచిందీ వేళ” అనే రెండు పాటలూ చాలా చక్కగా రాయబడ్డాయి.

ఇవి కాకుండా,ఒకే కవి వేరు వేరు సినిమాల్లో,ఒకే థీం మీద రాసిన పాటల్ని సరిపోల్చి చూడటం కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ఉదాహరణకి, ఆరుద్ర “సాక్షి ” సినిమాకోసం రాసిన “అమ్మకడుపుచల్లగా” పాటని ఆయనే “పెళ్ళిపుస్తకం” సినిమా కోసం రాసిన “శ్రీరస్తు శుభమస్తు” అనే పాటని తీసుకోవచ్చు. రెండింటిలోనూ పెళ్ళి తంతు వర్ణించబడుతుంది. కాని, రెండింటికీ సిట్యుయేషన్‌లో చాలా తేడా ఉందనుకోండి. మొదటిది అత్యంత బరువైన సన్నివేశం ,రెండోది పూర్తిగా ఆనందకరం ఐనది. ఐతే, ఈ రెండు పాటల్లోనూ, తెలుగు పెళ్ళితంతులో ఉండే వివిధ అంశాలు,వాటి క్రమం మీద ఆయనకున్న పట్టు తెలుస్తుంది. “సాక్షి ” పాటలో “చల్లని అలివేణికిమొక్కరా సన్నికల్లు మీద కాలు తొక్కరా” అని రాసారు. ఇటువంటి వాక్యం బహుశ ఆరుద్ర మాత్రమే రాయగలరనుకొంటాను.

ఆరుద్ర చీరల మీద రాసిన రెండు పాటలు”తూర్పుకు వెళ్ళే రైలు” లో “చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ” అన్న పాట, మళ్ళీ పెళ్ళి పుస్తకంలోదే “సరికొత్త చీర ఊహించినాను ” అనే పాట కూడా ఈ రకంఐన కంపారిజన్‌కి సరిపోతాయి. మొదటి పాటలో నాయకుడు కవి అందుకే, “నే కట్టే పాటను చుట్టి” అని పాడతాడు. పాటంతా రకరకాల చీరల్లో ఆమె సొగసుల్ని పొయెటిక్‌గా వర్ణించటంతో సరిపోతుంది. రెండో పాటలో నాయకుడు డిజైనర్‌ “ఇది యెన్నో కలల కలనేత ” అని పాడతాడు. పాటలో ఎక్కువగా చీర నిర్మాణం గురించి, ఆమె స్వభావం గురించి ఉంటుంది. ఈ రెండూ మంచి పాటలే.

సినారె తూర్పుపడమర” చిత్రానికిరాసిన “శివరంజని! నవరాగిణి ” అనేపాట అప్పట్లో బాగా పాపులర్‌ అయింది. తరువాత మళ్ళీ ఆయనే శివరంజని నుద్దేశిస్తూ “అభినవ తారవో నా అభిమానతారవో” అనే పాట రాసారు. ఇది కూడా మంచి పాట. ఇందులోవాడిన “సుమశర శింజినీ శివరంజనీ! ” అనేప్రయోగం చాలా బాగుంటుంది. ఒక పాట పాపులర్‌ అయ్యాక,మళ్ళీ అదే థీం మీద మరొక మంచి పాట రాయగలగటం గొప్ప విషయం.ఈ జోడుపాటల కేటగిరిలో చివరగా, వేరు వేరుకవులు, వేరు వేరు సినిమాల్లో రాసిన రెండు పాటల మధ్య ఉన్న అనులోమ, విలోమ సంబంధాల గురించి చర్చించవచ్చు.ఇటువంటి సంబంధం గమనించటం కొంచం కష్టం. ఇది కొంతవరకు సబ్జెక్టివ్‌కూడా కావచ్చు. ఉదాహరణకి, “దసరా బుల్లోడు ” సినిమాలో ఆత్రేయ రాసిన “నల్ల వాడే, అమ్మమ్మా అల్లరి పిల్ల వాడే” అన్నపాట ఉంది. ఇది ఇద్దరు నాయికల మధ్య వివాదం “చిన్న వాడే ఓ యమ్మా రాధకే చిక్కినాడే ” అని ఒకామె అంటే, రెండో ఆమె ” లేదమ్మా లేదు రుక్మిణికే దక్కినాడె” అంటుంది. వెరసి, నాయకుడు “నీ వాడంటే నీ వాడ” ని అనుకోవటం దీని సారాంశం. “కలెక్టర్‌జానకి ” సినిమాలో “నీ వన్నది నీవను కొన్నది నే నన్నది ఇలలో ఉన్నది” అనే పాట ఉంది. ఇందులో వివాదం దీనికి వ్యతిరేకంగా ఉంటుంది. “శ్రీనివాసుని ఎదపై నిలిచేది పద్మావతియే కాదా” అని ఒకామె అంటే, “అలివేలుమంగా దూరాన ఉన్నా, ఆతని సతియే కాదా” అని మరొకామె అంటుంది. వారిద్దరూ, నాయకునిపై తమకున్న హక్కుని సమర్ధించుకోవటం దీనిలో అంశం. ఇదొక విలోమ సంధం. రెండు వాదనలకీ పౌరాణిక ఆధారాలుంటాయి.ఈ రెండూ బొమ్మల కొలువు పేరంటం పాటలే కావటం కూడా ఒక విశేషం.

అలాగే “ఆనంద నిలయం” చిత్రంలో ఆరుద్ర రాసిన “పదిమందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే” అనే పాట many to one అనే సంబంధం మీద అధారపడినదైతే, “తూర్పూ పడమర ” చిత్రంలో సినారే రాసిన “స్వరములు ఏడైనా రాగాలెన్నో” అనే పాట one to many లేదా some to many అనే సంబంధాన్ని గురించి ఉంటుంది. ఇది కూడా ఒక విలోమ సంబంధం.

మరొక ఉదాహరణ “కృష్ణవేణి ” చిత్రంలో సినారే రాసిన “కృష్ణవేణీ! తెలుగింటి విరిబోణీ!” అనే పాటలో ఒక మంచి థీం ఉంటుంది. నాయిక నది గురించి పాడుతోంటే, నాయకుడు నాయికనుద్దేశించి పాడతాడు. ఇద్దరి మాటలలోనూ, పొందికైన సారూప్యం ఉంటుంది. “శ్రీగిరి లోయల సాగే జాడల విద్యుల్లతలు కోటి వికసింప జేసేవు” అని ఆమె అంటే , “లావణ్య లతవై నను చేరు వేళ శత కోటి చంద్రికలు వెలిగించు కృష్ణవేణీ ” అని అతనంటాడు. ఇందులో నాయికకీ, నదికీ పోలిక చెప్పబడింది. అదే సమయంలో వారి మధ్య భేదం కూడా పాటించ బడింది. ఒక నది తాలూకు భౌగోళిక వివరాల ప్రస్తావన కూడా ఈ పాటలో ఉంది.

ఐతే, నాయికకూ, నదికీ అభేదం పాటిస్తూ, ఆత్రేయ ఒక పాటలో రాసారు. “చక్రవాకం” సినిమాలో “ఈ నదిలా నా హృదయం పరుగులు తీస్తుందీ” అనే పాటలో ఈ వాక్యాలుంటాయి “అడవి పిల్లల్లే ఎక్కడో పుట్టినది అడుగడుగునా సొగసు పోగుచేసు కొన్నది మలుపు మలుపులో ఒక వంపు తిరిగినది ఏ మనిషికీ మచ్చికకూ రానన్నదీ ” . ఇందులో నదీ, నాయికా ఒకటే. వారి మధ్య పాటించిన పోలిక నిగూఢంగా ఉండి, పాటకు అందాన్నిచ్చింది. ఐతే, ప్రేక్షకుల సౌకర్యార్థం పాటలోని “అడవి పిల్ల ” నాయికేనని ఆ చరణంలో ఆమెకు వాడిన కాస్య్టూముల ద్వారా సూచిస్తారనుకోండి.ఇటువంటి అభేదాన్నే పాటిస్తూ ఆత్రేయ రాసినమరొక పాట “ప్రేమనగర్‌” చిత్రంలో “ఎవరో రావాలి నీ హృదయం కదిలించాలి” అనే పాట. ఈ పాట పైకి వీణ గురించి పాడుతున్నట్టుగా ఉన్నా, దీనిలో భావం నాయకునికి కూడా సరిగ్గా సరిపోతుంది. ఆసాంతమూ ఉద్వేగంతో సాగే ఈ పాట చాలా చక్కగా రాయబడింది. వైద్య శాస్త్రంలో good cholestrol అని వ్యవహరించినట్టు, ఇటువంటి పాటల్ని “మంచి రెండర్థాల పాటలు” గా చెప్పుకోవచ్చు.