ఎటర్నిటీ

ఆకాశం భూమిని తాకేచోట
మేఘాలు కెరటాల్ని సోకేచోట
దిగులు సంధ్యను కళ్ళలో దాచుకొని, హేమంతపు చీకట్లను గుండెల్లో నింపుకొని,
విషాదపు కొండ అంచు మీద ఒంటరిగా పడుకొనివుంది లత.

అప్పుడొచ్చాడు అతను!
నిర్మల భావుకత్వపు కౌశేయ వస్త్రాలు ధరించి, కంఠాన కవితాకల్హారాల మాల దాల్చి,
కళ్ళలోంచి అరుణకవోష్ణపు ఉషస్సులు చిందిస్తోన్న తేజోమూర్తి.

అతని రాకతో చీకటి చిన్నబోయింది. మంచుతెర మలిగిపోయింది. దిగులు దూరంగా పారిపోయింది.
లత నవ్వింది.
వేయిపూవులతావి విశ్వవ్యాప్తమయ్యేలా, కోటిగొంతులపాట కలలప్రాంగణంలో ప్రతిధ్వనించేలా, హాయిగా, స్వేచ్ఛగా, స్వచ్ఛంగా నవ్వింది.
ఆమె గుండెలోని విషాదం కరిగి చక్షుకవాటాల్ని కమ్మేసింది. ఆకన్నీటి వెనుక చావును దాటిన వెలుగు!

“లతా!” అతని గొంతులో మృదుమాధ్వీమందాకిని జలజలించింది.
“…. మరి నే వెళ్ళిరానా..”

లత పెదవుల మీద వీడ్కోలు చిరునవ్వు గుండెలో ఒంటరితనపు నిట్టూర్పు. మౌనంగా తల ఊపింది.
అతను వెలుతురు చిమ్ముతూ వెళ్ళిపోయాడు.

్‌్‌్‌్‌్‌

లత ఎదిగింది. ఇప్పుడామె కళ్ళలో దిగులు స్థానే కారుణ్యపు కాంతులు. ఇంద్రధనుసు చీరలు కట్టి, సింగారాల సిందూరం చుక్క పెట్టి, మనోజ్ఞ తనూవిలాసంతో మైమరపించేలా ఎదిగింది.
కొండల అంచులు దాటి… పంచనదీ జలాలు దాటి… ఇక్షువనాల మీదుగా… ఇసుకతిన్నెల మీదుగా… ఇప్పుడో కాసేపట్లోనో అతనొస్తూవుంటాడని ఎదురు చూస్తూ కూర్చుంది.
అంతలో ఏదో సుగంధభరితపు పవనం, ఏదో దేదీప్యమానమైన కిరణం…
ఆమె మనసుకు తెలిసింది అతడొచ్చాడని!

“లతా..” తియ్యగా పిలిచాడు.
“స్వామీ!” ముగ్ధంగా పలికింది.
“అతి మనోహరంగా వున్నావు సుమా ” ఆమె ఫాలాన్ని ముద్దాడాడు.
సిగ్గుగా నవ్వింది. బుగ్గలు ఎర్రబడ్డాయి. తమకంతో కళ్ళు మూత పడ్డాయి. తేరుకొని చూచేసరికి అతను వెళుతున్నాడు.
“వదిలి వెళుతున్నారా?” తత్తరపడుతూ అడిగింది.
“మళ్ళీ వస్తాగా…” అన్నాడతను బుజ్జగిస్తూ.
వీడ్కోలుగా తనమీది సుమచ్ఛయాల్ని అతనిపై విసరబోయింది. ఆమెను ఆపి, చిలిపిగా నవ్వి, సాగిపోయాడతను.
విరహంగా నిశ్వసించింది లత.

్‌్‌్‌్‌్‌

మళ్ళీ అతని రాక కోసం ఎదురుచూస్తూ కూర్చుంది లత. ఎక్కడినుంచి వస్తాడో, ఎప్పుడొస్తాడో ఆమెకు తెలియదు. నిజానికి అప్పటి దాకా ఆమెకు ఏమీ తెలియదు… నిరీక్షణ తప్ప.
కానీ ఈమధ్య ఆమె ఊహల్లో మకరతోరణాలు, మంగళ వాద్యాలు, పన్నీటిగంధాలు, ముత్యాల ముగ్గులు, రత్నాల రంగవల్లులు, ఏవో అర్ధంకాని పులకరింతలు. ఏవేవో పలవరింతలు.

అతనొచ్చాడు నిదానంగా. ఎప్పటిలా పలకరించ లేదు. ఏదో ఆలోచనల్లో ఉన్నాడు.
“స్వామీ…” అంది రేకుల్లాంటి కళ్ళార్పుతూ.
అతడికి వినిపించలేదు.
“ప్రియా!” అంది ఆర్తిగా.
“లతా!” అన్నాడతడు ఆమె గుర్తొచ్చి.
” నా ఈ జీవితానికి ఆలంబన మీరే ప్రియా! నన్ను మీదానిగా అంగీకరించరూ…?” తన్మయత్వంతో అంది.

అతడు మౌనంగా వెనక్కి చూశాడు. దూరంగా కొద్దిగా మబ్బు పట్టి వుంది.
“… ఇంకా సమయం ఉంది!” అనుకున్నాడు. లతకేసి చూశాడు.
ఉద్విగ్నంగా అతన్నే చూస్తోందామె, సమాధానం కోసం.
అంగీకారప్రాయంగా చిరునవ్వాడు.
లత పులకరించింది. పరవశించింది. మైమరచిపోయింది.
అరమోడ్పుకన్నులతో అతని కాంతిమయదేహాన్ని గుండెలకు హత్తుకుంది.
అతను బరువుగా నిట్టూర్చాడు.
్‌్‌్‌్‌్‌

అతను వస్తున్నాడు. లతను కలుస్తున్నాడు.
క్రమేణా అతని వెనుకనే మబ్బులు రావడం మొదలు పెట్టాయి.
రాను రానూ ఆ మబ్బులు అతన్ని మూసేస్తున్నయి. తమ వెనుక దాచేస్తున్నయి.

“స్వామీ!!” ఎలుగెత్తి పిలిచింది లత.
అతడు నిస్తేజంగా ఆగాడు. అతనితో పాటే మబ్బులూ.
“ఏమయ్యింది?” ఆత్రుతగా అడిగింది.
అతను నీరసంగా నవ్వాడు.
“ఎందుకలా వున్నారు?” కలవరపాటుతో అంది.
అతను మౌనంగా వున్నాడు.
” ఈ మబ్బులేమిటి?” భయంగా ప్రశ్నించింది.
అతను తన శక్తి మొత్తం కూడదీసుకొని ఆ మబ్బుల్ని చెదరగొడుతూ బయిటికొచ్చాడు.

అప్పుడు కనిపించిందది! అతడి గుండెల మీద ఎర్రగా ర..క్త..పు..చా..ర!!

“….స్వా…మీ!!” లత గొంతు విహ్వలంగా ధ్వనించింది.
” ఏం ఫర్వాలేదు ఇది నాకు మామూలే….” ఓదార్పుగా నవ్వే ప్రయత్నం చేసి ఓడిపోయాడతను.
తన మీది పువ్వుల్నీ మొగ్గల్ని చిదిమి వాటి సారాన్ని అతని గుండెపై మందులా పూసింది.
దూరంగా నిలబడ్డ మబ్బులు క్రూరంగా చూస్తున్నయి.

అతను జాలిగా ఆమెకేసి చూశాడు.
“ఇవేవీ విధి వ్రాతనడ్డుకోలేవు…” అన్నాడు విషాదంగా.
” ఇది నా బాధ్యత” దీనంగా అంది లత.
” అది కాదు నువ్వసలే…”
” ఇదీ నా బాధ్యత!” ఖచ్చితంగా అంది.
అతను ప్రేమగా ఆమెను హత్తుకొని ముందుకు సాగిపోయాడు. అతని వెనుకే మబ్బులూ కదిలాయి.
అతను వెళ్ళిన వైపుకి బాధగా చూసింది లత.
నలిగి ఛిద్రమై నేలరాలి ఉన్న మొగ్గలు అప్పుడే రాలిన ఆమె కన్నీటి చుక్కల్లో తడిసి ఎర్రగా మెరిసాయ్‌

్‌్‌్‌్‌్‌

లత మళ్ళీ పూయలేదు. దిగులుగా అతని కోసం ఎదురుచూపులు చూస్తూ కూర్చుంది.
అతను వచ్చాడు.
నల్లటి పెనుమబ్బులు అతన్ని దాదాపుగా కప్పేస్తున్నయి.
” ఎలా వున్నారు?” ఏడుస్తూ అడిగింది.
” బాగానే ఉన్నాను” జీమూతసమూహాల వెనుకనుంచి బలహీనంగా అన్నాడు.
“అబద్ధం!” అంది రోదిస్తూ.
ఆమె కన్నీరు చూసిన మబ్బులు రాక్షసంగా నవ్వుకొంటూ పక్కకు తొలిగాయి.
అతని పరిస్థితి చూసి ఆమెకు మాట రాలేదు. అతని శరీరమంతా రక్తసిక్తమై వడలిపోయి వుంది.

లత ఊగిపోయింది. గిలగిల్లాడి పోయింది.
” ఏం ఖర్మ ఇది… మీ శక్తంతా ఏమైపోయింది?” అంటూ భోరుమంది.
” ఇది ప్రకృతి ధర్మం కాలభ్రమణ ఫలితం… అంతే! నాకిది అలవాటే” జాలిగా అన్నాడు.

తన మీది ఆకుల్నీ లేచివుళ్ళనీ పిండి, పసరులా అతని వంటికి రాసింది.

“లతా! నా గురించి ఆలోచించకు. నిన్ను నువ్వు కాపాడుకో… ఈ మబ్బుల వెనుకే మంచురాక్షసులు
వున్నారు. వాళ్ళనింక ఎక్కువ కాలం ఆపలేను. జాగ్రత్తగా వుండు” అన్నాడతను నిరాశగా.
“మీరు జాగ్రత్త!” దుఃఖంగా అంది.
“ఇంక చాలు పద పద!!” అన్నయి మబ్బుల వెనుక వికటాట్టహాసాలు.

“వెళ్ళాలి” అన్నాడు లతతో. అతని స్వరం నీరసంగా వుంది, ఏదో బాధను అణచిపెట్టినట్లుగా.
నెత్తురోడుతున్న దేహాన్ని అతి ప్రయత్నం మీద కదిలిస్తూ అతను వెళ్ళి పోయాడు.
అతని వెనకే వెళ్ళి హఠాత్తుగా అరుపులతో కేకలతో నల్లగా ఒక్కసారిగా అతన్ని మూసేశాయి మబ్బులన్నీ.
అది చూసిన లత మూర్ఛ పోయింది.

్‌్‌్‌్‌్‌

అతను మళ్ళీ రాలేదు. అతని జాడ కూడా తెలియలేదు.
అతను లేని అదను చూసుకొని, చీకటి మళ్ళీ ప్రపంచాన్ని చుట్టేసింది.
అతన్ని జయించిన మంచు రాక్షసుల కర్కశత్వం లతను పాతాళ కుహరం లోకి తొక్కేసింది.
మూసుకుంటున్న ఆమె కళ్ళలో అతని రూపమే నిలిచింది. ఆగిపోతున్న ఆమె గుండెలో అతని ధ్యానమే పలికింది.
ఆ ఆవేదనలోనే బాధగా మూల్గుతూ ప్రాణాలు వదిలింది లత.
అయినా అతను రాలేదు!
లత లేని లోకంలో ఒక్కసారిగా నిశ్శబ్దం. బావురుమనే నిశ్శబ్దం. మంచుశిలలాంటి నిశ్శబ్దం.
బహుశా అతను మళ్ళీ వస్తేగానీ ఏ హృదయమూ పలుకదు. ఏ లతా పల్లవించదు. ప్చ్‌…

చివరిగా ఓ మాట

ఎన్నాళ్ళ ఆలోచనో ఇది. ఒక సాధారణమైన విషయాన్ని తీసుకొని, అయెనెస్కో లా అసంబద్ధంగా, డిలాన్‌థామస్‌లా విశృంఖలంగా, బ్రెక్ట్‌లా అసంపూర్ణంగా వర్ణించాలని. తీరదనే అనుకున్నాను

సరిగ్గా అలాంటి సమయంలోనే తిలక్‌గారి “మణిప్రవాళం” చదవడం సంభవించింది. అంతే అప్పటివరకూ అస్పష్టంగా కదలాడుతున్న ఊహలకు ఒక సరైన ఆకారం ఏర్పడినట్లయింది ఓ ఆధారం దొరికినట్లనిపించింది. మరో పావుగంట తర్వాత ఈ ఎటర్నిటీ పూర్తయ్యింది.

ఈ కథ తిలక్కి అనుకరణ కాదు ఆయన భాష దీనికి ప్రేరణ! పాత్రల విషయానికొస్తే ఆమె ఒక పూలతీగ అతను సూర్యుడు. వసంతం నుంచీ శిశిరం దాకా ప్రకృతిలో జరిగే వివిధ వైచిత్య్రాల సారమే ఈ ఎటర్నిటీ!

దీనిపై మీ అభిప్రాయాల్ని సూటిగా తెలియజేస్తే సంతోషిస్తాను.

భవదీయుడు.
ఇలపావులూరి.