తొలి జన్మదిన ప్రత్యేక సంచిక!

సాధారణంగా తెలుగు వాళ్ళకి సాహిత్య చర్చల్లో కూడా అసలు విషయాల గురించి కాక వ్యక్తుల వ్యక్తిగత విషయాల మీదే ఆసక్తి ఎక్కువ. ఈ పత్రిక నడుపుతున్నవారి పేర్లు public గా announce చెయ్యటం వల్ల బహుశ focus ని పత్రిక మీద నుంచి మా మీదికి తిప్పుకోవటం తప్ప ఎవరికీ ఏమీ ప్రయోజనం ఉండదని ఇంతకాలం ఈవిషయంలో ఎంతో వెనకాడేం. ఐతే కొందరు రచయిత(త్రు)లు యీ సమాచారం లేని కారణంగా తమ రచనలు పంపటానికి వెనకాడుతున్నారని కర్ణాకర్ణిగా విన్న”ఈమాట” శ్రేయోభిలాషులు కొందరు మా చెవిని వెయ్యటంతో “ఈమాట” జన్మ దినోత్సాహ సందర్భంగా అలాటి వారి సందేహాలు తీర్చటానికి ఆ వివరాలు ఇక్కడ ఇస్తున్నాం. ఇప్పటి వరకు “ఈమాట” ను ప్రోత్సహిస్తున్న వారు ఇంకా ఉత్సాహంగా ఆ పని చేస్తారని, ముందు వెనకలు చూస్తున్న వారు వారి సందేహాలు తీరి ముందుకే వచ్చి ఈ team effort లో పాల్గొంటారనీ మా ఆకాంక్ష.

కె. వి. ఎస్‌. రామారావు ముఖ్య సంపాదకుడు
విష్ణుభొట్ల లక్ష్మన్న సంపాదకుడు
కొంపెల్ల భాస్కర్‌ సంపాదకుడు
కొలిచాల సురేశ్‌ సంపాదకుడు

1998 మే జూన్‌ నెలల్లో కనకప్రసాద్‌, లక్ష్మన్న, భాస్కర్‌, నేనూ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సస్‌,ఆస్టిన్‌ ఆవరణలో ప్రశాంతంగా ఉండే ఓ చర్చ్‌ పార్కింగ్‌ లాట్‌లో కలిసి లంచ్‌ చేస్తూ సాహిత్య విషయాలు ముచ్చటించుకునే వాళ్ళం (కనకప్రసాద్‌ ఇప్పుడు ఆస్టిన్‌ నుంచి మరో చోటుకు వెళ్ళినప్పటికి అతను చూపించిన ఆ చోటు అప్పుడప్పుడు మేం కలుసుకోవటానికి యింకా బాగానే పనికొస్తోంది అతనిక్కడ లేని లోటుని గుర్తుచేస్తూ!) ఓ రోజు మాటల సందర్భంలో ఇక్కడ తెలుగులో రాసే రచయితలకు తమ రచనలు ప్రచురించటానికి ఇండియాలోని పత్రికలు తప్ప మరో చెప్పుకోదగ్గ మార్గాలు లేకపోవటం గురించిన చర్చ వచ్చింది. మర్నాడు ఎందుకో ఆ విషయం ఆలోచిస్తుంటే తట్టింది ఓ ఎలెక్ట్రానిక్‌ పత్రిక మొదలెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన. సురేశ్‌, లక్ష్మన్న, భాస్కర్‌ పనిలో పాలుపంచుకోవటానికి ఉత్సాహం చూపించారు.మా ఇంట్లో కలిసి రెండు మూడు వీకెండ్స్‌ ఈ విషయం చర్చించాం.ముందుగా కొందరు పరిచితులైన అనుభవజ్ఞుల అభిప్రాయాల కోసం వారిని సంప్రదించాం. దాదాపుగా అందరూ ఉత్సాహం చూపించారు; జాగ్రత్తలు చెప్పి ముందుకు సాగండని ప్రోత్సహించారు. వారందరికీ మా కృతజ్ఞతలు! 1998 అక్టోబర్‌లో తొలి సంచిక వెలువడింది gif files వాడుతూ. శ్రీ చోడవరపు ప్రసాద్‌ embedded fonts వాడితే చాలా బాగుంటుందనీ అందుకు కావల్సిన సాంకేతిక విషయాలు తను చూస్తానని ముందుకొచ్చారు. ఐతే పత్రిక సంచికల్ని తయారుచెయ్యటం కూడ చిన్నపని కాదు. ఈ సాంకేతిక కార్య నిర్వహణం అంతా తను చూస్తానని శ్రీ కొలిచాల సురేశ్‌ అప్పట్నుంచి ఆ పని చేస్తున్నారు. (ప్రస్తుతం అతను ఇండియాలో ఉన్నందువల్ల ఈ సంచికను మిగిలిన వాళ్ళం సమీకరించాం.) శ్రీ ప్రసాద్‌ “లేఖ” సర్వర్‌ మీద ఈ పత్రికను ఉంచటానికి శ్రీ జువ్వాడి రమణ అనుమతి పొందారు. ఇవీ ఇప్పటి వరకు “ఈమాట” పరిణామ దశలు.

ఈ సంవత్సర కాలంలోనూ మేం ఎన్నడూ ఊహించని స్థాయిలో పాఠకులు ఈ పత్రికను ఆదరించారు. రచయిత(త్రు)లు మాత్రం ఇంకా కొంచెం మందకొడిగా ఉంటున్నారు. “ఈమాట” ఇలా బాలారిష్టాలు దాటటం వారి సందేహాల్ని తొలగించి రాయటానికి ప్రోత్సహిస్తుందని ఆశిస్తాం.

ఈ webzine మూడు ఆశయాల్తో ప్రారంభించాం.

మొదటిది భారతదేశం బయట ఉంటున్న తెలుగు వారి జీవన విధానాల్ని,అనుభవాల్ని ప్రతిబింబించే రచనలకి, వాటి రచయిత(త్రు)లకి ఒక వేదిక కల్పించటం.
రెండోది ఈ వేదిక రాజకీయ, కుల, మత, వర్గ ధోరణులకి, వ్యాపార కలాపాలకి దూరంగా ఉండేట్టు చూడటం.
మూడోది Internet technology ని వీలైనన్ని విధాల ఉపయోగించుకుంటూ ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ తేలిక మార్గంలో అందేట్టు చూడటం.

ఈ ఏడాది కాలంలో “ఈమాట” పరిణామం గమనిస్తే ఈ మూడు ఆశయాల్లోను కొంతవరకు కృతకృత్యులమయ్యామనే అనిపిస్తుంది. ఐతే ఇందుకు మేము నిమిత్తమాత్రులమని మా నమ్మకం. సాంకేతిక సమస్యలు పరిష్కరించిన వారు, రచయిత(త్రు)లు, పాఠకులు, తానా, వంగూరి ఫౌండేషన్‌ ఇందరు శ్రేయోభిలాషుల కృషి ఫలితం ఇది.

ముందుముందు “ఈమాట” ఇంకా ఎక్కువమంది రచయిత(త్రు)లు, పాఠకులతో విస్తరిస్తుందనీ, ఇందుకు అందరూ తమ సొంత బాధ్యతగా చేతనైన సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం.