మృత్యువుతో తొలి పరిచయం

ఆటల్లో మునిగినా ఎట్లా గమనించారో, ఎవరు ముందుగా చూశారో తెలియదు, పిల్లలంతా గుమికూడారు దాని చుట్టూ..వాళ్ళ కేకలూ, చిందులూ చిటికెలో వదిలేసి.. ఎంత ఎగరాలని చూస్తున్నా ఎగరలేకపోతోందది.. జబ్బో..ఆకలిదప్పులో దాని సత్తువంతా లాగేసాయి..ఎంత చిన్న పిట్ట..లేత,ముదురు గోధుమ రంగుల్లో.. చిన్నదో పెద్దదో తెలియదు వయసులో..ఏ దూరదేశాల పయనంలో ఏ గాలి మోసం చేసిందో, లేక ఈ చుట్టుపక్కల ఏ గూటి నుంచి జారిపడిందో తెలియదు.. పిల్లలప్పటికే ఎంతో దయతో దాన్ని చేర దీశారు..రెక్కల్లాంటి తమ మెత్తటి వెచ్చటి అరిచేతులతో..హడావుడిగా నీళ్ళూ, గింజలూ పరిగెత్తుకొచ్చాయి.. ఒక డబ్బా దానికి గూడయింది.. దాంట్లో దానికి పచ్చిక పడక ఏర్పాటయింది..ఈ మధ్యలో దాని ఆయువు ఎప్పుడొ ఎగిరిపోయింది. అది తెలిసీ తెలియగానే పిల్లలంతా గొల్లుమన్నారు..వలవల ఏదుపులు..ధారలుగా కన్నీళ్ళు.. అప్పటికప్పుడే దానికో పేరు.. ఫాల్కో… ఒక గుంట తవ్వి దాన్ని పూడ్చిపెట్టారు..అర్థాకలీ, ఆరిపోయిన కన్నీటి చారికలే మిగిలాయా పూటకి..మరెన్ని మరణాలకు సరిపోను మిగుల్చుకున్నారో కన్నీరు మరి!

ఆ పాతిపెట్టిన తావునే ఇవాళ ఓ మొక్క మొలిచింది..రెండాకులు రెక్కల్లా రెపరెపలాడుతూ.. ఎగ్రలేకపోయినా ఎగరాలాని ప్రయత్నిస్తూనో.. పైనపోయే పిట్టల్ని రారమ్మని పిలుస్తూనో… పిల్లలకెంత సంబరమో ఆ మొక్కను చూసి!

రచయిత చంద్ర కన్నెగంటి గురించి: జననం గుంటూరు జిల్లా సౌపాడులో. నివాసం గ్రేప్‌వైన్‌, టెక్సస్‌లో. సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్నారు. కథలు, కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. కథనంలో శిల్పంలో వీరు చూపించే విభిన్నత అపూర్వం.  ...