ఇది తెలుగులో ఎలా పుట్టింది? మీకు తెలియనిది ఒకటి ఉంది. అదేమిటంటే ఇదే సమయంలో అమెరికన్లు కూడా మీలానే ఇదే ప్రశ్న వేసుకుంటున్నారు. ఇక ర్యాండమ్ హౌస్, మెక్‌మిలన్, పెంగ్విన్, హార్పర్ కాలిన్స్ వంటి పెద్ద పెద్ద ప్రచురణ సంస్థల్లోని పెద్ద తలకాయలెన్నో తెగిపడబోతున్నాయి. ఎందుకంటే ఈ ప్రశ్నకు సమాధానం వారికీ తెలియక, అవసరం తీరేలోపు వారికది దొరకక.

రాత్రి ఎక్కడికీ పోదు, గమనించావా? మిట్ట మధ్యాహ్నం పూట కూడా. అనంతమైన ముక్కలుగా, అది అన్నిచోట్లా దాక్కొని ఉంటుంది. ఒక చెట్టు ఆకు ఎత్తి చూడు. దానికింద దాక్కుని ఉన్న చీకటి వీచిక ఒకటి తటాలున వేరులోకి పాకిపోయి తలదాచుకుంటుంది. ఎటుచూసినా– నడవాల లోపల, గోడల వెనుక, ఆకుల కింద–రాత్రి, ముక్కలైపోయి పీలికలుగా తచ్చాడుతూ ఉంటుంది.

మానవాళిలో విస్తరిల్లిన ద్వేషాన్ని నేను ఇంధనశక్తిగా మారుస్తాను. అస్థిమూలగతమైన ద్వేషాన్ని లోలోపలే ఆపుతున్న ఆ తలుపులు మనం తెరచి, దానికి అడ్డు లేకుండా సమాజంలోకి ప్రవహించనిస్తే, ఈ పచ్చ బొగ్గు–అవును, పచ్చగా పసరులాగా మనలో పేరుకుపోయే ఈ పైత్యరసప్రకోపితద్వేషాన్ని, నేను పచ్చబొగ్గు అని పిలుస్తున్నాను–మన కర్మాగారాలను మళ్ళీ నడిపిస్తుంది.

మరుసటి రోజు, వాళ్ళమ్మాయి రాత్రికి రాత్రి మాయమైపోయిందని తెలుసుకున్నాక, వాడి అత్తవారింట్లో పెద్ద గొడవ మొదలైంది. ఒక వారం వరకూ ఆమె కోసం అక్కడా ఇక్కడా వెతికారు. ఎవరికీ ఈ సంగతి గురించి తెలియనివ్వలేదు. కానీ తర్వాత, అమ్మాయి వాళ్ళ అన్నయ్య నా దగ్గరకి వచ్చాడు. అతడికి తోడుదొంగనైనట్టు మొత్తం కథ చెప్పుకు రావాల్సి వచ్చింది.

ఇప్పటికీ ఆరోజుని తల్చుకుంటే గుండె మెలిపెట్టినట్టుగా ఉంటుంది–నా పెదాలతో ఆమె పెదాలని అందుకోవాలని ముందుకు వంగాను, అలవాటుగా ఆమె కళ్లలో వాడికోసం చూశాను. ఆ కనురెప్పల కిందగా కనిపించి చేయి ఊపాడు. వాడి కళ్ళల్లో ప్రయత్నపూర్వకంగా దాచుకుంటున్న విషాదం. చప్పున వెనుతిరిగి ఆమె కంటిపాప లోలోపలికి పరుగెత్తిపోయాడు.

ఇవి సాధారణమైన వెండినాణేలు– గుండ్రటి అంచులు, అచ్చుపోసిన అంకెలు, తగరపు మెరుగు. అయితే, వాటి మీద ఏదో కంటికి కనిపించని ఒక ప్రత్యేకమైన ముద్ర ఉంది. కొత్తవాళ్లకి శ్మశాన శాంతిని ప్రసాదించే ఆ నాణేలు మాత్రం విశ్రాంతిని ఎరగవు. వాటిల్లో ఉన్న ఏదో దురద వాటిని చేతి నుంచి చేతికి, పర్సు నుంచి పర్సుకీ మార్చుతూనే ఉంటుంది. ఎంతవరకూ అంటే… అహా అలాకాదు, మొదటినుంచీ వరసలో వద్దాం.

ఈ స్థావర, జంగమ సిద్ధాంతాన్ని కుడి, ఎడమ కులాలతో పోల్చడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తమిళదేశంలో భూస్వాములను కుడిచేతి వర్గంగా, ఇతర వృత్తికారులను ఎడమచేతి వారిగా వ్యవహరిస్తారు. బసవ పురాణంలోని భక్తుల కథలు, ఉదంతాలు చాలావరకు ఈ ఎడమ కులాల వారి నుండే ఉంటాయి. అంటే వృత్తికారులు, వ్యాపారులు, చాకలివారు, కుమ్మరులు, చర్మకారులు మొదలైనవారి కథలు. రైతులుగాని, వారి పాలేరులైన మాలల కథగాని ఒక్కటి కూడా కనబడదు. కానీ ఎడమ కులాలవారి కథలతో నిండి వారి సిద్ధాంతాలకు అద్దంపడుతుంది బసవ పురాణం.

ఒక్కసారి గుండె మీద వేయి శతఘ్నుల పోటు. ఊపిరి అందడం లేదు ఇవాన్‌కి. పెద్ద గోతిలో పడిపోతూండగా చివర్లో కనిపించిన ఓ వెలుగు. ఓ పక్కకి వేగంగా వెళ్తూంటే నిజంగా అటుగాక మరో వ్యతిరేక దిశలో వెళ్తూన్న భావన. ‘హమ్మయ్య, ఇదేదీ నిజం కాదన్నమాట. సరే మరేది నిజం?’ ఇవాన్ మనసులో కొత్త ఆలోచన రూపు దిద్దుకోవడం తెలుస్తోంది, అన్నింటినీ ముంచేసిన కొత్త నిశ్శబ్దం లోంచి.

మనుషులు మనుషులని చంపారు. ఆడవాళ్ళని చెరిచారు. భవనాల్లోని ఎండిన కట్టెలు, నోరులేని ఇటుకలను కూడా అదే చేశారు. ఆ తుఫానులో ఆడవాళ్ళని నగ్నంగా నిలబెట్టారని, వారి రొమ్ములను కోశారని విన్నాడు. అతడు చుట్టుపక్కల చూస్తున్నవన్నీ నగ్నంగా, ప్రాణం లేకుండా తెగి పడున్నాయి.

ఎలాంటి సంకోచం లేకుండా చెబుతున్నాను, బాల్యంలో నేను ‘చడ్డీ రాస్కెల్’ని. ఉదయం లేచిన వెంటనే అమ్మానాన్నలు ఇద్దరూ ‘పాయిఖానాకు వెళ్ళు’ అని ఎంత చెప్పినా ‘రావటం లేదు’ అని జవాబిచ్చి రెండు రెండు రోజులు వెళ్ళకుండా ఉండిపోయేవాణ్ణి. గబ్బువాసన వచ్చే ‘పాయిఖానా’ ఆ చిన్న వయస్సులో ఎలా ఇష్టమవుతుందో చెప్పండి? దానికి బదులుగా మిఠాయి అంగడికి వెళ్ళమంటే రెండు రెండు సార్లు వెళ్ళటానికి సిద్దంగా ఉండేవాడిని.

అంబాలా ఛావనీలో ఆమె దందా బాగా నడుస్తుండేది. ఛావనీలో తెల్లవాళ్ళు ఆమె దగ్గరకు తాగి వచ్చేవారు. ఒక మూడు నాలుగు గంటల్లో ఆమె షుమారు పదిమందిదాకా తెల్లవాళ్ళను తృప్తి పరచి ఇరవై ముప్ఫై రూపాయలదాకా పుట్టించేది. ఈ తెల్లవాళ్ళు దేశీలకన్నా మంచివాళ్ళు. వాళ్ళేం అంటున్నారో సుల్తానాకు అర్థం అయేది కాదు నిజమే కాని వాళ్ళ భాష అర్థం కాకపోవటం అనేది ఆమెకి బాగా ఉపయోగపడింది.

అదబే-లతీఫ్‌ మాస పత్రికలో, నా కథ ఒకటి కాలీ సల్వార్ పేరిట 1942లో అచ్చయ్యింది. దీనిని అందరూ అశ్లీలమని అన్నారు. ఇది పచ్చి అబద్ధం. కథలు రాయడం నా వృత్తి. నాకు సాహిత్యపు అన్ని లక్షణాలతోనూ పరిచయముంది. నేను ఇంతకు మునుపు ఇలాంటి అంశాల మీదే అనేక కథలు రాసున్నాను. వీటిలో ఏ కథ కూడా అశ్లీలం కాదు. నేను ఇకపై కూడా ఇలాంటి అంశాల గురించి రాస్తాను. అవేవీ కూడా అశ్లీలమవ్వవు.

క్షమించండి. ఒక్కసారిగా ఏడుపొచ్చేసింది. ఇదీ ఈ తలుపు కథ. దొడ్డమ్మకి వాళ్ళు వెళ్ళినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికీ బాగా గుర్తు. రోజా చెప్తూనే ఉంటుంది. పెదనాన్న పంచె, తలపాగా కట్టుకున్నారు. చిన్న నాగలి భుజాన వేసుకుని వెళ్ళారు. నాన్నా, అన్నయ్యా పాంటూ చొక్కా వేసుకున్నారు. గమ్మత్తు ఏమిటంటే, ఇలాటి చల్లటి శీతాకాలం సాయంత్రాలల్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఎందుకనో తెలీదు కానీ వాళ్ళొస్తారని నాక్కూడా అనిపిస్తుంది.

రాజప్ప నాగరాజు ఆల్బమ్‌ను చూపించమని అడగలేదు. అయితే వేరేవాళ్ళు చూసేప్పుడు ఆ పక్కకే తిరగనట్టు ముఖం పెట్టుకుని ఓరకంట చూశాడు. నిజంగానే నాగరాజు ఆల్బమ్‌ చాలా అందంగా ఉందని తెలిసింది. రాజప్ప ఆల్బమ్‌లో ఉన్న స్టాంపులు నాగరాజు ఆల్బమ్‌లో లేవు. సంఖ్య కూడా తక్కువే. అయినప్పటికీ ఆల్బమ్‌ చూడటానికి నాణ్యంగా, చాలా అందంగా ఉంది. దాన్ని చేతిలో పెట్టుకుని ఉండటమే గొప్పగా అనిపిస్తుంది. అలాంటి ఆల్బమ్‌ ఈ ఊరి అంగళ్ళలో దొరకదు.

రాముడు పరిపూర్ణ మానవుడనో, అవతార పురుషుడనో భావించేవారికి శూర్పణఖ వృత్తాంతం వంటి సమాధానపడవలసిన అంశాలతో సమస్యలెదురౌతున్నాయి; అటు సంప్రదాయ వ్యాఖ్యాతలకూ ఇటు భారతీయ విధ్యార్థులకూ కూడా. ఇటువంటి వృత్తాంతాలు కావ్యం యొక్క చారిత్రక ప్రామాణికతను రుజువు చేస్తాయని కొందరు వాదిస్తారు. ఇవి నిజం కాకపొతే వాల్మీకి ఎందుకు నాయకుడికి అపకీర్తి తెచ్చిపెట్టే ఇటువంటి సన్నివేశాలను సృష్టిస్తాడు?

నువ్వొచ్చి నన్ను ఎలా చూస్తావు? ఏ రూపంలో?
మబ్బుల్లేని నక్షత్రం లాగానా, లేక నీళ్ళమీద పొరలాగా
అంచెలంచెలుగా తాకుతూ పరుగెత్తే చిల్లపెంకు లాగానా?
నీకు ఏదైతే బాగుండదో నాకు తెలుసు,
కోయిల కుహూ కుహూల మధ్య నిశ్శబ్దం, నీకు బాగుంటుంది.

ఆవేళ, క్రీడామైదానంలో ఉండుండి వినిపించే ఆర్భాటం ఆకాశాన్ని ముట్టడించినట్టు, ఆ పిలుపు నా మనోవీధిలో మోగింది. చల్లటి జలపాతం తలని తొలిచేస్తున్న ఆ సమయంలోనే, నరాలలో వేడినీళ్ళు ఎక్కించినట్టు రక్తం వెచ్చబడుతూ… ఆ నిముషం గడిచిపోకుండా నా మదిలో నిలిచిపోవాలని ప్రార్థించాను. పొత్రాల్లాంటి వృషణాలున్న మంచి కోడెగిత్త రంకెలాంటి ఆ పిలుపు విన్న తర్వాత, నా మనోవీధిలో అగుపించిన దృశ్యాలు… వాటిని వివరించడం అతి కష్టం.

నేను కెనడాకు విహార యాత్రికుడిగా రాలేదు. నా దరఖాస్తుల్లోనూ, విచారణల్లోనూ చెప్పినట్టు మా దేశంలో జరుగుతున్న యుద్ధం నుండి ప్రాణాలు కాపాడుకోడానికి కట్టుకున్న భార్యని, దేవతల్లాంటి నా పిల్లల్నీ వదిలేసి తప్పించుకుని వచ్చినవాణ్ణి. నా కుటుంబాన్ని ఎలాగైనా పోషించుకోవచ్చన్న ఆశతో మూడు నెలలపాటు అష్టకష్టాలు పడుతూ ప్రయాణం చేసి వచ్చాను. ఫ్లయిటెక్కి నేరుగా అలా వచ్చి ఇలా దిగలేదు.

వాడు నాగరికుడు
వాడిక్కొంచం తేనీరు కావాలి
కూర్చున్న కుర్చీని
పెద్దమోతతో వెనక్కి తోసి లేస్తాడు
బాత్రూమ్ తలుపును
గట్టిగా తెరచి ఆపైన
ఢామ్మంటూ మూస్తాడు