వచ్చే అతిథులు అసమాన ధీరులైన కురువీరులు. అంతే కాదు, వారికంటూ ప్రత్యేకమైన రుచులు కూడా ఉన్నాయి. అందువల్ల పాకశాసనుడు పాకశాలాధిపతిని పిలిపించి పాండవకౌరవాదులలో ఎవరెవరికి ఏయే వంటకాలు వడ్డించాలో ఎవరికేది వడ్డించకూడదో చాలా వివరంగా చెప్పాడు. ఏమైనా తేడాలు వస్తే నరకానికి పంపేస్తానని హెచ్చరించాడు కూడా. అన్నీ జాగ్రత్తగా విన్న వంటపెద్దకి బెంగ పట్టుకుంది. ఇంద్రుడు చెప్పిన వివరాలన్నీ గుర్తుపెట్టుకొనడం ఎలా?

రెడ్డీ అల్లుడూ అరగంటలో కారు దిగేసరికి గుడి చుట్టూ జనం పోగై ఉన్నారు వింత చూస్తూ. డబ్బులు ముట్టుకోవడానికి ఎవరికీ ధైర్యం లేదు. వినాయకుడి డబ్బా, మజాకా? సాక్షుల్లేకుండా ముట్టుకుంటే జైలూ, దేవుడి డబ్బులు ముట్టుకుంటే నరకమూను. అదీకాక ఈ హుండీ తెరవాలంటే బేంకు వారు రావాలి; దేవుడిది ధర్మఖాతా కదా? కానీ బేంకు వారు గంట పది దాటకుండా, ఆఫీసులు తీయకుండా అలా వచ్చేస్తారా? కొన్నిసార్లు వచ్చేస్తారు మరి.

ప్రద్యుమ్నుడికి వంటచేయడం హాబీ కాదు. తినడమే కానీ వంట చేయడం రాదని సగర్వంగానే చెప్పుకుంటాడు. భార్య ఎప్పుడైనా, చాలా అరుదుగానైనా పుట్టింటికి వెళ్ళినప్పుడు కూడా ఇంట్లో వంట చేసుకునే వాడు కాదు. ఆ పది పదిహేను రోజులు బ్రహ్మచారుల మెస్సులోనే నేపాలీ వంట తినేసేవాడు. జోర్హాట్‌లో ఆ కాలంలో వంటమనిషి దొరికేవాడు కాదు. అందుకని ఇన్‌స్టిట్యూట్ కేంటీనులో ఒక నేపాలీ వాడిని కుదుర్చుకున్నారు.

నడి రేయి దొంగ! దొంగ! పట్టుకో! పట్టుకో​మ్మని ​ రామయ్య కేకలు బెట్టె. ‘దొంగోడు సంచీ​ బట్టుకోని లగెత్తాడు​ గురవయ్యా!’ అంటానే ఆడి ఎంటబడ్డాడు రామయ్య. ఎనకమాల్నే మేవూ పరుగునొస్తన్నాం. ఆడ్ని ఎట్నో అందుకోని చేతిలో ఉన్న కర్రతో కాలిమీద ఒక్క దెబ్బేసినాడు. ఆడు ​సచ్చాన్రా నాయనో అనరిచినాడు​. ​అదే ఊపులో ఇంక రెండు దెబ్బలు బడినా​యోడికి​. ​ఆ దెబ్బకి ​ఆడి చేతిసంచీ జారి కింద​బడ్డాది.

ఒకసారి అలానే ఏడిపించడానికి అబ్బాయి పెళ్ళి కుదిరిందా అనడిగితే, అమ్మాయి, ఆఁ, కుదిరింది అనింది మెల్లగా. అబ్బాయి ఖంగు తిన్నాడు. ఎప్పుడన్నాడు. నిన్ననే! చూడిదిగో, ఈ అల్లిక పని ఉన్న దుపట్టా! వాళ్లిచ్చిందే, అని చూపించి వెళ్ళిపోయింది. ఇంటికెలా చేరుకున్నాడో అతగానికి తెలియలేదు, దారి పొడుగునా — ఒక పాపను తోసేసినదీ, ఒక వ్యాపారి చిల్లరంతా కింద పడేసినదీ, కుక్కపై రాయి విసరినదీ, పాలు పారబోసుకున్నదీ, ఒక మడి బామ్మకు ఢీకొట్టి గుడ్డివాడనే బిరుదు సంపాయించుకున్నదీ ఏమీ గుర్తులేదతనికి.

“ఈయనకి తెలియని విషయం లేదు. తెలుగు, పద్యాలు, పాటలు, యోగా, జ్యోతిషం, హస్త సాముద్రికం, పాద సాముద్రికం, నుదిటి మీద గీతలు చదవడం, వైద్యం, ఇంజినీరింగు, లా అండ్ ఆర్డర్, బస్కీలు తీయడం, కబడ్డీ, వాలీబాల్ అలా మీరేది చెప్పినా అందులో ఈయన నిష్ణాతుడని ఈయన స్వంత అభిప్రాయం. అక్కడతో పోతే బాగుణ్ణు కానీ ప్రజలందరూ ఈయన్ని చూసి, ఈయనకిన్ని కళలెలా వచ్చాయబ్బా అని ఏడ్చుకుంటున్నారనీ, కుళ్ళుకుంటున్నారనీ ఈయననుకుంటూ ఉంటాడు.”

రాజు తన జీవితం గురించి చెప్పిన తరువాత నాకు కూడా అదే పద్యం గుర్తొచ్చి వాణ్ణడిగాను. ‘ఇండియన్లు అమెరికా జేరడమంటే ఆకాశాన్నందుకోవడమేనని నిర్ధారిస్తే, నువ్వేమిటి ఇలా ఆకాశాన్నుంచీ మెట్లు దిగుతూ వచ్చి ఇక్కడ అడవుల్లో చేరావ్? ఒక యూనివర్సిటీ వాళ్లు కాదంటే నీకున్న పేరుతో ఇంకో యూనివర్సిటీకి వెళ్లచ్చు. అలాగే, ఒక కాలేజీ వాళ్లు కాదంటే ఇంకొక కాలేజీకీ, ఒక హైస్కూల్ నచ్చకపోతే ఇంకొక హైస్కూల్ వెళ్లి వుండచ్చు గదా?’

ఏమో. ఇప్పుడు నేను చేయాల్సిన పని? ఇరవై ఐదు సంవత్సరాల క్రితం తులసి ఇంటికి ఎందుకు వెళ్ళానో ఇప్పుడు మళ్ళీ అందుకే వెళ్ళాలి. తను విషయం చెప్పేలోగా ఆమె ‘హుష్’ అంటూ గదిలోకి తీసుకెళ్ళి తలుపులు మూసి ఏడుస్తుంది. పిల్లలు వింటే పరువు పోతుందని. కోడలు చూస్తే జీవితమే నాశనమైపోతుందని, కొడుకు ఛీ కొడ్తాడని కారణాలు చెబుతుంది. ‘విహారికేం చెప్పమంటావ్’ అని అడుగుతాను. అప్పుడు చెప్పిన మాటే ఇప్పుడూ చెప్తుంది. కారణాలు మాత్రమే వేరు.

సుప్రసిద్ఢ కథ పాతాళ భైరవికి గాను యోగ్యుడైన, అర్హుడైన కథానాయకుడు కావలెను. రూపములో, గుణములో, ధైర్యసాహసములలో, సత్ప్రవర్తనలో, ఇన్నినాళ్ళూ ఈ కథకు నాయకుడిగా ఉండి, ప్రజల మనసును చూరగొన్న తోటరాముడిని మరిపించి, మురిపించగలిగే దిట్టయి ఉండవలెను. యుక్తితో, శక్తితో మాయావి మాంత్రికుడిని మట్టి కరిపించి, రాజకుమారిని పరిగ్రహించి, పాతాళ భైరవి ఆశీస్సు…

ఇంతలో ఉన్నట్టుండి కుక్క శరీరం బిగుసుకుంది. కదలకుండా ఊపిరి బిగబట్టి నేలలో వున్న నెర్రె వైపే చూస్తూన్న దాని శరీరంలో వెంట్రుకలన్నీ అదో మాదిరి ఉద్వేగంతో నిక్కబొడుచుకున్నాయి. ఆమెకి అర్థం అయింది. వంటింటి గోడ కింద వున్న నెర్రె వైపే తనూ చూస్తూ చేతి కర్ర అందుకుందామె. చిన్న కంతలోంచి గాజు గోళీల్లాంటి రెండు చిన్న కళ్ళు కదలకుండా బయటికి చూస్తున్నాయి. ఆమె ఇంకా మెల్లిగా చేతి కర్ర పైకెత్తింది.

వద్దు. పాప జాగ్రత్త. పాపకేమన్నా కావాలంటే చేసి పెట్టు. కానీ, మనసేదోలా ఉంది. ఏవో పాత సంగతులు చుట్టూ తిరుగుతోంది మనసు. బంగారం మొత్తం అమ్మేయడం, ఆ సంగతి మామగారింట్లో తెలియడం, వాళ్ళ ముందు తలవంపులు, బిడ్డకు టాబ్ కొనివ్వలేక అబద్ధం చెప్పడం, ఖాళీ అయిన కొట్టు పరిస్థితి, పరువు పోయిన సందర్భం- వీటన్నింటి ముందూ గుర్తొచ్చే బంగారు పతకం, మార్కుల షీటు, సాహిత్య సంపద తెచ్చిన బహుమానం, పాఠాలు విన్న పిల్లలు అప్పుడప్పుడూ చేసే నమస్కారాలు, మనసంతా బరువెక్కింది.

“తమ్ముడూ, ఇప్పుడు మనం జీవితంలో చరమాంకాన్ని చేరుకున్నాం. ఇప్పటివరకూ చేసిన పాప పుణ్యాలూ, ఆచరించిన ధర్మాధర్మాలు ఒక్కటే మన వెంటే వచ్చేవి. మనం ఐదుగురం అతిరధ మహారధులుగా ఉండీ వస్త్రాపహరణం సమయంలో ఏమి చేయగలిగాం? భగవంతుడైన కృష్ణుడు తన స్వంత కొడుకుగా పుట్టిన తర్వాత కూడా వచ్చి విడిపించేవరకూ దేవకీ వసుదేవులు కారాగారంలోనే కదా బతికినది? ఎవరి పుణ్యఫలం వారిది. చివరిదాకా నువ్వు బతికి ఉంటే మాత్రం ద్రౌపది కష్టాలు పడదని రూఢిగా చెప్పగలవా?

మనం చిన్నప్పుడు ఎట్లా స్నేహితులమయ్యామో నాకు గుర్తే లేదు. మీ నాన్న జేబులో సిగరెట్లు నేను కాజేసి తెచ్చి బలవంతంగా నీతోటీ తాగిస్తే పట్టుబడినప్పుడు తప్పంతా నీమీద వేసుకుని తన్నులు తిన్నావు గుర్తుందా? పరీక్షలో నాకు సాయం చేయబోయి పట్టుబడ్డావు. ఇన్నేళ్లూ మన స్నేహం చెక్కు చెదరలేదు. నువ్వొక్క ద్రోహం మాత్రం చేశావు. అది నీకు తెలుసు. అయినా నీ స్నేహం ముఖ్యం నాకు. తెలీనట్లే ఉండిపోయాను. క్షమాపణలేవీ అక్కర్లేదు. మనం మనుషులమే కదా!

తాను ఈమధ్యే ఒంగోల్లో చూసొచ్చిన కొండవీటి దొంగ సినిమా ఎత్తుకోని వైనవైనాలుగా చెప్పడం మొదలుపెట్టాడు కోటిగాడు. సినిమా కతలు చెప్పమంటే యమాజోరు కోటిగానికి. స్టోరీ అయిపోతూండగానే కుంట వచ్చేసింది. అక్కడ ఎక్కువ వెయిటింగు లేకుండానే దోర్నాల పోయే బస్సు వచ్చేసింది. కిక్కిరిసిపోయి ఉంది. వీళ్ళకి సీట్లు దొరకలా. కండక్టరు మా ఒడుపుగా అందరిమధ్య దూరిపోతూ టిక్కెట్లు కొట్టేసి తన సీట్లో దర్జాగా కూచున్నాడు.

ఏం వాగుతున్నావురా? దేవుడంటే అనంతం కదా? అలా మెళ్ళో వేలాడదీసుకుని ఎక్కడికంటే అక్కడికి తీసుకుపోయేవాడు దేవుడెలా ఔతాడు? ఒళ్ళు కొవ్వెక్కి నిజానిజాలు తెలియక మాట్లాడుతున్నావు కాబోలు. విను, దేవుడంటే మా బ్రహ్మ ఒక్కడే. ఆయనే ఈ సృష్టి అంతట్నీ సృజించి లయం చేస్తూ ఉంటాడు. ఆయన్ని గుర్తుంచుకోవడానికి అనేకానేక గుళ్ళూ, గోపురాలు కట్టాం. ఓ సారి గంగాతీరం పోయి చూసిరా.

అందరూ గోతిలో పడిపోయి గోల పెడుతున్నారనుకుంటే ఆయన లాంటి వాళ్ళకి ఒక తృప్తి. జనాన్ని పిల్చి ‘ఇదిగో చూడండి. పాపం వీడు గోతిలో వున్నాడు. కష్టాల్లో వున్నాడు. అమాయకుడు. ఎలా బ్రతకాలో కూడా వీడికి తెలియదు. నేనే వీడిని కనిపెట్టి చేరదీసి జీవితాన్ని బాగుచేసుకోవడమెలాగో నేర్పిస్తున్నాను,’ అని చెప్పుకోవడం సరదా. ఎందుకంటే బాధల్లో బలహీనతల్లో వున్న వారి గురించి చెప్పుకుంటేనే కదా ఆయనలాంటి వాళ్ళకి పేరూ ప్రఖ్యాతి. ఒకళ్ళని ఉద్దరిస్తున్నామంటేనే కదా వాళ్ళకి ప్రత్యేకత!

కేవలం దుఃఖాలకీ ఆనందాలకీ తప్ప అసలైన కళా ప్రదర్శనలకి వేటికీ నిన్ను స్టేజీ ముందర కూర్చోబెట్టలేకపోయానని నాకు విచారంగా వున్నది – ఇప్పుడే కాదు, ఎప్పటినించో! నవ్వకు – నా ఖర్మ కాలి ఇలా మంచానికి బందీ నయి కళ్లు మూతలు పడినప్పుడే నాకు సంగీతమూ, నృత్యమూ ఏవీ రావు అని గుర్తుకొచ్చి బాగవగానే ఈసారి తప్పకుండా నేర్చుకోవాలని అనిపించేది. తరువాత లేస్తానా, అదేమిటో, వాటి విషయమే పూర్తిగా మర్చిపోతాను. పోనీ, ఫాతిమాకి అవేమైనా వచ్చా?

ఆ రోజు రాత్రి తీర్థయ్యకు మళ్ళీ అదే కల వచ్చింది. చౌరంగీ రస్తాకు రెండువైపులా లక్షల సంఖ్యలో జనం నిలబడి ఉన్నట్టూ, వాళ్ళంతా రాతివిగ్రహాలై నిశ్చలంగా నిలబడినట్టూ, దారికి రెండువైపులా పెద్దపెద్ద తెల్లటి నియాన్ దీపాలు వెలుగుతున్నట్టూ! ఆ దారంతా రక్తం! అక్కడ నిలబడి ఒక నడివయస్సు స్త్రీ ఛాతీని రెండు చేతులతో బాదుకుంటూ, ప్రవీర్! ప్రవీర్! అంటూ విలపిస్తోంది. ఆమె విరగబోసుకున్న పొడుగాటి జుట్టు ముఖం మీద పడుతోంది.

నిసి ఒక్కసారిగా లేచి, విక్టర్‌కి ఎదురుగా పరుగెట్టింది. టెరేస్ మీదకు కాలు పెట్టబోతున్న వాడిని ఆ ఆఖరు మెట్టు మీదే నిలబెట్టి, గాఢంగా కౌగిలించుకుంది. వారి ఎత్తులు సమాన మయ్యాయి. ఆమె అతని ముఖం చేతుల్లోకి తీసుకుని, అతని స్ఫుటమైన, ముద్దుల కాహ్వానిస్తున్నట్టుగా ఉండే విలువంపుల పెదవుల మీద తన గులాబీ పెదవుల ముద్దు ఉంచి, అలాగే నిలిపి ఉంచింది. దీర్ఘంగా అతని శరీరపు పరిమళాన్ని ఆఘ్రాణించింది. విక్టర్ అప్రయత్నంగా, ఆమెను చుట్టివేశాడు.

ఈ కవితలో మీరు సుమారు నాలుగు వందల మాటలు వాడారు. కలగా పులగంగా సమాసంలో కలిపేసిన మాటలని ఒక మాట గానే లెక్క పెట్టాము. మేము సాధారణముగా మా పత్రికలో ఇరవై-ఇరవై ఐదు లైనులకు మించిన కవితలని అచ్చు వెయ్యము. మా పత్రికలో మొదటి పేజీలో కవిత అచ్చయితే, ఆ కవితకి, రాసిన కవికీ పద్ధెనిమిది క్యారెట్ల బంగారు పతకాలు ఇచ్చి సన్మానించే సంస్థలు, స్వాములు, పీఠాధిపతులూ, ఉన్నారని మీకు తెలుసు.