మంద్రమైన అనుభూతులవేవో లోకాల నుంచి
గాలుల్లాగా నాలోంచి నాలోకి వీచాయి

మధురమైన సంగీతమదేదో అమరంగా
నిలిపింది పురాస్మృతుల్ని ఒక గానంగా

దేవుడు పని చెయ్యడు
భక్తుడు పని చెయ్యడు
నెత్తిన నెమలీక పెట్టుకుని ఒకరు
తాబేటి చిప్ప పట్టుకుని మరొకరు
బజారు తిరుగుతారిద్దరూ
దేవుడికీ భక్తుడికీ మధ్య రొమాన్స్ కవిత్వం
మీరా, రూమీ, అన్నమయ్య ఎవర్నేనా అడుగు

వంటింటి నుంచే జీవితం ప్రారంభమైనప్పుడు
వంటింటినెలా వదిలేస్తాం
మనోద్వారాలను గెలిచే మార్గాలు
అక్కడినించే ఉన్నాయన్న
పెద్దలమాట ఉండనే ఉంది కదా
అదీ స్త్రీత్వపు మాయతెరగా కనిపించినా
అదే వాస్తవం

ఇవాళ నువ్వేది మాట్లాడినా వింటాను
సిగ్గును రెండు ముక్కలు చేసి
మనసును రెండు చెక్కలుగా కోసి
ఎందుకంటావా?
అవ్యక్తాల్నిలా ప్రేమించినందుకే
అందుకే వింటాను చెప్పు

ఆకలేసి అన్నం అడగలేదు నిన్ను
దాహమై మంచినీళ్ళు అడగలేదు
బట్టల్లేక దుస్తులూ అడగలేదు
ఒఖ్ఖ చిరునవ్వు అడిగాను
బజారులో సిగ్గులేక

ఇక్కడ నేను శూన్యాన్ని మోస్తున్నాను
నా ఒక్కరి ఖాళీనే మోస్తున్నానా ఏమిటి
ఎందరెందరిదో
ఇక్కడ నేను శవాన్ని మోస్తున్నాను
నా ఒక్క శవాన్నే మోస్తున్నానా ఏమిటి
ఎందరెందరివో

ఊరి చివర వాడలో
ఒంటరిగా ఉంటాడు
డప్పు మోగమంటేనే
ఊరు లోకి వస్తాడు.
ఆదివారం దండోరా!
పాములోయ్ పహారా!