మంగళవారమో, బుధవారమో సాయంత్రం మా పిల్లలు ఆడుతూ ఆ దీగుడు తలుపు తెరిచారు. అందులో రెండు అరలీటర్ పేకెట్లు కనబడినై, జున్నయిపోయి! అంటే, యాదయ్య ఆదివారం నాడు మాకు పాలు వద్దని చెప్పిన విషయం మరిచిపోయి వుంటాడు కాబట్టి వేశాడు. పైగా ఖర్మకొద్దీ ఆ రోజున ఓనరంకుల్ గేటు తీయకముందే వచ్చివుంటాడు. లేదంటే, మా ఓనర్ వాళ్లయినా చెప్పివుండేవాళ్లు.

ఇప్పుడే ఇదే దృశ్యాన్ని– భార్య తన కమిలిన చేతిని సాయంత్రం ఇంటికి వచ్చిన భర్తకు చూపించే సన్నివేశాన్ని– యథాతథంగా సాహిత్యంలోకి తేవడం ఎట్లా? దీన్ని డ్రమటైజ్ చేశామా, వాస్తవం పక్కకు పోతుంది; పోనీ ఉన్నది వున్నట్టు చెప్దామా, ఆ ఎఫెక్ట్ రాదు. అందుకే, సాహిత్యం చెప్పగలిగేది జీవితమంతటిది ఉండొచ్చు గానీ, జీవితం మొత్తం తన పూర్తి ముఖంతో సాహిత్యం లోకి వస్తుందన్న నమ్మకం నాకు కలగడం లేదు.

అది జరిగిన తర్వాత, చాలా నెలల పాటు, ఆ సన్నివేశం నాకు మళ్లీ మళ్లీ గుర్తొచ్చేది. నేనా పెద్దాయనను చిన్నబుచ్చి వుంటానా? పక్కవాడు పాదాభివందనం చేసినప్పుడు, నా నుంచి కూడా ఆయన అదే ఆశించి వుంటాడా? అసలు ఆయన పట్టించుకున్నాడా? కానీ ఇద్దరి మర్యాదలోనూ స్పష్టమైన తేడా కనబడినప్పుడు, లిప్తమాత్రంగానైనా గమనించకుండా ఉంటాడా?

అక్కడకు ఎలా వెళ్లాలి? వెళ్లినా అసలు ఎలా అడగాలి? నేను ఏ పనిని కూడా అలా చేసేయలేను. దాని గురించి కొంత ఆలోచించాలి; మథనపడాలి; గింజుకోవాలి; అప్పటికి గానీ సంసిద్ధుణ్ని కాలేను. అందులో భాగమే ఆ మానసికపు కసరత్తంతా!