ఈమాట సాహితీకుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు!

ఈమాట ఒక కొత్తరూపు దిద్దుకుని మాసపత్రికగా మారి, కొత్తగా మరికొన్ని కొత్త పుంతలు తొక్కి ఈ సంచికతో ఏడాది. రచయితల సహకారం, పాఠకుల ప్రోత్సాహం– నాణ్యతతో ఏమాత్రమూ రాజీ పడకుండా ఈమాటను మాసపత్రికగా ఇక నడపగలమనే నమ్మకాన్ని మాకు ఇచ్చాయి. అందువల్ల ఇకనుంచీ కూడా ఈమాట మాసపత్రికగానే రాబోతున్నది. ఈ సాహితీప్రయాణంలో మాకు తోడుగా నిలిచిన రచయితలకు, పాఠకులకు, ఎన్నిసార్లు చెప్పినా ఎక్కువకాని కృతజ్ఞతలు మరొక్కసారి.

డిటిఎల్‌సి వారి సాహిత్య విమర్శ వ్యాసపోటీలలో ప్రథమ బహుమతి గెలుచుకున్న మానస, జిజ్ఞాసల వ్యాసాలు– ఆ వ్యాస సంకలనం విడుదలయిన సందర్భంగా–ఈ సంచికలో ప్రచురిస్తున్నాం; గత ఏడాదిగా తెరచాటు-వులు వినిపించిన శ్రీనివాస్ కంచిభొట్లకు మా కృతజ్ఞతలు. ఈ సంచికతో ఆ ధారావాహిక ముగుస్తున్నది. ముందుముందు వారినుంచి మరిన్ని చలనచిత్రకథనాలను ఆశిద్దాం; ఈమాటలో గత ఆరునెలలుగా వచ్చిన పాఠకుల వ్యాఖ్యలపై టి. చంద్రశేఖర రెడ్డి ఆసక్తికరమైన విశ్లేషణ; కొత్త సంవత్సరం సందర్భంగా ఈమాట పాఠకులకోసం భైరవభట్ల కామేశ్వరరావు కూర్చిన ఒక స్పెషల్ గడి; కథలూ, కవితలూ, శీర్షికలూ…

ఇంతేరా ఈ జీవితం, తిరిగే రంగుల రాట్నము అనే పాట 1966లో వచ్చిన రంగులరాట్నం సినిమాలోది. రాసినది ఎస్. వి. భుజంగరాయ శర్మ. ఈ పాట ఎంతో ప్రాచుర్యం పొందింది. భారతీయ తాత్త్విక దృక్పథాన్ని మొత్తం రంగరించి శర్మ ఈపాటలో నింపారంటారు శ్రీరమణ, శర్మగారి 92వ జయంతి (డిసెంబర్ 15న) సందర్భంగా రాసిన తన నివాళి వ్యాసంలో. అలాగే, వెంపటి చినసత్యం, పట్రాయని సంగీతరావులతో కలిసి కూచిపూడిత్రయంలో ఒకరిగా పేరుపొందిన భుజంగరాయ శర్మ తన పదం ద్వారా ఆ నాట్యకళకు చేసిన మరవలేని సేవను, మనిషిగా వారి మహనీయతనూ పరామర్శిస్తారు తను మాత్రమే చెప్పగలిగే మాటల్లో; ఆ రంగులరాట్నం సినిమా తీసిన బి. ఎన్. రెడ్డి మీద అప్పుడు రాసిన వ్యాసం తరువాత, వారి ఆకాశవాణి ఇంటర్‌వ్యూ ఇదే సంచికలో ఇప్పుడు పరుచూరి శ్రీనివాస్ అందించడం కాకతాళీయమే అయినా సందర్భోచితం; రజనీకాంతరావు, సంగీతరావుల గురించి కొడవటిగంటి రోహిణీప్రసాద్ ఒకప్పుడు ఈమాటలో రాసిన వ్యాసం ఈ సందర్బంలో గుర్తుచేసుకోవడం సముచితం; సాహిత్యవిమర్శలో ఒక సరి అయిన బాట పరుస్తున్న చామర్తి మానస తన ఐదుకవితలు శీర్షికలో కవి రవి వీరెల్లి గురించి, అతని కవితాసంపుటి కుందాపన గురించి చేసిన విమర్శాసమీక్ష; పూడూరి రాజిరెడ్డి కథాసంపుటిపై జి. ఉమ రాసిన సమీక్షాపరిచయం; యాత్రాసాహిత్యకుడు, సాహిత్యయాత్రికుడు దాసరి అమరేంద్ర కొత్త పుస్తకం నుంచి ఒక అధ్యాయం; ఇంకా కవితలు, కథలు, శీర్షికలూ…

అధివాస్తవికతావాదం 1950, -60 దశకాలకల్లా సాహిత్యాన్ని దాటి చిత్రకళానాటకరంగాలలో ప్రవేశించి ఒక గొప్ప సాంస్కృతిక ప్రభంజనంగా పరిణమించింది. ఆ అధివాస్తవికోద్యమానికి పారిస్ నగరం కేంద్రం కాగా అందులో చిత్రకారుడు స్టాన్లీ హేటర్ చిత్రశాల ఆట్లియే 17 కేంద్రబిందువు అయింది. బెకెట్, పికాసో, బ్లిన్, ఆఖ్‌త్వాఁ వంటి ఎందరో కళాకారుల సమక్షంలో పెరిగిన ఆగీ హేటర్ ఒక చక్కటి కవి, రచయిత, నటుడు, అనువాదకుడుగా ఎదగడంలో ఆ దశకాల ప్రభావం ఎంతో ఉంది. ఆనాటి పారిస్ నాటకరంగం, అబ్సర్డ్ థియేటర్ గురించి, నాటకరంగంలో తన ఎదుగుదల గురించి రాసిన ఆత్మకథాత్మక వ్యాసం షోబిజ్ డేస్ – నాగరాజు పప్పు అనువాదం; భారతదేశానికి సంబంధించినంతవరకు భావవ్యక్తీకరణ విషయంలో జరిగే తిరుగుబాటుకీ కులవ్యవస్థకీ ఉన్న సంబంధం ఎలా కీలకమైనదో వివరిస్తూ, బెంగళూరు పెన్‌ సంస్థ నిర్వహించిన లేఖన-2017 కార్యక్రమంలో ప్రసిద్ధ తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ ప్రసంగపాఠం – అవినేని భాస్కర్ సమర్పణ; తెలుగువారందరికీ సుపరిచితమైన యమాతారాజభానసలగం అనే నెమానిక్ ఎలా ఏర్పడి వుండచ్చో వివరిస్తున్న ఛందస్సులో గణితాంశములు వ్యాసం – జెజ్జాల కృష్ణ మోహన రావు; అంతుచిక్కని వింతదేవుడిపై కొనసాగుతున్న సురేశ్ కొలిచాల వ్యాసం; ఇంకా, కథలు, కవితలు, పద్యసాహిత్యం, తెరచాటువులు, గడి నుడి…

తెలుగు పాత్రికేయ సాహిత్య రంగాలలో సుప్రసిద్ధుడైన మోహన్ గురించి ఆయనొక కార్టూనిస్టు అనో తెలుగులో మొట్టమొదటి గ్రాఫిక్ ఆర్టిస్టు, ఆనిమేషనిస్టు అనో మాత్రమే చెప్పి ఇప్పటిదాకా ఎవరూ ఆగిపోలేదు, ఇక ఆగిపోలేరు కూడా. చక్కటి ఆర్టిస్ట్ కావడం ఆయనలో కేవలం ఒక పార్శ్వమే. సాహిత్యకారుడు, కళా విమర్శకుడూ అయిన ఆయన ఎందరు రచయితలూ కళాకారులపై ఎంత ప్రభావం చూపింది, మోహన్ ప్రాంగణం ఎలా ఎందరో సాహిత్యకళాకారులకు ఒక పిట్టలు వాలే చెట్టు అయింది, ఆ నీడన ఎన్ని కొత్త కుంచెలు రంగు నింపుకున్నది, ఆయన మరణంతో వెల్లువెత్తిన నివాళులు, జ్ఞాపకాల తలపోతలు ఊహామాత్రంగానే మనకు పట్టిస్తాయి. అకాలంగా వెళ్ళిపోయిన ఆ విశిష్టకళాకారుడు, స్నేహశీలి, మోహన్‌కో నూలుపోగు: ఆయన గీతను పరిచయం చేస్తూ శివాజీ తల్లావజ్ఝల, గోవిందరాజు చక్రధర్ చేసిన ఒకనాటి ముఖాముఖీ; మారిషస్ వంటి బహుభాషీయదేశంలో తెలుగు రెండవభాషగా నేర్చుకునే వారి భాష, లేఖనాలపై పరభాషల ప్రభావం గురించి వివరిస్తూ రాజ్వంతీ దాలయ్య పరిశోధనావ్యాసం; అంతుచిక్కని వింతదేవుడు అంటూ గణపతి గురించి ఒక టీజర్ మాత్రమే ఇచ్చి ఎందరినో తన వ్యాసం కొరకు ఎదురుచూసేలా చేసిన సురేశ్ కొలిచాల వ్యాసం; ఇంకా, కథలు, కవితలు, వ్యాసాలు, సమీక్షలు, శీర్షికలూ…

సాహిత్య విమర్శ అనేది (మనం ప్రస్తుతం వాడుతున్న అర్థంలో) తెలుగు సాహిత్య రంగానికి స్వతస్సిద్ధమైన లక్షణం కాదు. ఇది పాశ్చాత్య ప్రభావం వల్ల వచ్చినది కావడంతో ఆ ఆధునిక విమర్శాపద్ధతులు మనకు సరిగా బోధపడలేదు, మనం అలవర్చుకోలేదు కూడా. విమర్శ సాహిత్యాన్ని నిర్వచించబూనుకోదు. ఎందుకంటే నిర్వచనాలు సాహిత్యాన్ని సంకుచితం చేస్తాయి. సిసలైన విమర్శ సాహిత్యాన్ని వివరించి విస్తరిస్తుంది. పాఠకులలో సాహిత్యాభినివేశం కలిగిస్తుంది, పెంచుతుంది. ప్రస్తుత సాహిత్యరంగంలో—పొగడ్తలు తప్ప మరేమీ స్వీకరించలేని రచయితలు; ఏ రచననైనా పొగడడం లేదా తెగడడం అన్న రెండే పద్ధతులు పాటిస్తూ, రచన ఏం చెప్తున్నదో కూడా పూర్తిగా చూడకుండా వస్తువునో, శైలినో, వచనాన్నో– ఇలా తమకు నచ్చిన ఏవొక్క అంశనే ఎంచుకుని, తమ అభిప్రాయాలనే సాహిత్యసత్యాలుగా ప్రకటించే విశ్లేషకులు; రచయితల మనసులు నొప్పించకుండా వారి సాహిత్యాన్ని కేవలం ‘పరిచయం’ చేసే సమీక్షకులు, కొల్లలుగా కనిపిస్తూ—విమర్శ అన్న పదానికి, ఒక రచనను దాని సాహిత్యలక్షణ పరిథులలో వైయక్తికాభిరుచులకావలగా విశ్లేషించడం అనే అర్థం పూర్తిగా మాయమయిపోయింది. ఈ సమయంలో, సాహిత్యంలో విమర్శ అవసరాన్ని గుర్తించి ‘సాహిత్య విమర్శ ఎలా ఉండాలి?’ అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహించి, ఆ దిశగా మొదటి అడుగు వేసిన డెట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ (DTLC) వారికి ధన్యవాదాలు. ఈ పోటీలో పాల్గొని బహుమతులు గెల్చుకున్న–చామర్తి మానస, జిజ్ఞాస సోమనాథం (ప్రథమ); జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి(ద్వితీయ); రెంటాల శ్రీవేంకటేశ్వర రావు (తృతీయ)–రచయితలకు ఈమాట తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. విజేతల వ్యాసాలు, మరి కొందరు తెలుగు ప్రముఖులు ఇదే అంశంపై ప్రత్యేకంగా రాసిన వ్యాసాలు కలిపి ఒక పుస్తకంగా డిటిఎల్‌సి వారు త్వరలో తేబోతుండడం సాహితీప్రియులందరికి సంతోషం కలిగించే విషయం.

“నేను ఒంటరిని. మీరు ఒంటరి. మనం పరస్పరం స్పర్శించుకున్న క్షణాల్లో కూడా మనతో మన ఒంటరితనం.” అని ముగిస్తాడు నడచి వెళ్ళిన దారి అనే కథను డా. వి. చంద్రశేఖరరావు. వర్తమాన తెలుగు సాహిత్యంలో అతనిది ఒక విభిన్నమైన పంథా. ఒక ప్రత్యేకమైన కథనం. కథనం గురించి ఏ వొక్కమాట అనబోయినా రూపవాదులని ముద్ర వేస్తున్న ప్రతికూల వాతావరణంలో కూడా ఆయన ప్రపంచ సాహిత్యాన్ని, ప్రత్యేకించి లాటిన్ అమెరికన్ సాహిత్యాన్ని, లోతుగా చదువుకుని తనదంటూ ఒక అద్భుతమైన కథన పద్ధతి సృష్టించుకుని గొప్పగా కథారచన చేశాడు. కాఫ్కా తన రచనల్లో ఎక్కడా ఒక్క మాట కూడా చెప్పకపోయినా ఆ లోకమంతా ఒక చీజీకటి, వ్యాకులతతో ఒక అర్థరహితమైన వాతావారణం పరచుకుని ఉండడం కాఫ్కా పాఠకులందరికీ అనుభవమైన విషయం. తెలుగులో చంద్రశేఖరరావు ఆ పని చేయగలిగాడు. తన రచనల్లో ఎక్కడా ఒక్క మాట కూడా అనకుండా ఒక భయోద్విగ్న విషాద వాతావరణాన్ని పాఠకులకు అనుభవైకవేద్యం చేశాడు. నిజజీవితంలో ఎంతో మృదుస్వభావి అయిన చంద్రశేఖరరావు “నా కథలు, నాలోపలి నిశ్శబ్దాలు, సంచలనాలు, నిలువనీయని ఉద్వేగాలు. నేను నడచి వచ్చిన కాలాన్ని, దాని నడకల్ని, మనుషుల్ని, మనుషుల కలల్ని, గాథల్ని, వాళ్ళ గాయాల్ని రికార్డు చేశాయి.” అని చెప్పుకున్నాడు. తనదంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని తెలుగు సాహిత్యంలో రికార్డ్ చేసి తాను మాయమైపోయాడు.

చెవుల్ని చితకకొట్టే సినీ సంగీతం ఓ పక్కన హోరెత్తుతున్నా ఎందరో చిన్నారులు అపురూపంగా సంప్రదాయ సంగీతం మనం చెవులు అప్పగించి వినేలా పాడటం ఎలా జరుగుతోందీ? నాటకమైనా, నాట్యమైనా, చిత్రకళయినా అన్నిటికీ ఎంతో కొంత ముచ్చట తీర్చే మార్గాలున్నాయి. ఇదే స్థితి మన ప్రాంతీయ, ప్రాచీన చిత్ర శిల్ప కళల దగ్గరికొచ్చేసరికి కథ మారింది. సంగీతం, నాట్యం, కొద్దో గొప్పో నాటకం ప్రజలకు పరిచయం అయినంతగా చిత్ర శిల్పకళలు పరిచయం అయినట్టు లేదు. అందుకని, చిన్న పిల్లలకు కళాదృష్టి ముందునుంచే సంగీత సాహిత్యాలవలే అలవాటు చేయటం మన బాధ్యత అని, చిత్ర శిల్ప కళల పరిచయం పెంచడం, పెంచుకోడం వాడుక భాషాఉద్యమం, గ్రంథాలయ ఉద్యమం, ప్రాంతీయ, విప్లవ ఉద్యమాలవంటిదే కాబట్టి మనం ఉద్యమించక తప్పదని శివాజీ తమ కళకాలమ్ శీర్షిక రెండోభాగంలో నొక్కిపలుకుతున్నారు; యాత్రలకు ధనమూ సమయమూ అవరోధాలు కావు. భాష, భద్రత, రక్షణ అధిగమించలేని సమస్యలు కానే కావు. ఎక్కడి మనుషుల్లో అయినా కనిపించేది మన ప్రతిబింబమే! అని తమ ట్రావెలాగ్ ద్వారా వివరిస్తున్నారు దాసరి అమరేంద్ర; ఇటీవలే మరణించిన సినారెకు నివాళి; ఎమ్.ఎస్. సుబ్బులక్ష్మిపై వచ్చిన పుస్తకపరిచయం; మరొక అద్భుతమైన పద్యపరిచయం… ఈ సంచికలో.

అసలు ‘చూడటం’ మొదలుపెడితే ‘కనబడటం’ మొదలై అది అనంతంగా మనం చచ్చేదాకా మన కన్నే మనకు బోలెడు చెబుతుంది. అసలు ముందస్తుగా కళాత్మకమైనవాటిని, కళాఖండాలని, తరచుగా విరివిగా చూడటం అలవాటయితే సామాన్యులనే అసమాన్యులకి ‘కళ’ వీలయినంత దగ్గరవుతుంది – అంటూ ఈ సంచిక నుంచి చిత్రకళను పరిచయం చేస్తూ చిత్రకారుడు, కళావిమర్శకుడు అయిన తల్లావజ్ఝుల శివాజీ కళకాలమ్; సహజమైన బంధాన్ని సంకెళ్లతో బంధించిన సమాజపు కట్టుబాట్లతో విసిగిపోయిన స్త్రీ ఏ సృష్టినైతే నిరాకరించిందో, తిరిగి ఆ సృష్టినే కోరుకోవడం గురించి వాయుగుండ్ల శశికళ కథ పునరావృతమ్; సంచారమన్నది మనిషి సహజ ప్రవృత్తి అయినపుడు, తమ ప్రయాణాల అనుభవాలను అక్షరరూపంలో నిక్షిప్తం చేయడమన్నది రెండువేల సంవత్సరాలుగా సాగిపోతున్నపుడు, యాత్రాసాహిత్యమూ సాహిత్యమే నంటూ తెలుగులో వచ్చిన యాత్రాచరిత్రలపై విహంగవీక్షణం చేస్తున్న దాసరి అమరేంద్ర సమీక్షా వ్యాసం తెలుగులో యాత్రాసాహిత్యం; కవిసమ్రాట్ మొదటి నాటిక నర్తనశాల శబ్దతరంగాలలో…

తెలుగువారు ఇప్పటికీ ఎప్పటికీ గొప్పగా చెప్పుకునే మిస్సమ్మ, మాయాబజార్, పాతాళభైరవి, జగదేకవీరుని కథ వంటి సినీమాలను తన కెమేరా కంటితో అంతటి కళాఖండాలుగా తీర్చిదిద్దిన ఘనత మార్కస్ బార్ట్‌లీది. ఏ డిజిటల్ సాంకేతికత లేని ఆ రోజుల్లోనే ఆయన చూపిన ప్రతిభ అసమానమైంది. దక్షిణభారత చలనచిత్ర చరిత్రలో బార్ట్‌లీది ప్రముఖ పాత్ర. ఆయన శతజయంతి సందర్భంగా జెజ్జాల కృష్ణ మోహన రావు నివాళి ఛాయామాయావి: మార్కస్ బార్ట్‌లీ; విచిత్రంగా, ఒక రాజు వల్ల కృష్ణునికీ అర్జునునికీ యుద్ధం జరిగింది. అర్జునుడి రథసారథి శల్యుడు. ఒక్క ధర్మరాజుని తప్ప, అర్జునునితో సహా అతని సైన్యం మొత్తాన్ని కృష్ణుడు తన చక్రధారతో చంపేసి, ఆ తర్వాత, కృపతో ఉభయ సైన్యాల వీరులందరినీ తిరిగి బతికించిన ఒక చిత్రమైన కథ. అందులో ఒక అప్సరస అశ్వంగా మారిన వైనం, తద్వారా మన సంప్రదాయ కథాకథన పద్ధతినీ ప్రస్తావిస్తున్న భైరవభట్ల కామేశ్వరరావు శీర్షిక నాకు నచ్చిన పద్యం; సాదత్ హసన్ మంటో ప్రసంగం, నవరసాల పద్య రసాయనం, కథలు, కవితలు, వ్యాసాలూ మరింకా ఈ సంచికలో.

వసంతఋతువును వెంటబెట్టుకొని, తెలుగువారి కొత్త సంవత్సరం వచ్చేసింది. ఈ సందర్భంగా వసంతునికి, వెన్నెలఱేనికి మధ్యన పోటీ గురించి భైరవభట్ల కామేశ్వరరావు నాకు నచ్చిన పద్యం శీర్షిక; వసంత తిలకమనే వృత్తం గురించి జెజ్జాల కృష్ణ మోహన రావు వ్యాసం; అంతా కొత్తగా మొదలెడదామని కోగంటి విజయ్ కవిత; ఇంకా మరికొన్ని చక్కని కవితలు; వలసయుగంలో తెలుగు భాష, సాహిత్యదృక్పథాల్లో వచ్చిన మార్పులు, వాటికి ఎదురొడ్డి తన వాదాన్ని వినిపించిన విశ్వనాథ సాహిత్యగళం, సాహిత్య సందర్భం గురించి వెల్చేరు నారాయణరావు 2018లో ప్రచురించబోతున్న పుస్తకం ముందుమాటకు అబ్బరాజు మైథిలి తెలుగు అనువాదం; దామెర్ల రామారావు చిత్రానికి ఎక్‌ఫ్రాస్టిక్ కవిత రాసిన వేలూరి వేంకటేశ్వర రావు వినూత్న ప్రయత్నం; సినీప్రముఖులు రచించి నటించిన అరుదైన రేడియో నాటకం మనోరమ; కథలు, సమీక్షలు, ఇతర శీర్షికలూ ఈ సంచికలో.

తెలుగు విశ్వవిద్యాలయాల పరిశోధనల్లో ప్రామాణికత లేమిని ఎత్తి చూపిస్తూ, “జ్ఞానానికి భౌగోళికమైన సరిహద్దులు లేవు. అజ్ఞానానికి మాత్రం వుంటాయి.” అంటూ వెల్చేరు నారాయణ రావు 1988లో తెలుగు పరిశోధన అనే పత్రికలో చేసిన చర్చ నేటికీ తన సంగతత్వాన్ని ఎంతమాత్రమూ కోల్పోలేదు. ఆ చర్చ పరిష్కృత పాఠం; బాలకథారచయితగా సుప్రసిద్ధుడైన డాక్టర్ ౙాయిస్ పుట్టినరోజు సందర్భంగా, ఆయన కథల స్ఫూర్తితో లలిత టి.ఎస్. చెప్పిన అంకెల కథ; ఒక కాలానికి చెందిన వ్యక్తిని, లేదా సంఘటనని, లేదా సామాజిక దృశ్యాన్ని కాలాతీతం చేసే మార్మిక శక్తి కావ్యానికి మాత్రమే ఉన్నదని, చరిత్ర చేయలేని పని కావ్యం చేస్తుందని చెప్తున్నారు భైరవభట్ల కామేశ్వరరావు నాకు నచ్చిన పద్యం ద్వారా; విశ్వనాథ – వేయిపడగలు, మార్గరెట్ మిచల్ – గాన్ విత్ ద విండ్ నవలల లోని పోలికలూ తేడాలూ చూపిస్తూ కల్లూరి భాస్కరం ఇకనుండీ ఈమాటలో కొనసాగించబోయే విశ్లేషణ; ఇంకా ఎన్నో రచనలతో కలిసి ఈ సంచికలో మీకోసం.

🔸 ఇప్పటికీ చాలామంది ఈమాట రచయితల పరిచయాలు ఇంచుమించు ఖాళీగా ఉన్నాయి. దయచేసి తమ వివరాలు పంపమని, అలానే కాలదోషం పట్టిన వివరాలు సరిదిద్దడంలో మాకు సహాయపడమని రచయితలకు మా మనవి. రచయితల గురించి పాఠకులకు తెలియడానికి ఈ పరిచయాలు ఎంతో ఉపయోగపడతాయి. దయచేసి తోడ్పడమని విజ్ఞప్తి.

  • మనకు కనిపించే వెండితెర వెలుగుల వెనుక మనకు తెలియని ఒక ప్రపంచమే ఉంది. ఆ ప్రపంచాన్ని పరిచయం చేస్తూ శ్రీనివాస్ కంచిభొట్ల వ్రాస్తున్న తెరచాటు-వులు ఈ సంచిక నుంచి ప్రారంభం.
  • ఈమాట కొత్త రూపం గురించి తమ అభిప్రాయాలు చెప్పిన పాఠకులందరికీ మా కృతజ్ఞతలు. ఈమాటలో ఇంకొన్ని సౌకర్యాలు చేర్చాం. ఇప్పుడు నచ్చిన రచనను అక్కడినుంచే సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడానికి వీలుగా ఫేస్‌బుక్, గూగుల్ ప్లస్ బటన్లు; సంపాదకులను సంప్రదించడానికి, మీ రచనలు పంపడానికి క్విక్ లింక్స్, పాఠకుల అభిప్రాయాలు, పాత సంచికలు, శీర్షికలు మొదలైనవి మరింత అందుబాటులోకి తెచ్చాం.
  • ముఖ్యగమనిక: ఈమాట గ్రంథాలయం పాఠకులకు మరిన్ని సదుపాయాలు ఏర్పరచడం కోసం మెరుగు పరుస్తున్నాం. ప్రస్తుతానికి గ్రంథాలయంలోని పుస్తకాలకు దారి పాత సంచికలు పేజిలోనుంచి ఏర్పాటు చేయబడింది.

ఈమాట సాహితీకుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు!

ఈమాట ఇకనుంచీ మాసపత్రిక! ఈమాటలో కొత్త సంపాదకుల చేరిక!!

  • మారుతున్న కాలంతో పాటుగా మార్పులు తప్పవు. ఈమాట ఇకనుంచీ మాసపత్రికగా మారుతోంది! ఐతే ఏ మార్పయినా పత్రిక నాణ్యతాప్రమాణాలను మెరుగు పరచగలగాలి లేదా కనీసం నిలపగలగాలి. ఆ ఉద్దేశంతో, ఈమాటను మాసపత్రికగా ఏడాది పాటు ఒక ప్రయోగంగా ప్రచురించాలని, ఆపైన మంచిచెడ్డలు బేరీజు వేసుకుని ఈ మార్పు శాశ్వతం చేయడమా లేదా అని నిర్ణయించాలని మా ఆలోచన.
  • రచయితలు, పాఠకులు, ఈమాట మాసపత్రికగా మనగలిగేందుకు పూర్తి సహాయ సహకారాలందిస్తారని ఆశిస్తున్నాం. పదేపదే చెప్తున్న మాటే మరొక్కసారి – ఈమాట ఉనికి మీమీదే ఆధారపడి ఉంది. మీ ప్రోత్సాహం, ఆదరాభిమానాలే ఈమాట సాహితీప్రయాణానికి వెన్నుదన్నులు.
  • బహుముఖీనమైన సాహిత్యాన్ని ఈమాట పాఠకులకు అందిస్తూ పత్రికను మరింత సమర్థవంతంగా నడిపేందుకు గాను – అవినేని భాస్కర్, గాలి త్రివిక్రమ్, సత్తెనపల్లి సుధామయి – ఈమాట సంపాదకులుగా ఈ సంచిక నుండి బాధ్యతలు స్వీకరించారు. వారికి మా హార్దిక స్వాగతం, మా ఆహ్వానాన్ని మన్నించి ఈ ప్రయాణంలో మాకు తోడుగా నిలుస్తున్నందుకు సంతోషం.
  • ఈ మార్పులలో భాగంగానే ఈమాటను ఒక సరికొత్త రూపంతో, సురేశ్ కొలిచాల అధ్యక్షతలో పూర్తిస్థాయి సాంకేతిక హంగులతో మీ ముందుకు తెస్తున్నాం. ఈ కొత్త రూపం మీకు నచ్చుతుందని, ఈమాటను చదవడాన్ని మరింత అనువుగా ఆహ్లాదంగా చేస్తుందని మా నమ్మకం. అన్ని సౌకర్యాలూ చక్కగా పనిచేసేలా చేయడంలో కొంత జాప్యం జరగవచ్చు. కొద్దిగా ఓపిక పట్టమని మా మనవి. ఈ కొత్తరూపంపై మీ అభిప్రాయాలకూ, ఆక్షేపణలకూ సదా స్వాగతం.

(గత కొద్దికాలంగా మాకు తమ తమ అభిప్రాయాలు చెప్తూ సలహాలిస్తూ మాకోసం వారి విలువైన కాలాన్ని వెచ్చిస్తున్న స్నేహితులు పరుచూరి శ్రీనివాస్, చామర్తి మానస, భైరవభట్ల కామేశ్వరరావు, వేల్పూరి సుజాత, తమ్మిరెడ్డి పూర్ణిమలకు మా కృతజ్ఞతలు.)

🔸 అమెరికన్ ఫోక్ సంగీత ప్రపంచపు దిగ్గజం, వాగ్గేయకారుడు అయిన బాబ్ డిలన్ స్వతహాగా వివాదాస్పదుడు కూడా. ఆ పాటకుడిని ఈ ఏడాది సాహిత్య విభాగపు నోబెల్ బహుమతికి ఎంచుకోవడం కూడా అలాగే వివాదాలకు దారి తీసింది. బాబ్ డిలన్ కేవలం గాయకుడేనా? కవి అవునా, కాదా? అనే ప్రశ్న మళ్ళీ కొత్తగా తెరపైకి వచ్చింది. డిలన్ ఎందుకు కేవలం పాటకాడు కాదో తన అభిప్రాయం చెప్తున్నారు ఈ వ్యాసంలో వేలూరి వేంకటేశ్వరరావు.

🔸 అత్యంత లఘుకావ్యమైనా అమరుకాది శృంగార కావ్యాలతో సమంగా ప్రసిద్ధమైన పుష్పబాణవిలాస కావ్యాన్ని టీకా తాత్పర్యాది సహితంగా తెలుగు చేసి అందిస్తున్నారు తిరుమల కృష్ణదేశికాచార్యులు.

🔸 ఈ సంచిక నుండి సాధారణ కథావ్యాసాది లక్షణాలతో పొసగనివిగా అనిపించే రచనలకు చోటు కల్పిస్తూ స్వగతం అనే ఒక కొత్త కేటగిరీ మొదలు పెడుతున్నాం పూడూరి రాజిరెడ్డి రచనతో. ఈ కొత్త విభాగం ఈమాట రచయితలకు తమ ఆలోచనలు, ఊహలు, అభిప్రాయాలు, మ్యూజింగ్స్ వంటివి ప్రచురించుకునేందుకు ఒక కొత్త వెసులుబాటు నిస్తుంది. రచయితలు వినియోగపరచుకుని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం.

🔸 మొదటి గడి-నుడిని ఉత్సాహంగా ప్రయత్నించి ప్రోత్సహించిన పాఠకులందరికీ మా కృతజ్ఞతలు. ఈ నెల గడినుంచీ నియమాలు కొద్దిగా మారాయి. దయచేసి గమనించగలరు. వీలైనంత త్వరలో ఈమాటలో కొంత కొత్త ఒరవడి తేవడానికి ప్రయత్నిస్తున్నాం. మీ ఆదరణ, ప్రోత్సాహం ఈమాటకు ఎల్లప్పుడూ ఉంటాయనీ ఉండాలనీ కోరుకుంటున్నాం.

వ్యావహారిక భాషోద్యమ పితామహుడైన గిడుగు రామమూర్తి పంతులుగారి జయంతిని (29 ఆగస్ట్, 1863) తెలుగు భాషోత్సవదినంగా ప్రకటించుకుని తెలుగువారు తెలుగు భాష గొప్పదనాన్ని కీర్తిస్తూ సాహిత్య కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. గ్రాంథిక భాషను కాదని వ్యావహారికభాష తెలుగులో తెచ్చిన పెద్ద మార్పుల గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ సందర్భంగా — ఈ భాషావాదాలకి ఆద్యులుగా మన మనసుల్లో స్థిరపడిపోయిన పరవస్తు చిన్నయ సూరి, గిడుగు రామమూర్తుల రచనల వల్ల తెలుగు భాష వ్యవహారాలలో కలిగిన మార్పులేమిటి? తెలుగు భాష చరిత్రలో మొదటగా వినిపించే ఈ ప్రముఖుల అభిప్రాయ వైరుధ్యాలు ఎలాంటి ప్రభావాన్ని చూపాయి? వీరిద్దరి రచనలు ఏ సందర్భాలలో ప్రాచుర్యం లోకి వచ్చాయి, వాటివల్ల ఆధునిక వచన రచనకి లాభమా, నష్టమా? అనే విషయాలు చర్చిస్తూ వెల్చేరు నారాయణరావు, పరుచూరి శ్రీనివాస్ రాస్తున్న వ్యాసంలో మొదటి భాగం ఈ సంచికలో ప్రచురిస్తున్నాం.


ఈ సంచికనుండి గడి నుడి శీర్షిక మొదలుపెడుతున్నాం. పాఠకులు ఆదరించి ప్రోత్సహిస్తారని, ఉత్సాహంతో పాల్గొంటారని, ఆశిస్తున్నాం.

మూడువందల సంవత్సరాలకు పైగా సంఖ్యాగణిత శాస్త్రజ్ఞులకు కొరకరాని కొయ్యగా మిగిలిన ఫెర్మా చివరి సిద్ధాంతాన్ని, బ్రిటన్‌కు చెందిన సర్ ఏండ్రూ వైల్స్ మొదట 1993లోనే రుజువు చేసినప్పటికీ, అందులో ఒక లొసుగు కానవచ్చింది. రిచర్డ్ టేలర్ సహకారంతో అందులోని లొసుగులు సవరించి తిరిగి 1995లో ప్రచురించి శాస్త్రప్రపంచాన్ని ఇప్పటికి పూర్తిగా ఒప్పించాడు. ఎన్నో ఏండ్ల అకుంఠిత దీక్షతో అసాధ్యాన్ని సాధ్యం చేసిన వైల్స్ కృషికి ఫలితంగా గణితంలో నోబెల్ బహుమతితో సమానంగా గౌరవించబడే ఆబెల్ ప్రైజ్ ఈ ఏడాది ఆయనకు దక్కింది. ఈ సందర్భంగా ఎంతో క్లిష్టమైన ఆ సిద్ధాంతాన్ని, దాని నిరూపణ వెనుక ఉన్న కృషిని, చరిత్రనీ సరళంగా, అందరికీ అర్థమయ్యేలా వివరించే సాహసం చేసి కృతకృత్యులైన వేమూరి వేంకటేశ్వరరావు వ్యాసం – ఫెర్మా చివరి సిద్ధాంతం ఈసంచికలో; కేవలం సైన్స్ అభిమానులే కాక అందరూ చదవదగినది. ప్రొఫెసర్ వేమూరి కృషికి అభినందనలు.

గత కొన్ని సంవత్సరాలుగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో తెలుగు సాహిత్యం, ముఖ్యంగా ప్రాచీన సాహిత్యం పరిశీలనగా చదివి, పరిశోధన చేసి పిహెచ్‌డీలు సంపాదించుకున్న విద్యార్థుల్లో కొందరినీ, తెలుగుదేశంలో ప్రామాణికమైన పరిశోధన చేసిన కొందరినీ, పిలిచి అట్లాంటాలోని ఎమరీ విశ్వవిద్యాలయంలో ఏప్రిల్ 16-17 తేదీల్లో, అధ్యాపకులు వెల్చేరు నారాయణరావు, జాయ్స్ ఫ్లూకిగర్ ఒక ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేశారు. తెలుగు సాహిత్య విమర్శ మీద కొత్త ఆలోచనలు ఆవిష్కరించడానికి పరిశోధన మార్గాలలో కొత్త పద్ధతులు అనుసరించడానికి, ఈ సంవృత సదస్సు ఉద్దేశించబడింది. అంతర్జాతీయంగా తెలుగు సాహిత్య విమర్శకి ప్రామాణిక స్థానం ఏర్పడడం, ప్రపంచ సాహిత్య విమర్శలో తెలుగు సాహిత్య విమర్శ ఒక భాగం కావటం ఈ సదస్సు వల్ల ఉద్దేశించిన ఫలితాలు. ఈ సదస్సుకు కావలసిన ఖర్చులన్నీ ఎమరీ విశ్వవిద్యాలయంలో తెలుగుకి ప్రత్యేకమైన ఆచార్య పీఠం ఏర్పాటు చేసిన కొప్పాక కుటుంబం వాళ్ళే ఇచ్చారు. ఈ సదస్సులో చర్చల ఫలితంగా వ్యాసరచయితలు తమ వ్యాసాలను పరిష్కరించుకున్న తరువాత వాటినన్నిటినీ ఒక పుస్తకంగా ప్రచురించాలని నిర్వాహకుల ఉద్దేశ్యం. అలా పుస్తకంగా రాకముందు ఆ వ్యాసాలను కొన్నింటిని అనువాదం చేసి ఈమాటలో ముందుగా వేయటానికి ఆయా వ్యాసరచయితలు అంగీకరించారు. వారికి మా కృతజ్ఞతలు.

నిరంతరం ఎదురయ్యే అనుభవాలు, చిరపరిచితమనిపించే భావాలు మళ్ళీ మళ్ళీ చదివించే పద్యాలుగా సరికొత్తగా సాక్షాత్కరించేది కవిత్వమనే రసవిద్య పట్టుబడ్డ కవి చేతి చలువ వల్లే. ‘లిఖిత’ శ్రీకాంత్ ఆ రసవిద్య నేర్చిన కవి. మనిషి లోని సంఘర్షణని అలవోకగా కవిత్వం చేయగల నేర్పు శ్రీకాంత్ సొంతం. ఇతని కవిత్వం – సంకుచితం కాని చూపొక్కటీ చాలు, కవిత్వాన్ని, ఆ మాటకొస్తే ఏ కళనైనా ఉదాత్తంగా తీర్చిదిద్దుతుంది అని చూపడానికి నిలువెత్తు తార్కాణం. శ్రీకాంత్ కవిత్వం, లోకం లోను, మనుషుల లోతుల్లోను, మునుపెన్నడూ చూడని పార్శ్వాలను చూపెట్టడమా? లేదూ, మనం తెలుసుకున్న, తెలుసనుకున్న సంగతులనే సరికొత్తగా పరిచయం చేయడమా? ఏది ఉత్తమ కవిత్వ లక్షణం? అన్న ప్రశ్ననూ కలిగిస్తుంది; శ్రద్ధగా చదివే పాఠకులకు, బహుశా ఓ సమాధానమూ చూపెడుతుంది. నిప్పు కణికలా వెలుగులీనే నిజమూ, బాహ్యస్మృతి విముక్తులను చేసే సౌందర్యలోకాల ప్రస్తావనా, బాధల కొలిమిలో నిండా కాల్చి, మనలోలోపలెక్కడో స్వర్ణకాంతులీనే హృదయమొకటి ఉందని మరలా గుర్తు చేసే విషాదమూ — శ్రీకాంత్ కవిత్వాన్ని చదివి తీరాల్సిన కవిత్వంగా మార్చిన సుగుణాలు. వెన్నెల రాత్రులనీ, ఈరెండ ఉదయాలనీ తఱచుగానే కవితల్లో చూస్తూ ఉంటాం. కానీ, ఇవే ఉదయాస్తమయాలను మనిషిలోని భావసంచలనంతో సంధానించి కవిత్వం చెబితే ఎలా ఉంటుందో శ్రీకాంత్ అక్షరాల సాక్షిగా చూపించే చిరుపరిచయమిది. ఒక్క రోజులో మన మనసు ఎన్ని రంగులు మార్చుకుంటుందో, ఎన్ని వైవిధ్యాలను, ఉద్వేగాలను ఉగ్గబట్టుకుని క్షణాలను దొరలించుకుంటుందో, అన్ని ఛాయలనూ చాకచక్యంగా తన రెండు వేళ్ళ మధ్యా ఏ ఒత్తిడీ లేకుండానే ఒడిసి పట్టుకున్న కవి ఇతడు. ఒక కవిత చదవగానే, ‘ఇది శ్రీకాంత్ కవిత’ అని ఇట్టే గుర్తించగలిగేంత ప్రత్యేకమైన శైలిని సృజించుకుని, తెలుగు కవిత్వంలో తనదే అయిన దారిలో నడుస్తున్న శ్రీకాంత్ కవితలు మచ్చుకి ఐదు — కవిత్వం కాలాన్నిలా అలవోకగా అక్షరాల్లో బంధించగలదని నమ్మే వారి కోసమూ, నమ్మని వారి కోసం కూడా — ఈనెల ఈమాటలో, మరికొందరికి చేరాలన్న ఆశతో… [పరిచయకర్త: మానస చామర్తి.]

!!!ఈమాట రచయితలకూ పాఠకులకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు!!!

ఈమాట సజీవంగా సగర్వంగా 17వ ఏడులోకి అడుగు పెట్టింది. మీ సహాయసహకారాలు ఆదరాభిమానాలు లేకుండా ఇది ఎంతమాత్రమూ సాధ్యమయేది కాదు. అందుకు మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతాభివందనాలు అర్పిస్తున్నాం. అయితే ఈ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. నడవవలసిన దారి అంతా ముందే ఉన్నది. అందువల్ల, మారుతున్న కాలంతో పాటు మారుతూ కొత్త తరాల రచయితలనూ, పాఠకులనూ ఈమాట సాహితీప్రయాణంలో సహగాములను చేయడానికి, ఈమాట అందరికీ మరింత చేరువ కావడానికీ ప్రయత్నిస్తున్నాం. అదే సమయంలో సాహిత్యాన్ని సాహిత్యంగానే మననీయాలనే మా ఆశయాన్ని, మేము నమ్మిన సాహిత్యపు విలువలను కాపాడుకోవడానికి, సాహిత్యధోరణుల పాతకొత్తల మేలు కలయికగా ఈమాటను నడపడానికీ కృషి చేస్తున్నాం. సాహిత్యస్పందన తక్షణమూ, తాత్కాలికమూ అయి ఆవేశకావేషాలు రగిలించే జాతిమతవాద రాజకీయధోరణుల ప్రాబల్యానికి పనిముట్టు కాదనీ కారాదనీ మా నమ్మకం. ఆహ్లాదాన్నీ ఆలోచననీ కలిగించే సృజనాత్మక సాహిత్యంతో పాటు, విశ్లేషణాత్మక విమర్శావ్యాసాలను ప్రోత్సహించడం ద్వారా సాహిత్య చర్చలకు దోహదం చేయాలనీ, ఈమాట అందుకు ఒక చక్కటి వేదిక కావాలనీ మా కోరిక, మా ప్రయత్నమూ. ఈ దిశగా ఈమాట ప్రయాణం మీ తోడ్పాటు, ప్రోత్సాహం లేకుండా ఇప్పటిదాకా జరగలేదు. ఇకముందూ జరగదు. మీ ఆశీస్సులు, మీ సహకారం ఇకముందూ ఈమాటకు ఉంటాయని ఆశిస్తూ, ఉండాలని ప్రార్థిస్తూ, ఈమాట నిర్వహణలోనూ, ఆశయాలలోనూ ఏమాత్రమూ రాజీ పడమని హామీ ఇస్తూ, మీ అందరికీ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం.

ఈమాట పాఠకులకు కన్నెగంటి చంద్రను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కథయినా, కవితయినా, చంద్ర పేరు చూడగానే చేస్తున్న పనులన్నీ ఆపేసి వెంటనే చదివే పాఠకులం ఎందరమో. అలాంటి చంద్ర, అక్షరం మనసు తెలిసిన చంద్ర, తన రచనల నుంచి ఏమీ ఆశించకుండా నిరాపేక్షగా చావో బతుకో వాటి మానాన వాటిని విడిచిపెట్టే చంద్ర, ఒకానొకప్పుడు పృథివ్యాపస్తేజోవాయురాకాశములైన పంచభూతాల వంటి ఐదు కవితలు రాశాడు తెలుసాలో – మట్టి, వాన, మంట, గాలి, మబ్బులు, అంటూ! ఆ కవితలు చదివి వేలూరి అందరినీ, ఇప్పుడైనా చూడండి చంద్ర ఎందుకు మంచి కవో అని చెప్తూచెప్తూనే, ఆర్కైవుల్లో ఆ ఐదు కవితలూ వెతుక్కుని చదువుకుని దాచిపెట్టుకున్నాం కూడానూ. ఆతర్వాతెప్పుడో చంద్ర కవితలను వాన వెలిసిన సాయంత్రం అనేసి హడావిడిగా పుస్తకం చేసినప్పుడు వేలూరి ఈమాటలో వాటి గురించి మరోసారి గుర్తు చేశారు కూడానూ. ఏమైతేనేం, ఆ ఐదు కవితలూ మీకు పరిచయం చేయడం కోసం, పోనీ ఆ సాకుతో మీతో కలిసి మేమూ మరోసారి చదవడం కోసం ఈ సంచికలో ప్రచురిస్తున్నాం.