మెదడు లోపలి పొరల్లో చిక్కుకుపోయిన ఒక ఊహ, ఒక ఆలోచన, ఒక భావన–ఇవే సిగిౙ్మండ్ కథల్లో హీరోలు. ఆ ఊహని బయటకి తెచ్చి, బాహ్య ప్రపంచంలో మసలడానికి దానికంటూ ఒక అస్తిత్వాన్ని కల్పించి, చుట్టూ కిక్కిరిసిపోయున్న మిగిలిన ఆలోచనలనుంచి దాన్ని కాపాడుకోడానికి దానికి బలాన్ని, స్వతంత్రంగా బతకడానికి దానికి ఆయుష్షును, ఆరోగ్యాన్ని ఎలా ఇవ్వాలనేదే, అతని కథల్లో కనిపించే ప్లాట్.

ఒకసారి వైశేషికుల సిద్ధాంతంలో పదార్థాల గురించి ఎడమ నేను చెప్పిన విషయాలు గుర్తుకు తెచ్చుకున్నాను. ద్రవ్యం, గుణం, కర్మ, సామాన్యం, విశేషం, సమవాయం. ఇందులో ద్రవ్యం ఒక్కటే స్వతంత్రమైనది. గుణ కర్మలు ద్రవ్యం మీద ఆధారపడతాయి. అలాగే ద్రవ్యాలలో సమానంగా ఉండే లక్షణం సామాన్యం. ఒక్కొక్క ప్రత్యేకమైన ద్రవ్యం ఒక విశేషం. పదార్థాల మధ్యన ఉండే అవినాభావ సంబంధం సమవాయం.

ఈ స్థావర, జంగమ సిద్ధాంతాన్ని కుడి, ఎడమ కులాలతో పోల్చడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తమిళదేశంలో భూస్వాములను కుడిచేతి వర్గంగా, ఇతర వృత్తికారులను ఎడమచేతి వారిగా వ్యవహరిస్తారు. బసవ పురాణంలోని భక్తుల కథలు, ఉదంతాలు చాలావరకు ఈ ఎడమ కులాల వారి నుండే ఉంటాయి. అంటే వృత్తికారులు, వ్యాపారులు, చాకలివారు, కుమ్మరులు, చర్మకారులు మొదలైనవారి కథలు. రైతులుగాని, వారి పాలేరులైన మాలల కథగాని ఒక్కటి కూడా కనబడదు. కానీ ఎడమ కులాలవారి కథలతో నిండి వారి సిద్ధాంతాలకు అద్దంపడుతుంది బసవ పురాణం.

నాకు తెలిసినంతమట్టుకు వెల్చేరు నారాయణరావు కానీ, జీన్ రాఘేర్‌ కానీ ఆచరణ పరంగా వీరశైవులు కారు. వారు పరిశీలించిన గ్రంథాలను బట్టి స్వీయ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ అధ్యాయాన్ని అనువదించేటప్పుడు ఈ వ్యాసంలో వారి ప్రస్తావనలు, అభిప్రాయాలను మార్చకుండా ఉన్నదున్నట్లు అనువదించాను. అయితే అనువంశికంగా వీరశైవాన్ని పొందిన నాకు కొన్ని విషయాలలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

గిడుగు రామమూర్తి పంతులు మనం వాడవలసిన భాషకి వ్యావహారిక భాష అని పేరు పెట్టారు. కానీ ఎవరు వ్యవహరించే భాష వ్యావహారిక భాష అని అడిగితే స్పష్టంగా చెప్పలేక శిష్ట వ్యావహారిక భాష అనే మాట అన్నారు. శిష్టులంటే గోదావరి జిల్లాల్లో చదువుకున్న బ్రాహ్మణులు. వాళ్ళు కూడా ఉచ్ఛరించే పద్ధతిలోనే తెలుగు రాయరు. అందుచేత శిష్ట వ్యావహారికం అనే మాటకి స్పష్టమైన నియమాలు చెప్పటం కష్టమైంది.

తర్కం,హేతువు కూడా మానవ బుద్ధినుంచి పుట్టేవేననీ, మానవ బుద్ధి పరిమితమైనదనీ భావించడం వల్ల కాబోలు, తర్కాన్నీ హేతువునూ అధిగమించిన పరమ సత్యం కోసం భారతీయ తత్త్వవేత్తలు తమ అన్వేషణ సాగించారు. అంత మాత్రాన భారతీయులు తర్కానికి తక్కువ స్థానం యిచ్చారని అనుకోవడం పెద్ద తప్పే అవుతుంది. తత్త్వసిద్ధాంతాల ప్రతిపాదనలో తర్కానికి తిరుగులేని ప్రాధాన్యం ఉంది.

వనమయూరములాటి వృత్తములు తమిళములోని తేవారములో గలవు. తెలుగులో పంచమాత్రల ద్విపదలయ కూడ ఇట్టిదే. కన్నడములో కర్ణాట చతుష్పది అమరిక కూడ ఇట్టిదే. వీటిలో మూడు పంచమాత్రలు, ఒక త్రిమాత్ర ఉంటాయి. పాదాంత యతివలన, త్రిమాత్రను కొనసాగించి వనమయూరపు లయను సృష్టించ వీలగును. నాగవర్మ, జయకీర్తులకు తెలుగు ద్విపద పరిచితమై ఉండుటకు అవకాశము ఉన్నది.

ఇప్పుడు స్వభాషాభిమానము అను పేరుతో పర భాషా తిరస్కారము చీడ పురుగువలె అన్ని దేశములందును వ్యాపించుచు భారతీయ విజ్ఞానమును తునకలు తునకలుగా చేయుచున్నది. కాఁబట్టి ఇదివఱకును తమిళులు చేసిన ఉపకారమునకు వారికి కృతజ్ఞులై, ఇప్పటికైన తెలుఁగువారు తెలుఁగు దృష్టితో త్యాగయ్య సాహిత్యమును సమకూర్చి శోధించి పెట్టుకొని దేశములో వ్యాప్తికి తేవలసి యున్నారు.

సామినేని ముద్దునరసింహం నాయుడు 1855లో రాసి, 1862లో అచ్చయిన పుస్తకం హిత సూచని. ఈ అరుదైన, అద్భుతమైన పుస్తకాన్ని ఈమాట గ్రంథాలయంలో ఉంచుతున్న సందర్భంలో ముద్దునరసింహం మనుమడైన ముద్దుకృష్ణ ఆ పుస్తకాన్ని పునఃప్రచురించినప్పుడు ఆరుద్ర రాసిన ముందుమాట సంక్షిప్తంగా ఇక్కడ ప్రచురిస్తున్నాం.

గ్రాంథిక వ్యావహారిక భాషావివాదం బలంగా నడుస్తున్న రోజులలో కూడా, దృష్టి అంతా పదాలు వాటి వర్ణక్రమాల మీదే ఉండింది. ఆ సమయంలో టేకుమళ్ళ కామేశ్వరరావు అనే యువకుడు వ్యావహారభాషకు నియమాలు ఏర్పరుచుకోవాలా వద్దా అనే అంశాన్ని చర్చకు తీసుకొని వచ్చారు. వీరి పుస్తకం ఈ సంచికలో ప్రచురిస్తున్న సందర్భంలో, ఆ పుస్తకపు ముందుమాట, ఇక్కడ ప్రచురిస్తున్నాం – సం.

అనగనగా ఒక పల్లెటూళ్లో ఒకే ఒక క్షురకుడు, అనగా బార్బర్ ఉన్నాడు. అతనికి ఒక నియమం ఉంది. ఆ ఊళ్లో తమకి తాము గడ్డం గీసుకోని వారికే అతను గడ్డం గీస్తాడు. తనకు తాను గడ్డం గీసుకొనే ఏ వ్యక్తికీ అతను గడ్డం గీయడు. చాలా సజావైన నియమం లాగానే ఉంది కదూ! అయితే దీనికి సమాధానం చెప్పు చూద్దాం. ఆ క్షురకుడు తన గడ్డం తాను గీసుకుంటాడా లేదా? ఇందులో మెలిక ఏమిటో జాగ్రత్తగా ఆలోచించు.

అయినా ఒక చిత్రకారుడిగా నా పరిమితి నాకు ఉంది. నిజంగా వసుధేంద్ర కోరుకున్నట్లు నిక్కరు విప్పి పడేసి ఏడుపు మొహంతో, అవమానభారంతో నడుం వంచుకుని ఉన్న కుర్రవాడు, వాడిని కడుగుతూ తల్లి, కుడివైపున పిల్లల్ని వేసుకుని పందులు, ఈ వైపు కుక్క మూతి నాక్కుంటూ చూస్తూ, వెనుక ఎగతాళిగా నవ్వుతున్న స్కూల్ పిల్లలు… ఇదంతా గీస్తే అపుడు బొమ్మ ఏవవుద్దంటే బహిరంగ మల విసర్జన వద్దే వద్దు! మోడీయ స్వచ్ఛ భారతే ముద్దు!

అదబే-లతీఫ్‌ మాస పత్రికలో, నా కథ ఒకటి కాలీ సల్వార్ పేరిట 1942లో అచ్చయ్యింది. దీనిని అందరూ అశ్లీలమని అన్నారు. ఇది పచ్చి అబద్ధం. కథలు రాయడం నా వృత్తి. నాకు సాహిత్యపు అన్ని లక్షణాలతోనూ పరిచయముంది. నేను ఇంతకు మునుపు ఇలాంటి అంశాల మీదే అనేక కథలు రాసున్నాను. వీటిలో ఏ కథ కూడా అశ్లీలం కాదు. నేను ఇకపై కూడా ఇలాంటి అంశాల గురించి రాస్తాను. అవేవీ కూడా అశ్లీలమవ్వవు.

రాముడు పరిపూర్ణ మానవుడనో, అవతార పురుషుడనో భావించేవారికి శూర్పణఖ వృత్తాంతం వంటి సమాధానపడవలసిన అంశాలతో సమస్యలెదురౌతున్నాయి; అటు సంప్రదాయ వ్యాఖ్యాతలకూ ఇటు భారతీయ విధ్యార్థులకూ కూడా. ఇటువంటి వృత్తాంతాలు కావ్యం యొక్క చారిత్రక ప్రామాణికతను రుజువు చేస్తాయని కొందరు వాదిస్తారు. ఇవి నిజం కాకపొతే వాల్మీకి ఎందుకు నాయకుడికి అపకీర్తి తెచ్చిపెట్టే ఇటువంటి సన్నివేశాలను సృష్టిస్తాడు?

ఏ పాండిత్యం లేకుండా కావ్యాలు రాయటం స్త్రీలకు మాత్రం సాధ్యమా అంటే కాదు అనే సమాధానం. వేళ్ళ మీద లెక్కించదగిన సంఖ్యలో మాత్రమే ఉన్న మహిళా కవులు అల్పసంఖ్యాక వర్గంగా పురుషులదైన కావ్య ప్రపంచంలోకి బెదురుబెదురుగా ప్రవేశిస్తున్నారనటానికి, వాళ్ళను ప్రసన్నం చేసుకొనటానికి వాళ్ళకంటే తామెందులోనూ అధికులం కామని నమ్మబలికి వారి దయను పొందటానికి తాపత్రయ పడుతున్నారనటానికి నిదర్శనం.

సీసము అనే పదము శీర్షకమునుండి జనించినది. శీర్షకమును శీర్షము అని కూడ అంటారు. ఈ శీర్షక, శీర్ష పదములు సీసకము, సీసములుగా మారినవి తెలుగులో. సీసపద్యమునందలి సీసమునకు లోహవిశేషమైన సీసమునకు ఏ సంబంధము లేదు. శీర్షకము అనే ఛందస్సును మనము నాట్యశాస్త్రములో చదువవచ్చును. దీని ప్రకారము ఎనిమిది వృత్తములలో ఏదైన ఒకదానిని, లేక ఒకటికంటే ఎక్కువ వృత్తములను వ్రాసి చివర ఒక గీతిని రచించినప్పుడు అది శీర్షకము అనబడును.

ఈ కథలో చిక్కుముడికి అసలు కారణం గమనించారా? ఒక తండ్రికి మరొక సంబంధం ద్వారా కొడుకే తిరిగి తండ్రి కావడం! ఒక దిశలో తిన్నగా సాగిపోయే సాధారణ బంధుత్వాల పరంపర, వేరొక బంధుత్వం ద్వారా మెలితిరిగి, తిరిగి మొదలికి వచ్చిందన్నమాట. దాని వలన సాధారణ సంబంధాలలో కనిపించని ఒకానొక వైరుధ్యం ఇక్కడ ఏర్పడింది.

సాలవృక్షాల క్రింద మా దారులు వేరైన చోట దారి నుండి పక్కకి తొలిగి నవోదయ స్కూలుకు వెళ్ళే బాటలో నుంచున్నాను. నడిచి వచ్చిన వైపు మళ్ళా వెనక్కి తిరిగి చూశాను. అడవి కనబడలేదు. చుడిపహాడ్ మాత్రం మసకగా కనిపిస్తూ ఉన్నది. రేపు రాలేను. కాళ్ళు పుండ్లుపడి ఉంటాయి. ఎల్లుండి గురువారం. సంత రోజు. శుక్రవారం వచ్చి ఇదే సాలవృక్షాల క్రింద వేచి ఉంటాను. అడవి నాకింకా కావాలి.

పుస్తకమంతా బాగున్నప్పటికీ, నాకు అందులో ఒక వాక్యం ప్రత్యేకంగా నచ్చింది. ఇన్నేళ్ళకీ ఆ వాక్యం మరచిపోలేక పోతున్నాను. ఇది ఏదో కవిత్వం పూనిన వాక్యం కాదు. ఇది ఏదో రహస్యం మన చెవిలో గుసగుసలాడే వాక్యం అంతకంటే కాదు. ఇది గుండెను మెలితిప్పి కళ్ల నీళ్లు కార్పించే వాక్యమూ కాదు. ఏదో అందమైన, మధురమైన పదబంధాలతో నిండి ఉన్న వాక్యం కాదు.

శబ్దానికీ నిశ్శబ్దానికీ, ఊహకూ వాస్తవానికీ, చలనానికీ అచేతనకూ, ఉనికికీ ఉనికి లేమికీ, బయట ప్రపంచానికీ అంతర్లోకాలకూ, ప్రయాణానికీ జీవితానికీ మధ్య హద్దులు చెరిపేసి ఆలోచనకూ, భావానికీ, అనుభూతికీ, అక్షరానికీ, పదానికీ, వాక్యానికీ, రచనకూ మధ్య ఉండే హద్దులు అధిగమించి, నిన్నటికీ రేపటికీ మధ్య నిర్మించిన అక్షరవారధి ఈ పుస్తకం.