లా సెర్వ పద్రోనా అనునది జెన్నర్ ఆంతోనియో ఫ్రెదెరికో అను రచయిత ఇటాలియను భాషలో వ్రాసిన గేయరూపకమునకు ఇటాలియను సంగీతకర్త యగు జ్యోవానీ బత్తిస్తా పెర్గొలేసీ అను నతడు సంగీతరచన చేసిన లఘుసంగీతరూపకము. లోగట ఈమాటలో ప్రచురింపబడిన నారెండు ఆపెరాలవలెనే, ఇందులో గూడ సులువైన పదములుగల కంద, గీత, ఆటవెలదులను, గేయములను వ్రాసినాను.

తెలుగు పెండ్లిళ్ళలో స్నాతకమనీ, నాగబలి అనీ, తలంబ్రాలు అనీ, మాంగల్యధారణ అనీ ఉండేవి కేవలం లాంఛనాలు అయితే కావచ్చునేమో గాని అప్పగింతల సమయం మాత్రం గొప్ప హృదయస్పర్శి అయిన సన్నివేశం. పెండ్లి చూడ్డానికి వచ్చినవాళ్ళకు అదొక తంతుగా కనిపించొచ్చు గాని, వధువుకూ, ఆమెని కన్నవారికీ మాత్రం అది వారికే అనుభవైకవేద్యమైన బాధ.

ఒక స్త్రీ ఏడ్పును వర్ణించే ఘట్టం అది. ఆ స్త్రీ మనుచరిత్రంలోని కథానాయిక వరూధిని. తాను కామించిన ప్రవరుడు తనను తిరస్కరించిన తరువాత, తాను కొంత చొరవ చూపబోతే త్రోసేసినప్పుడు- ఆ తిరస్కృతి కలిగించిన అవమానమూ రోషమూ వేదనా ముప్పిరిగొని ఆపుకోలేనంత ఏడుపు వచ్చింది ఆమెకు. కన్నీరు ఉబికింది. అయితే ఆమె రోషావమానాలకన్నా, నొప్పిని కారణంగా చూపించింది.

పదాలకుండే సౌందర్యాన్ని ఎరిగి, వాటిని ఉచిత స్థానంలో పొదిగి, ఆ సౌందర్యాన్ని దిగంత ప్రదర్శనం చేసే కళను స్వాధీనం చేసుకున్న కవి వ్రాసింది ఈ పద్యం. శబ్దాలొలికించే సంగీత మాధుర్యాన్ని ఆకళింపు చేసుకుని, వాటి ప్రవాహపు ఒరవడిని ఒక క్రమవిభక్తమూ, సమవిభక్తమూ చేసి, పద్యగతిని హయగతిలోనూ, గజగతిలోనూ నిబంధించగలిగిన కవి వ్రాసిందీ పద్యం. కవి ఏమి చెపుతున్నాడు అనేది తరవాతి సంగతి. పద్యం చదువుతుండగానే శభాష్ అనిపించే పద్యం ఇది.

ఎఱ్ఱాప్రగడ రామాయణం కూడా రచించాడనీ, అది లభ్యం కావడంలేదనీ అంటారు. ఎఱ్ఱాప్రగడ రామాయణంలోవని ఒకట్రెండు పద్యాలు కొందరు లక్షణ కర్తలుదాహరించడమే ఈ అపోహకు ఆధారం. ఆ ఊహ నిజమై, ఇరవైయవ శతాబ్దపు తొలి సంవత్సరాల్లో హఠాత్తుగా నన్నెచోడుని కుమారసంభవం ప్రత్యక్షమైనట్లు ఎఱ్ఱన రామాయణం కూడా మున్ముందెపుడైనా ప్రత్యక్షమైతే తెలుగు భాషా, తెలుగు జాతీ చేసుకున్న అదృష్టం పండినట్లే.

ఏ కావ్యానికయినా దాని భాగధేయాన్ని నిర్ణయించేది కవి యెడ సానుభూతి లేని రంధ్రాన్వేషణాతత్పరులైన పండితులు కారు. సాధారణ పాఠకులు. తెలుగు పాఠకులు మొల్ల రామాయణాన్ని ఆనందంగా ఆహ్వానించి గుండెలకు హత్తుకున్నారు. మళ్ళీమళ్ళీ చదువుకొని మననం చేసుకోదగిన పద్యాలు చాలానే ఉన్నాయి అందులో. తాను విదుషిని కాదనీ, శాస్త్రాదులు తనకు తెలియవు అని అన్నాకూడా కవిత్వమనేది ఎలా ఉండాలో కచ్చితమైన అభిప్రాయాలే ఉన్నాయి మొల్లకు.

భారత యుద్ధానంతరం ఒకరోజు అర్జునుడు ద్వారకకు వస్తాడు, కృష్ణుణ్ణి చూడడానికి. ఆ రోజు కృష్ణుడు ఏదో దీక్షలో ఉన్నాడు. అలాంటి సమయంలో ఒక బ్రాహ్మడు ఏడ్చుకుంటూ కృష్ణార్జునుల దగ్గరికి వస్తాడు దీనంగా. ఆయన శోకాన్ని చూసి కృష్ణుడు కన్నీరు పెట్టుకుంటాడు. కృష్ణుడి బాధను చూసి అర్జునుడూ కళ్ళనీళ్ళపర్యంతమవుతాడు. సంగతేమిటంటే ఆ విప్రుని భార్య గర్భవతిగా వుండి, శిశువును ప్రసవించగానే ఆ శిశువు చనిపోతాడు.

ఇల్ మాత్రిమోనియో సెగ్రేతో అనునది జొవాన్ని బెర్తాతి ఇటాలియను భాషలో వ్రాసిన గేయరూపకమునకు సుప్రసిద్ధ ఇటాలియను సంగీతకర్త యగు దొమీనికో చిమరోసా అను నతడు సంగీతరచన చేసిన సుప్రసిద్ధమైన సంగీతరూపకము . హాస్యరసాన్వితమైన అన్ని ఆపెరాలకును ఇది తలమానికమైనదని సంగీతపండితుల అభిప్రాయము.

మారన ఒక సంస్కృత పురాణాన్ని తెనిగించిన తొలి తెలుగు కవి. ఈయనకు తిక్కనగారంటే మహా గౌరవము. ‘తిక్కన సోమయాజి ప్రసాదలబ్ధ సరస్వతీపాత్రుడ’నని తన కావ్యంలోని ఆశ్వాసాంత గద్యల్లో చెప్పుకున్నాడు. అన్నట్టు ఈయన తండ్రి పేరు కూడా తిక్కనామాత్యుడే. తన మార్కండేయ పురాణం అనువాదాన్ని మారన ప్రతాపరుద్ర చక్రవర్తి సేనానాయకుడైన గన్న సేనానికి అంకితమిచ్చాడు.

కవి వృత్తిరీత్యా కృషీవలులు. జానపద సౌందర్యాన్నీ, సంప్రదాయాల కమనీయతనూ గుండెల్లో నింపుకున్నవారు. ఆ నేపథ్యం వలన కమ్మటి తెలుగు జాతీయాలూ, పలుకుబడులూ వారి పద్యాల్లో బహుళంగా మెరుస్తుంటాయి. పై పద్యమే చూడండి: తీర్థమాడుట, గాజువారుట, చేయికల్పుట, చిగురుపట్టుట, పసని నిగ్గులు లాంటి పలుకుబడులు ఎంత సొగసుగా ఉన్నాయో!

తాతగారి కవితలోని పదగుంభనమూ ప్రౌఢత్వమూ యీ మనుమడు పుణికిపుచ్చుకున్నట్టు లేదు. రామభద్రకవి రచనలో ప్రౌఢతకన్నా సారళ్యము, ఓజస్సు కన్నా మాధుర్యమూ ఎక్కువగా కనిపిస్తుంది. తన కవిత గురించి చెప్పుకున్న సందర్భాలలో కూడా ‘మామక నవ్యకావ్యము సమంచిత మాధురి సాధురీతి’ అని, ‘మాధురీగతి ప్రబంధ మొనర్చిన నొప్పుగాక’ అనీ, మాధుర్య గుణాన్ని ప్రధానంగా పేర్కొన్నాడితను. పైన యిచ్చిన రెండు పద్యాలూ ఈ గుణానికి చక్కని మచ్చుతునకలు.

వేదులవారి కవిత్వంలో ఒక గాఢ విషాదపు జీర కనిపిస్తుంది. మహాప్రస్థానానికి పీఠికగా ఇచ్చిన యోగ్యతా పత్రంలో లోకమంతటి బాధా శ్రీశ్రీ బాధైతే, కృష్ణశాస్త్రి బాధ లోకమంతటిదీను అంటాడు చలం. అది కృష్ణశాస్త్రి ఒక్కడిదే అనుకోనక్కరలేదు. దాదాపు భావ కవులందరిలోనూ ఆ లక్షణముంది. వేదులవారి కవిత్వంలో ఐతే మరీను.

ఈ పద్యాలున్న చిరుకబ్బం–కేవలం 122 పద్యాలది, వ్రాసేనాటికి ఏతత్కవి వయస్సు కేవలం 12 సంవత్సరాలేనట! పన్నెండేళ్ళ వయస్సులో ఒకట్రెండు పద్యాలు గిలకడం అంత గొప్ప ఏమీ కాకపోవచ్చుకాని చిరస్థాయి ఐన ఒక చారిత్రక స్మృతికావ్యాన్ని మనోహరంగా శిల్పించడం అసామాన్యులకూ, కారణజన్ములకూ మాత్రమే సాధ్యమయ్యేపని.

ఇటాలియను భాషలో నున్న అత్యంత రసవత్తరమైన ఈ రూపకముయొక్క ఆంగ్లానువాదమును ఆధారముగా చేసికొని, తెలుగులో దీనిని పునర్మించితిని. ఇది ఇంగ్లీషు ప్రతికి అనుకరణయే కాని అనువాదము కాదు, మూలేతివృత్తాధారముగా నిర్మింపబడిన స్వతంత్ర రచన. మూలములో నున్న సన్నివేశములు, పాత్రల పేర్లు భారత సంస్కృతికి తగునట్లుగా మార్చబడినవి.

కేవలం ద్రాక్షాసవపు గిండి మాత్రమే అయితే అది అసంపూర్ణమే. ఆ చషకాన్ని సాకీ ఒయ్యారంగా అందిస్తుంటేనే సందర్భానికి సార్థకత. ‘రమణీ ప్రియదూతిక తెచ్చి యిచ్చు కప్పురపు విడెమ్ము’లాగా. అయితే అక్కడ రమణికీ స్వీకర్తకూ మధ్య ప్రియ దూతిక వుంది గాని, సాకీ స్వయంగానే రమణిలాంటిది.

…పరమేశ్వరునితో ఎన్ని రకాలుగా ముచ్చట్లు చెప్పాడో, ఎన్ని చోట్ల ఆశ్చర్యం పొందాడో, ఎంత బ్రతిమలాడాడో, ఎంత అలిగాడో, ఎంత కోపపడ్డాడో, ఎంత భక్తిభావాన్ని వెలార్చాడో, శివుణ్ణి ఎంత పరిహాసం చేశాడో, ఎన్ని వైవిధ్య భావాలను రాశిపోశాడో, ఎన్ని అద్భుతమైన సమాసాలు గుప్పించాడో, ఎన్ని విధాలుగా స్వామిని సంబోధించాడో, ఎంత ఛందస్సుందరంగా పద్యాలను పొదిగాడో…

మన పురాణాల్లోని కొన్నికొన్ని పాత్రలు అన్యాయానికి గురైనాయని మనకు అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది. కవి హృదయం సాధారణంగా ఆర్ద్రంగా ఉంటుంది కాబట్టి అలాంటి పాత్రల యెడ సహానుభూతి కలిగి ఉంటుంది. ఒక ఏకలవ్యుడు, ఒక ఊర్మిళ, ఒక అహల్య, ఒక కర్ణుడు లాంటి వారి యెడ ఏంతో అనుకంపనని చూపిస్తుంటారు చాలామంది. వాల్మీకి ఊర్మిళకు అన్యాయం చేశాడని వాల్మీకి రామాయణాన్ని మార్చబూనాడట పుట్టపర్తి నారాయణాచార్యులుగారు.

ఇండ్ల పెరళ్ళలో నాలుగైదు పెద్ద వృక్షాలు– మామిడీ పనసా లాంటివి ఉండటం సర్వసాధారణం. అలాంటి ఒక చెట్టు మీద పొద్దున్నే కాకి ఒకటి వచ్చి వ్రాలి కౌ కౌ అని అరుస్తున్నది. మరో చెట్టు మీద కోకిలలు కూర్చుని వాటి అరుపులను అవి తుహీ తుహీ అని అరుస్తున్నాయి. ఒక కూత వినపడగానే జవాబుగా కూయడం కోకిలలకు అలవాటు.

వలపులు చిందే చూపులలోని అందమే వేరు! అందులోనూ, తొలిచూపుల పలకరింపులు మనసులను గిలింతలు పెడుతూ మరింతగా అలరిస్తాయి. పెళ్ళిపీటల మీద, సిగ్గుబరువుతో రెప్పలు ఎత్తలేక, పక్కనున్నవారిని కంటితుదలతో చూసే ప్రక్కచూపుల నేర్పు, మన్మథుడు నేర్పే ప్రథమ విద్య అంటారు విశ్వనాథ. ప్రేయసీ ప్రియల తొలిచూపులను శృంగార రసోల్లాసంగా తెలుగులో వర్ణించిన మొట్టమొదటి కవి నాకు తెలిసి తిక్కన.

నిందాస్తుతి అంటే పైకి తిడుతున్నట్టు, గేలి చేస్తున్నట్టు, కనిపిస్తూనే స్తుతి చేయడం. నిందాస్తుతిని సమర్థంగా నిర్వహించాలంటే కవికి మంచి చమత్కారం ఉండాలి, భాషపై గొప్ప పట్టు ఉండాలి. భాషపై పట్టు అంటే కేవలం పాండిత్యం కాదు, సజీవమైన వాడుక. మాట్లాడే భాషలో ఉండే కాకువు దీనికి ప్రధానమైన సాధనం. కోపం, వెటకారం, భయం మొదలైన భావాలు స్వరం ద్వారా ధ్వనించే శక్తిని కాకువు అంటారు.