చంద్రికాపరిణయము – 6. చతుర్థాశ్వాసము

శ్రియై నమః
శ్రీలక్ష్మీనరసింహాయ నమః
చంద్రికాపరిణయము-సవ్యాఖ్యానము

చతుర్థాశ్వాసము

క. కమలాకుచకలశతటీ
విమలాంచితమృగమదాభి◊విలసన్ముద్రా
కమలామతికృల్లాంఛన
విమలాలసరిపువిభేద◊విధ గోపాలా! 1

టీక: కమలాకుచకలశతటీవిమలాంచితమృగమదాభివిలసన్ముద్రాకమలామతికృల్లాంఛన – కమలా=లక్ష్మీదేవియొక్క, కుచ కలశతటీ = కలశములవంటి కుచములతటమందలి, విమల=నిర్మలమై, అంచిత=ఒప్పుచున్నదియైన, మృగమద=కస్తూరి యొక్క, అభివిలసత్=ప్రకాశమానమగు, ముద్రా=గుర్తుయొక్క,కమలా=సంపత్తియొక్క,మతి=బుద్ధిని, కృత్=చేయుచున్న, లాంఛన = శ్రీవత్సము గలవాఁడా! విమలాలసరిపువిభేదవిధ – విమల=విశేషపాపముగల, అలస=ధర్మమునందలసులైన, రిపు = శత్రువులయొక్క, విభేద=భేదనము,విధ =రీతిగాఁగలవాడా! గోపాలా= శ్రీమదనగోపాలస్వామీ! ఈకృతిపతి సంబోధనము నకు ‘చిత్తగింపు’మను నుత్తరపద్యస్థక్రియతో నన్వయము.

తే. చిత్తగింపుము శౌనకా ◊ద్యుత్తమర్షి
సమితి కిట్లను రోమహ ◊ర్షణతనూజుఁ
డంత రంగద్వధూమోహ ◊మన్నృపాలు
డంతరంగస్థలంబున ◊నతిశయిల్ల. 2

టీక: చిత్తగింపుము = ఆకర్ణింపుము; శౌనకాద్యుత్తమర్షిసమితికిన్ = శౌనకుఁడు మొదలగు శ్రేష్ఠులగు మునిసంఘమునకు; రోమ హర్షణతనూజుఁడు = సూతుఁడు; ఇట్లనున్=వక్ష్యమాణప్రకారముగాఁ బలుకును; అంతన్=అటుతరువాత; రంగద్వధూమో హము – రంగత్=ఒప్పుచున్న, వధూ=చంద్రికయందలి, మోహము=అభిలాషము; అంతరంగస్థలంబునన్ =మనస్సునందు; అతిశయిల్లన్=మించఁగా; అన్నృపాలుఁడు=ఆరాజు. దీనికి ‘అనుచుఁ దలపోయుచుండు’ నను నుత్తరపద్యస్థక్రియతో నన్వ యము. ఈపద్యమందు యమకాలంకారము. ఇట్లీయాశ్వాసమం దంతటను యమకాలంకారంబు ప్రధానంబుగ నగును. ‘స్వర వ్యఞ్జనసముదాయ పౌనరుక్త్యం యమకమ్’ అని వాత్స్యాయనసూత్రము.

సీ. వరియించు టెన్నఁడో ◊వరమనోమోదంబు, నలువార రాజక◊న్యాలలామ,
విహరించు టెన్నఁడో ◊గృహవన్య నాతిమి,న్నలు వారక భజింపఁ ◊గలికిఁ గూడి,
నెలకొల్పు టెన్నఁడో ◊నిశితపాణిరుహాంక,నలు వారణేంద్రయా ◊నాకుచములను,
దేలించు టెన్నఁడో ◊హాళిఁ గ్రొంజెమటసో,నలు వాఱ నెలఁతఁ గం◊దర్పకేళిఁ,

తే. జెలువ మరుపోరు వెనుక సొ ◊మ్ముల నలర్చి, చెలు వమరురక్తి నెన్నఁడో ◊కలిసియుండు
టనుచుఁ దలపోయుచుండుఁ దా ◊నాత్తచంద్రి,కాభిలాషానుగుంభిత◊స్వాంతుఁ డగుచు. 3

టీక: రాజకన్యాలలామన్=చంద్రికను; వరమనోమోదంబు=శ్రేష్ఠమగు మనస్సంతోషము; నలువారన్=ఒప్పఁగా; వరియించు టెన్నఁడో = వివాహమాడుట యెన్నఁడో?
గృహవన్యన్=సదనోద్యానమందు; నాతిమిన్నలు = స్త్రీరత్నములు; వారక =ఎడదెగక; భజింపన్ = కొలుచుచుండఁగా; కలికిన్ కూడి = చంద్రికను గూడి; విహరించు టెన్నఁడో = క్రీడించు టెన్నఁడో? వారణేంద్రయానాకుచములను = గజేంద్రగమన యగు చంద్రికయొక్క స్తనములయందు, నిశితపాణిరుహాంకనలు—నిశిత= తీక్ష్ణములగు, పాణిరుహ=గోళ్ళయొక్క, అంకనలు = చిహ్నములను, నెలకొల్పు టెన్నఁడో = చేయు టెన్నఁడో? నెలఁతన్ = చంద్రికను; కందర్పకేళిన్ = అనంగక్రీడయందు; హాళిన్=ప్రీతిచేత; క్రొంజెమటసోనలు = నూతనస్వేదాసారములు; పాఱన్=ప్రవహింపఁగా, ఇట సంధివశమున పకారమునకు వకారము వచ్చినది. అలఘురేఫమైనను యమకమునకు బాధ లేదు; తేలించు టెన్నఁడో = తృప్తిపొందించు టెన్నఁడో? చెలువన్=చంద్రికను; మరుపోరు వెనుకన్ = సురతానంతరమందు; సొమ్ములన్=ఆభరణములచేతను; అలర్చి=సంతోషింపఁ జేసి; చెలువు అమరురక్తిన్ = ఒప్పిదమగు ప్రీతిచేత; కలిసియుండుట = కూడియుండుట; ఎన్నఁడో = ఏనాఁడో? అనుచున్ = ఇట్లనుచు; తాన్ = సుచంద్రుఁడు; ఆత్తచంద్రికాభిలాషానుగుంభితస్వాంతుఁడు – ఆత్త=పొందఁబడిన, చంద్రికాభిలాష=చంద్రికా విషయమైన యనురాగముచేత, అనుగుంభిత=కూర్పఁబడిన, స్వాంతుఁడు = చిత్తముగలవాఁడు; అగుచున్; తలపోయు చుండున్ = చింతించుచుండును.

ఇచటఁ జింత యను ననంగదశావిశేషము గదితంబయ్యె. ‘శ్లో. కే నోపాయేన సంసిద్ధ్యే త్కదా తేన సమాగమః, దూతీ ముఖేన కింవాచ్య మిత్యాద్యూహస్తు చిన్తనమ్’ అని తల్లక్షణంబు. ఇట ‘కదా వారాణస్యా మమరతటనీరోధసి వసన్, వసానః కౌపీనం శిరసి నిదధానోఞ్జలిపుటమ్’ అనుచోట శాంతమునకువలె శృంగారరసమునకు ఎన్నఁడో అను పదములచే సూచిత మగు చింతాఖ్యవ్యభిచారభావమంగ మగుటంజేసి ప్రేయోలంకారమగును. ఇదియే భావాలంకార మనఁబడును.

చ. లలి మదిఁ జాల మించ నవ◊లా! నవలాలితకంతుకల్యనా
విలగతిఁ బ్రోవ కున్కి దగ◊వే తగ వేమరు కౌఁగిలింతచేన్
గలయక యున్నఁదాళఁ గల◊నా కలనాద! యటంచుఁ బల్కు భూ
తలపతిమారశారపవి◊తాపవితానము మేనఁ గూరఁగన్. 4

టీక: మదిన్=చిత్తమందు; లలి=ప్రేమము; చాలన్=మిక్కిలి; మించన్=అతిశయింపఁగా; నవలా=ఓతరుణీ! నవలాలితకంతు కల్యనావిలగతిన్ – నవ=నూతనమైన, లాలిత=ఆదరింపఁబడిన, కంతుకలి=సురతమందలి, అనావిలగతిన్=అకలుషస్థితి చేత; ప్రోవకున్కి=రక్షింపకుండుట; తగవే= న్యాయమా? న్యాయము గాదనుట; తగన్=ఒప్పునట్లుగా; వేమరున్=సారెకు; కౌఁగిలింతచేన్=ఆలింగనముచే; కలయక యున్నన్ = కూడకయున్నయెడ; కలనాద = అవ్యక్తమధురస్వనముగలదానా! తాళఁ గలనా = ఓర్వఁగలనా? అటంచున్ = అట్లనుచు; భూతలపతి= రాజగు సుచంద్రుఁడు; మారశారపవితాపవితానము – మార=మన్మథునియొక్క, శారపవి=వజ్రమువంటి శరసంఘముచేతనైన, తాపవితానము= తాపపరంపర; మేనన్=శరీరమున; కూరఁగన్=ఘటిల్లఁగా; పల్కున్=వచించును.

సీ. అహిరోమలతికపొం◊దందినఁ గాని నొం,పఁగ రాదు మలయాగ◊మారుతములఁ,
గనకాంగికౌఁగిలి ◊యెనసినఁ గాని పెం,పఁగ రాదు మధుపభా◊మారుతముల,
ఘనవేణిఁ గూడి మిం◊చినఁ గాని రూపుదూ,ల్పఁగ రాదు శశభృన్న◊వప్రకరముల,
వనజారివదనఁ జే◊రినఁ గాని సిరు లడం,పఁగ రాదు వనసంభ◊వప్రకరముల,

తే. ననుచు రాజీవనేత్రమో◊హంబు చాల
ననుచు రాజీవసాయకా◊నల్పభయము
మలయ గాహితచింతమైఁ ◊గలఁగఁ జిత్త
మల యగాహితనిభుఁడు తా◊పాప్తి నడల. 5

టీక: అహిరోమలతికపొందు =సర్పతుల్యమగు నూఁగారు గల చంద్రికయొక్కసాంగత్యమును; అందినఁ గాని = పొందిననే గాని; మలయాగమారుతముల = మలయాచలసంబంధులగు గాడ్పులను; నొంపఁగ రాదు = నొప్పించుట కలవిగాదు. అనఁగా చంద్రిక సర్పతుల్యమైన రోమావళి గలది గావున తత్సాంగత్యమున వాయువును గెలువ వచ్చు ననుట. సర్పములు వాతాశనము లగుట ప్రసిద్ధము. కనకాంగికౌఁగిలి = సంపెఁగనుబోలు నంగములు గలదానియొక్క యాలింగనమును; ఎనసినఁ గాని = పొందినఁగాని; మధుప భామారుతములన్ = ఆఁడుతుమ్మెదలయొక్క రొదలను; పెంపఁగరాదు = నశింపఁజేయుట కలవి గాదు. చంద్రిక చంపకాంగి గావున దానికౌఁగిటఁ జేరినచో తేంట్ల నడఁపవచ్చు ననుట. సంపెఁగకు తేంట్లకు గల విరోధము ప్రసిద్ధము. ఘనవేణిన్= మేఘమువంటి జడగలదానిని; కూడి = పొంది; మించినన్ కాని = అతిశయించిననే కాని; శశభృన్నవప్రకరములన్ = చంద్రునియొక్క నూతనమగు ప్రకృష్టకిరణములను; రూపుదూల్పఁగ రాదు = రూపుమాప నలవిగాదు. చంద్రిక జలదము వంటివేణి గలదిగావున దానిసాంగత్యమునఁ జంద్రకిరణములఁ గప్పవచ్చు ననుట. వనజారివదనన్=చంద్రునిఁబోలు మోముగలదానిని; చేరినన్ కాని=పొందిననేకాని; వనసంభవప్రకరములన్=తమ్ములయొక్క సమూహములయందు; సిరులడంపఁగ రాదు =కాంతుల నడఁచుటకు నలవిగాదు. చంద్రిక చంద్రునివంటి మోముగలది గావున దానిఁ జేరి కమలముల సిరుల నడంప వచ్చు ననుట. అనుచున్=ఇట్లు వచించుచు; రాజీవనేత్రమోహంబు = చంద్రికయందలి యనురాగము; చాలన్=మిక్కిలి; ననుచు రాజీవసాయ కానల్పభయము – ననుచు = వృద్ధిఁబొందించుచున్న, రాజీవసాయక=మరునివలననైన, అనల్పభయము=అధికమైన భీతి; మలయన్=ఉద్రేకింపఁగా; గాహితచింతమైన్ = పొందఁబడినచింతచేత; చిత్తము=హృదయము; కలఁగన్=కలఁతపాఱఁగా; అల యగాహితనిభుఁడు= ఇంద్రతుల్యుఁడైన యాసుచంద్రుఁడు; తాపాప్తిన్=సంతాపప్రాప్తిచేత; అడలన్=తపింపఁగా. దీనికి ‘తనర్చెన్’ అను నుత్తరపద్యస్థక్రియతో నన్వయము.

చ. నరపతిధైర్యభంగము ద◊నర్చె నవీనరతీశధాటిఁ గై
కరభసలీల చందనన◊గచ్యుతమారుతపాళి చాంద్రదు
ష్కరభ సలీలకోకిలని◊కాయశుకవ్రజశారికాసము
త్కరభసలీలసద్ధ్వనివి◊ధానము లత్తఱిఁ జిత్రవర్తనన్. 6

టీక: అత్తఱిన్=ఆసమయమున; చిత్రవర్తనన్= ఆశ్చర్యకరమగు రీతిచేత; నవీనరతీశధాటిన్ = నూతనమైన మరుని జైత్ర యాత్రయందు; కైకరభసలీల – కైక=కేకిసంబంధియగు, కేకిశబ్దముమీఁద సంబంధార్థమందణ్ప్రత్యయము, రభసలీల = హర్షక్రియ, ‘రభసో వేగ హర్షయోః’, ‘లీలా విలాస క్రియయోః’ అని విశ్వము; చందననగచ్యుతమారుతపాళి – చందననగ =మలయపర్వతమునుండి, చ్యుత=జాఱిన, వెడలిన యనుట, మారుతపాళి=తెమ్మెరలగుంపు; చాంద్రదుష్కరభ = చంద్రుని సంబంధియగు ననివార్యమైన కాంతి; సలీలకోకిలనికాయశుకవ్రజశారికాసముత్కరభసలీలసద్ధ్వనివిధానములు – సలీల= విలా సముతోఁ గూడినదగు, కోకిలనికాయ=పికసముదాయముయొక్కయు, శుకవ్రజ=చిలుకలగుంపుయొక్కయు, శారికాసము త్కర =గోరువంకలగుంపుయొక్కయు, భసలీ=తుమ్మెదలయొక్కయు,లసత్=ఒప్పుచున్న, ధ్వనివిధానములు = ధ్వని యొనర్చుటలు; నరపతిధైర్యభంగము = రాజుయొక్క ధైర్యముడుగుటను; తనర్చెన్=చేసెను.

రాజున కుదయించిన చంద్రికావిషయక మైనయనురాగము మలయానిలచంద్రికాకోకిలాలాపాది సహకారి కారణ సమవ ధానమున మిగుల నుద్దీపిత మయ్యె ననుట. ‘తటస్థా శ్చన్ద్రికాధారా గృహచన్ద్రోదయా వపి, కోకిలాలాప మాకన్ద మన్దమారుత షట్పదాః, లతామణ్డప భూ గేహదీర్ఘికా జలదారవాః, ప్రాసాదగర్భసంగీత క్రీడాద్రి సరిదాదయః’ అని తటస్థోద్దీపనవిభావములు గదితంబు లయ్యె. ‘ఉద్దీపనవిభావాస్తు రసముద్దీపయన్తి యే’ అని యుద్దీపనవిభావలక్షణము. ‘విభావః కథ్యతే తత్త్ర రసోత్పా దనకారణమ్’ అని విభావలక్షణములోనగునవి వెనుక సవిస్తరముగ వ్రాయంబడియె.

సీ. ఘనసింహగతికి స్రు◊క్కనిదిట్ట హంసవీ,క్షణదారకవ్రాత◊గతికి బెదరు,
దనుజాస్త్రకీలి కో◊ర్చినమేటి పూర్ణిమా,క్షణదారమణహేతి◊జాతి కడలుఁ,
గలిరవాళికిఁ గలం◊గనిదంట కిసలభ,క్షణదారనిస్వన◊చ్ఛటకుఁ దెరలుఁ,
దామిస్రశస్త్రిఁ గుం◊దనిసామి విరహిహృ,త్క్షణదారయుతమార◊శస్త్రి నొదుఁగు,

తే. నఖిలలేఖావగీర్ణన◊వాజిరాజి,తాజరారిధనుర్ముక్త◊వాజిరాజి
దోడ్త మయి నాట నలఁగని◊దొర యనలగు,రూత్కరము గాత్రసీమయం◊ దొరయ నలఁగు. 7

టీక: ఘనసింహగతికిన్=గొప్పనైన సింహముయొక్క గమనమునకు; స్రుక్కనిదిట్ట = వెనుదీయని ధైర్యముగలవాఁడు; హంసవీక్షణదారకవ్రాతగతికిన్ – హంస=హంసలయొక్క, వీక్షణదారక=దృష్టిభేదకమగు, వ్రాత=సంఘములయొక్క, గతికిన్ =గమనమునకు; బెదరున్ =భయపడును.దనుజాస్త్రకీలికిన్ =రాక్షసబాణవహ్నికి; ఓర్చినమేటి = సహించిన యధిపుఁడు; పూర్ణిమాక్షణదారమణహేతిజాతికిన్ – పూర్ణిమా=పున్నమయందలి, క్షణదారమణ=చంద్రునియొక్క, హేతిజాతికిన్ = కాంతిపుంజమునకు; అడలున్=వెఱచును. కలిరవాళికిన్ = రణసంబంధియగు ధ్వనిపరంపరకు; కలంగనిదంట = కలఁతనొందని దిట్టతనముగలవాఁడు; కిసలభక్షణదార నిస్వనచ్ఛటకున్ – కిసలభక్షణదార=ఆఁడుకోయిలలయొక్క, నిస్వనచ్ఛటకున్=నాదపరంపరకు; తెరలున్=చలించును. తామిస్రశస్త్రిన్ = తమిస్రాసురసంబంధియగు చురకత్తికి; కుందనిసామి =దుఃఖింపనిభూపతి; విరహిహృత్క్షణదారయుతమార
శస్త్రిన్ – విరహిహృత్=విరహవంతులహృదయముయొక్క, క్షణ=ఉత్సవములను, ద=ఖండించెడు, అర=వేగముతో, యుత =కూడియున్న, మారశస్త్రిన్=మన్మథుని ఆయుధముచేత; ఒదుఁగున్=తొలఁగును. అఖిలలేఖావగీర్ణనవాజిరాజితాజరారిధనుర్ముక్తవాజిరాజి – అఖిలలేఖ=సమస్తదేవతలచేత, అవగీర్ణ=పొగడఁబడిన, నవ= నూతనమైన, ఆజి=యుద్ధమందు, రాజిత=విలసిల్లునట్టి, అజరారి=రాక్షసులయొక్క, ధనుః=ధనుస్సులచేత, ముక్త=విడువఁ బడిన, వాజి=బాణములయొక్క, రాజి=పరంపర; తోడ్తన్=వెంటనే; మయిన్=శరీరమందు; నాటన్=నాటఁగా; నలఁగనిదొర =శ్రమపడని రాజు;అనలగురూత్కరము=వాయుసంఘము, అగ్ని వాయువువలనఁ బుట్టినట్లు శ్రుతిప్రసిద్ధమగుటవలన వాయు వనలగురు వని చెప్పఁబడియె; గాత్రసీమయందున్=శరీరప్రదేశమందు; ఒరయన్=ఒరసికొనఁగా; నలఁగున్=శ్రమపడును.