అనుబంధం 3: ద్వికందగర్భిత అష్టచతుర్మాత్రాగణ వృత్తములు

భేకాలోక 20 కృతి 129031 భ/మ/మ/త/న/స/గగ
ఇంద్రవిమాన 23 వికృతి 2089447 భ/త/న/మ/భ/న/న/గగ
మత్తాక్రీడా 23 వికృతి 4194049 మ/మ/త/న/న/న/న/లగ
అధీరకరీర 24 సంకృతి 3653113 మ/న/న/భ/స/న/జ/య
పార్షతసరణం 24 సంకృతి 4190335 భ/న/య/మ/న/న/న/య
క్రౌంచపదము 24 సంకృతి 4193479 భ/మ/స/భ/న/న/న/య
భాస్కరవిలసితము 24 సంకృతి 8381311 భ/న/జ/య/భ/న/న/స/గ
సరసిజము 24 సంకృతి 8388193 మ/త/య/న/న/న/న/స
అభ్రభ్రమణ 25 అభికృతి 16774717 త/న/మ/స/న/న/న/న/గ
క్రౌంచపద 25 అభికృతి 16776391 భ/మ/స/భ/న/న/న/న/గ
ఉజ్ఝితకదన 26 ఉత్కృతి 16767871 భ/న/జ/జ/జ/న/న/న/గగ
ఆపీడ 26 ఉత్కృతి 33523711 భ/న/న/స/మ/న/న/న/లగ
మణికిరణము 29 న/న/భ/న/జ/న/న/న/న/లగ
దర 30 న /న/న/న/న /న /న/న//భ/స
లహరికా 31 న /న/న/న/న /న /న/న/న/న /గ

భేకాలోక – భ/మ/మ/త/న/స/గగ, ప్రాసయతి (1, 6), యతి (1, 10, 16)
UII UU – UU UU – UU IIII – IIU UU
20 కృతి 129031

రామునిఁ బిల్వన్ – బ్రేమన్ రామా-రామమ్ము మనసు – రమణీయమ్మౌ
కామునిఁ గొల్వన్ – బ్రేమన్ కామా-కారమ్ము కనుల – కగుపించున్గా
శ్యామునిఁ దల్వన్ – బ్రేమన్ సామా-స్వాదమ్ము చెవికి – స్వరయుక్తమ్మై
శ్రీమయు నీడన్ – బ్రేమల్ సీమా-సీమమ్ము హృదయ – శిఖర మ్మంటున్

కంద పద్యములుగా –

రామునిఁ బిల్వన్ బ్రేమన్
రామారామమ్ము మనసు – రమణీయమ్మౌ
కామునిఁ గొల్వన్ బ్రేమన్
కామాకారమ్ము కనుల – కగుపించున్గా.

శ్యామునిఁ దల్వన్ బ్రేమన్
సామాస్వాదమ్ము చెవికి – స్వరయుక్తమ్మై
శ్రీమయు నీడన్ బ్రేమల్
సీమాసీమమ్ము హృదయ – శిఖర మ్మంటున్

ఇంద్రవిమాన – భ/త/న/మ/భ/న/న/గగ, యతి (1, 6, 12, 18)
UII UU – IIII UU – UU IIII – IIII UU
23 వికృతి 2089447

సారసనేత్రా – సరసవిచారా – చల్లంగ వెలిఁగె – శశి యట మింటన్
మారశరీరా – మదనకుమారా – మాయ మ్మయితివి – మలఁగుచు నుంటిన్
కారణ మేమో – కనుల వికారా-కార మ్మగపడెఁ – గళలు నశించెన్
కోరితి నిన్నే – గుటిలునిఁ గ్రూరా – ఘోరమ్ము నలఁతఁ – గుములుచునుంటిన్.

కంద పద్యములుగా –

సారసనేత్రా సరసవి-
చారా చల్లంగ వెలిఁగె – శశి యట మింటన్
మారశరీరా మదనకు-
మారా మాయ మ్మయితివి – మలఁగుచు నుంటిన్.

కారణ మేమో కనుల వి-
కారాకార మ్మగపడెఁ – గళలు నశించెన్
కోరితి నిన్నే కుటిలునిఁ
గ్రూరా ఘోరమ్ము నలఁతఁ – గుములుచునుంటిన్.

మత్తాక్రీడా/హంసి – మ/మ/త/న/న/న/న/స/గ , ప్రాసయతి (1.1, 3.1), యతి (1.1, 5.1, 7.1)
UU UU – UU UU – IIII IIII – IIII UU
23 వికృతి 4194049
హరిగతి రగడ – ఎనిమిది చతుర్మాత్రలు, యతి (1.1, 5.1), ప్రాస, అంత్యప్రాస

రారా ప్రాణా-ధారా రారా – ప్రణయ కరములను – రమణికి నీరా
రారా చిత్రా-కారా రారా – ప్రణయపు ప్రథమ సు-రవముల నీరా
రారా శిష్టా-చారా రారా – ప్రణయపు రథమున – రవివలె రారా
రారా మోదాఽ-సారా రారా – ప్రణయ సరసముల – రసికుఁడవేరా.

కంద పద్యములుగా –

రారా ప్రాణాధారా
రారా ప్రణయ కరములను – రమణికి నీరా
రారా చిత్రాకారా
రారా ప్రణయపు ప్రథమ – సురవములఁ దేరా.

రారా శిష్టాచారా
రారా ప్రణయపు రథమున – రవివలె రారా
రారా మోదాఽసారా
రారా ప్రణయ సరసముల – రసికుఁడవేరా.

విద్యున్మాల – మ/మ/గగ, యతి పాటించబడలేదు:
8 అనుష్టుప్ 1

రారా ప్రాణాధారా రారా
రారా చిత్రాకారా రారా
రారా శిష్టాచారా రారా
రారా మోదాఽసారా రారా.

కమలవిలసితము – న/న/న/న/గగ, యతి (1,9)
14 శక్వరి 4096
మధురగతి రగడ – నాలుగు చతుర్మాత్రలు, యతి (1.1, 3.1), ప్రాస, అంత్యప్రాస

ప్రణయ కరములను – రమణికి నీరా
ప్రణయపు ప్రథమ సు-రవముల నీరా
ప్రణయపు రథమున – రవివలె రారా
ప్రణయ సరసముల – రసికుఁడవేరా.

అధీరకరీర – మ/న/న/భ/స/న/జ/య, యతి (1, 6, 13, 20)
UU UII – IIII UII – IIU IIII – UII UU
24 సంకృతి 3653113

శృంగారమ్ముల – సిరులని చెంగునఁ – జెరలాడ హృదియు – శృంగముఁ దాకెన్
పొంగట్టున్ గన – ముదమునఁ బొంగెను – బొరలాడె నెదయు – పున్నమి రేయిన్
రంగుల్ రాజిల – రమణము రంగము – రస మొల్కు పలుకు – రతనము లెందున్
రంగా రమ్ముర – రయముగ రంగుల – రచనమ్ము నిపుడు – రమణికిఁ జూపన్.

కంద పద్యములుగా –

శృంగారమ్ముల సిరులని
చెంగునఁ జెరలాడ హృదియు – శృంగముఁ దాకెన్
పొంగట్టున్ గన ముదమునఁ
బొంగెను బొరలాడె నెదయు – పున్నమి రేయిన్.

రంగుల్ రాజిల రమణము
రంగము రస మొల్కు పలుకు – రతనము లెందున్
రంగా రమ్ముర రయముగ
రంగుల రచనమ్ము నిపుడు – రమణికిఁ జూపన్.

పార్షతసరణం – భ/న/య/మ/న/న/న/య, ప్రాసయతి (1, 8), యతి (1, 12, 19)
UII IIII – UU UU – UII IIII – IIII UU
24 సంకృతి 4190335

భావము గలిఁగెను – భావాఽభావా – భవ్యముగ బ్రదుకు – వఱలును గాదా
జీవము వెలిఁగెను – జీవాఽజీవా – చింతనము లెపుడుఁ – జెలఁగును నీదై
రావము లలరె సు-రావా రావా – రమ్యముగ వినఁగ – రసములు జిల్కన్
జీవితమున నొక – శ్రీవై చేవన్ – శీఘ్రముగ నొసఁగఁ – జెలువముతో రా.

కంద పద్యములుగా –

భావము గలిఁగెను భావాఽ
భావా భవ్యముగ బ్రదుకు – వఱలును గాదా
జీవము వెలిఁగెను జీవాఽ
జీవా చింతనము లెపుడుఁ – జెలఁగును నీదై.

రావము లలరె సురావా
రావా రమ్యముగ వినఁగ – రసములు జిల్కన్
జీవితమున నొక శ్రీవై
చేవన్ శీఘ్రముగ నొసఁగఁ – జెలువముతో రా.

తెలుఁగు క్రౌంచపదము – భ/మ/స/భ/న/న/న/య , ప్రాసయతి (1, 6), యతి (1, 11, 19)
UII UU – UII UU – IIII IIII – IIII UU
24 సంకృతి 4193479

దైవమ నీకే – పూవుల తావుల్ – తరువుల మెరిసెడు – తలిరులు నీకే
భావము నీకే – భావపు ప్రావల్ – పదముల ముదములు – పనసలు నీకే
జీవము నీకే – జీవపు చేవల్ – చిదమల హృదయపు – శివములు నీకే
శ్రీ వరదా నన్ – గావుమ సేవిం-చెద నిను గణపతి – చెలువుగ రావా.

కంద పద్యములుగా –

దైవమ నీకే పూవుల
తావుల్, తరువుల మెరిసెడు – తలిరులు నీకే
భావము నీకే భావపు
ప్రావల్, పదముల ముదములు – పనసలు నీకే.

జీవము నీకే జీవపు
చేవల్, చిదమల హృదయపు – శివములు నీకే
శ్రీ వరదా నన్ గావుమ
సేవించెద నిను గణపతి – చెలువుగ రావా.

భాస్కరవిలసితము – భ/న/జ/య/భ/న/న/స/గ, ప్రాసయతి (1, 8), యతి (1, 13, 20)
UII IIII – UII UU – UII IIII – IIII UU
24 అభికృతి 8381311

పావనినుత గురు – పావన భావా – భాస్కరవిలసిత – వరతనుభూషా
చేవల నొసఁగెడు – శ్రీవర జీవా – చిత్తము పిలిచెను – శ్రియ మృదుభాషా
దీవెన లిడు నగి – దేవర దేవా – దివ్వెల వెలుఁగుల – దినమును రావా
కావర మడఁచుచు – నీవిలఁ గావన్ – గౌముదివలెఁ బ్రియ – కరముల నీవా.

కంద పద్యములుగా –

పావనినుత గురు పావన
భావా, భాస్కరవిలసిత – వరతనుభూషా
చేవల నొసఁగెడు – శ్రీవర జీవా –
జీవా, చిత్తము పిలిచెను – శ్రియ మృదుభాషా.

దీవెన లిడు నగి దేవర
దేవా, దివ్వెల వెలుఁగుల – దినమును రావా
కావర మడఁచుచు నీవిలఁ
గావన్, గౌముదివలెఁ బ్రియ – కరముల నీవా.

సరసిజము – మ/త/య/న/న/న/న/స, ప్రాసయతి (1, 5), యతి (1, 10, 18)
UU UU UII UU IIII IIII IIII IIU
24 సంకృతి 8388193

లాలించేరే – పూల కరాలన్ – రమణులు శిశువును – లలిత పదములన్
కాళిందిన్ దు-ష్కాళియుఁ గాలన్ – గదుమగ వెఱపునఁ – గలగిరి కనులన్
కేళాకూళిన్ -మాలలఁ, గేళిన్ – గిరిధరు గళమున – గెలవున నిడిరే
స్త్రీ లా చిద్గో-పాలుఁడు చేలన్ – జిలిపిగఁ గొన వడి – చిడిముడి వడిరే.

కంద పద్యములుగా –

లాలించేరే పూల క-
రాలన్ రమణులు శిశువును – లలిత పదములన్
కాళిందిన్ దుష్కాళియుఁ
గాలన్ గదుమగ వెఱపునఁ – గలగిరి కనులన్.

కేళాకూళిన్ మాలలఁ,
గేళిన్ గిరిధరు గళమున – గెలవున నిడిరే
స్త్రీ లా చిద్గోపాలుఁడు
చేలన్ జిలిపిగఁ గొన వడి – చిడిముడి వడిరే.

అభ్రభ్రమణ – త/న/మ/స/న/న/న/న/గ , ప్రాసయతి (1, 7), యతి (1, 12, 19)
UU IIII – UU UII – UII IIII – IIII IIU
25 అభికృతి 16774717

మారా విజయకు-మారా మారుతి – మన్ననలఁ గొనిన – మమతల తరువా
శూరా వలువల – చోరా సూరుని – సొంపులను గడచు – సొబగుల కిరవా
హారీ యరిజన – హారీ హారము – లందుకొని ద్వరగ – హరుసము నియరా
వీరా ముదముల – వేరా భీరువు – భీతి కొక దివియ – వెలుఁగు నొసఁగరా.

కంద పద్యములుగా –

మారా విజయకుమారా
మారుతి మన్ననలఁ గొనిన – మమతల తరువా
శూరా వలువల చోరా
సూరుని సొంపులను గడచు – సొబగుల కిరవా.

హారీ యరిజన హారీ
హారము లందుకొని ద్వరగ – హరుసము నియరా
వీరా ముదముల వేరా
భీరువు భీతి కొక దివియ – వెలుఁగు నొసఁగరా.

సంస్కృత క్రౌంచపదము – భ/మ/స/భ/న/న/న/న/గ , ప్రాసయతి (1, 6), యతి (1, 11, 19)
UII UU – UII UU – IIII IIII – IIII IIU
25 అభికృతి 16776391

దైవమ నీకే – పూవుల తావుల్ – తరువుల మెరిసెడు – తలిరులు గొనరా
భావము నీకే – భావపు ప్రావల్ – పదముల ముదములు – పనసలు వినరా
జీవము నీకే – జీవపు చేవల్ – చిదమల హృదయపు – శివముల దొరవై
శ్రీ వరదా నన్ – గావుమ సేవిం-చెద నిను గణపతి – చెలువుల కిరవై.

కంద పద్యములుగా –

దైవమ నీకే పూవుల
తావుల్, తరువుల మెరిసెడు – తలిరులు గొనరా
భావము నీకే భావపు
ప్రావల్, పదముల ముదములు – పనసలు వినరా.

జీవము నీకే జీవపు
చేవల్, చిదమల హృదయపు – శివముల దొరవై
శ్రీ వరదా నన్ గావుమ
సేవించెద నిను గణపతి – చెలువుల కిరవై.

ఉజ్ఝితకదన – భ/న/జ/జ/జ/న/న/న/గగ, ప్రాసయతి (1, 8), యతి (1, 14, 21)
UII IIII – UII UII – UII IIII – IIII UU
26 ఉత్కృతి 16767871

తీరని కల లిఁకఁ – దీరునొ దేరులఁ – దేలుచు నడతునొ – దెలియదు కాదా
తారల వెలుఁగులఁ – దారలు ధారుణి – దారములొ యనఁగఁ – దళతళ లాడెన్
శారద రజనుల – స్ఫార తుషారపు – సాంద్రతల వెలిఁగె – శశి యల నింగిన్
జేరిక సమయము – చేరువఁ జేరుము – చిమ్మఁగను సొబగు – సిరులఁ బ్రియాంగీ.

కంద పద్యములుగా –

తీరని కల లిఁకఁ – దీరునొ
దేరులఁ దేలుచు నడతునొ – దెలియదు కాదా
తారల వెలుఁగులఁ దారలు
ధారుణి దారములొ యనఁగఁ – దళతళ లాడెన్

శారద రజనుల స్ఫార తు-
షారపు సాంద్రతల వెలిఁగె – శశి యల నింగిన్
జేరిక సమయము చేరువఁ
జేరుము చిమ్మఁగను సొబగు – సిరులఁ బ్రియాంగీ.

ఆపీడ – భ/న/న/స/మ/న/న/న/లగ, యతి (1, 14)
26 ఉత్కృతి 33523711
హరిగతి రగడ – ఎనిమిది చతుర్మాత్రలు, యతి (1.1, 5.1), ప్రాస, అంత్యప్రాస

కావలె ననె నిట హృదయము, రావా, – కన్నెన్ గనఁగను రసమయ హృదయా
త్రోవను గనుచును నిలిచితి, నీవే – తోడై సరసను నిలువుమ సదయా
యౌవన మది యొక విరివని, తావుల్ – హార్దమ్మగు, మది తనరును జెరలున్
నావృత మగు పలు తలపులు నీవే, – యాపీడ మవగ నిఖిలము వఱలున్.

కంద పద్యములుగా –

కావలె ననె నిట హృదయము,
రావా, కన్నెన్ గనఁగను – రసమయ హృదయా
త్రోవను గనుచును నిలిచితి,
నీవే తోడై సరసను – నిలువుమ సదయా.

యౌవన మది యొక విరివని,
తావుల్ హార్దమ్మగు, మది – తనరును జెరలున్
నావృత మగు పలు తలపులు
నీవే, యాపీడ మవగ – నిఖిలము వఱలున్.

మణికిరణము- న/న/భ/న/జ/న/న/న/న/లగ, ప్రాసయతి (1, 7), యతి (1, 15, 23)
IIII IIU – IIII IIU – IIII IIII – IIII IIU

పదముల చెలి స-త్పదముల వదలన్ – బ్రణవముఁ బలుకుచు – భరముగఁ గొలుతున్
సదమల మతితో – ముదముగ సదయన్ – జదువుల కొఱకయి – సదసునఁ బిలుతున్
నిదుర మెలకువన్ – జెదరని నిధికై – నిజముగ నడిగెద – నియత సువదనన్
మృదు పదములు నా – పెదవుల మెదలన్ – మెలయుచుఁ బొగడెద – మినుకుల పడఁతిన్

కంద పద్యములుగా –

పదముల చెలి సత్పదముల
వదలన్ బ్రణవముఁ బలుకుచు – భరముగఁ గొలుతున్
సదమల మతితో ముదముగ
సదయన్ జదువుల కొఱకయి – సదసునఁ బిలుతున్.

నిదుర మెలకువన్ జెదరని
నిధికై నిజముగ నడిగెద – నియత సువదనన్
మృదు పదములు నా పెదవుల
మెదలన్ మెలయుచుఁ బొగడెద – మినుకుల పడఁతిన్.

దర – న/న/న/న/న/న/న/న/భ/స , ప్రాసయతి (1, 9), యతి (1, 17, 25)
IIII IIII – IIII IIII – IIII IIII – UII IIU

మనసిట మురిసెను – మనువును మననము – మఱువకను సలుప – మౌనముగను నేన్
తనువిట విరిసెను – మనువును దనియుచుఁ – దలువగను విడక – దప్పక దినమున్
కనులిట నెరిసెను – మనువును గనఁగనఁ – గనఁగ నిముసమునఁ – గౌతుక మలరన్
వినగను దరిసెను – మనువును బెనుపడు – ప్రియ మధుర రవపు – వెల్లువ యలలన్.

కందములుగా –

మనసిట మురిసెను మనువును
మననము మఱువకను సలుప – మౌనముగను నేన్
తనువిట విరిసెను మనువును
దనియుచుఁ దలువగను విడక – దప్పక దినమున్.

కనులిట నెరిసెను మనువును
గనఁగనఁ గనఁగ నిముసమునఁ – గౌతుక మలరన్
వినగను దరిసెను మనువును
బెనుపడు ప్రియ మధుర రవపు – వెల్లువ యలలన్.
లహరికా – న/న/న/న/న/న/న/న/న/న/గ, ప్రాసయతి (1, 9), యతి (1, 17, 25)
IIII IIII – IIII IIII – IIII IIII – IIII IIU

మనసిజ జనకునిఁ – గనుఁగొన మనసున – మథనపడి యిచట – మనితిని గద నేన్
వినఁబడ దతనికి – మనసున వినతులు – విచలిత మవదుగ – వెత యది మదిలో
చనదుగ నితవులు – కనదుగ చనుపలు – సకియ నను మఱచె – సరసుఁడు నిజమై
మనికికి కతము ల-వనిపయి మనికిత – మయె ననఘుఁ డతఁడు – మఱి నను గనునో.

(నిడుద) కంద పద్యములుగా –

మనసిజ జనకునిఁ గనుఁగొన
మనసున మథనపడి యిచట – మనితిని గద నేన్
వినఁబడ దతనికి మనసున
వినతులు విచలిత మవదుగ – వెత యది మదిలో.

చనదుగ నితవులు కనదుగ
చనుపలు సకియ నను మఱచె – సరసుఁడు నిజమై
మనికికి కతము లవనిపయి
మనికిత మయె ననఘుఁ డతఁడు – మఱి నను గనునో.