వ్యాసానుబంధం (గుర్రం జాషువా పాపాయి పద్యాలు)

సంగీతదర్శకులు ఎందరో. అయితే వీరిలో కొందరే మహానుభావులు. గాయకుడుగా ప్రఖ్యాతి పొందిన ఘంటసాల సంగీతదర్శకుడుగా చాలా గొప్పవాడని తెలియజేసే ఉదాహరణలు కూడా ఎన్నో ఉన్నాయి. (ఉదాహరణకు పాతాళభైరవి సినిమా. అందులోని పాటలు ట్యూన్లపరంగా అప్పుడే రిలీజైన మల్లీశ్వరికి ఏ మాత్రమూ తీసిపోవని నా ఉద్దేశం. పింగళి ఎంత బాగా రాసినప్పటికీ, సాహిత్యంలో మటుకు దేవులపల్లివారి ధర్మమా అని మల్లీశ్వరికి ఎక్కువ మార్కులొస్తాయేమో!) సంగీతంలో ఘంటసాలమీద ఆ రోజుల్లో ఆయన విని ఆనందించిన బడేగులాం అలీఖాన్ తదితరుల హిందూస్తానీసంగీతపు ప్రభావం బాగా పడినట్టుగా అనిపిస్తుంది. అయితే ఘంటసాల ప్రత్యేకత పద్యాలను అర్థవంతంగా పాడడం, ఆ అర్థానికి రాగాన్ని సమర్థవంతంగా వాడుకోవడం అనే విషయాల్లో కనిపిస్తుంది. ప్రతి స్వరమూ, రాగంలోని ప్రతి మలుపూ ఎంతో జాగ్రత్తగా ప్రయోగించినట్టుగా అనిపిస్తుంది.

నాకెంతో ఇష్టమైన జాషువాగారి పాపాయి పద్యాలను ఘంటసాల పాడిన తీరును గురించి ఒక వ్యాసం రాద్దామని నేను చాలారోజుల క్రితమే అనుకున్నానుగాని అవి కుంతీకుమారి, పుష్పవిలాపం మాదిరిగా ఎక్కువమందికి తెలియవేమో అనిపించింది. ఇప్పుడు లక్ష్మన్న ఆ పని చేస్తున్నారని విని నా అభిప్రాయాలు రాయకుండా ఉండలేకపోతున్నాను. ఆయన రాసే వివరాలకు తోడుగా కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను. ఈ పద్యాల రికార్డింగ్ 1960 ప్రాంతాల జరిగినట్టు సంగీతరావుగారు చెప్పారు. అప్పట్లో జాషువా ఆలిండియా రేడియోలో పనిచేసేవారట. ఆయనతో ఆమంచర్ల గోపాలరావుగారు కూడా వచ్చేవారట. ఈ పద్యాల తరవాత ఘంటసాల ప్రైవేట్ రికార్డులిచ్చినట్టు కనబడదు.

ఇందులో నాలుగు పద్యాలకు నాలుగు రాగాలు వాడారు. మొదటి పద్యంలో ఉపయోగించిన దుర్గా రాగం శుద్ధసావేరిని పోలినదే అయినా ఇందులోని హిందూస్తానీ పోకడలు అద్భుతంగా వినిపిస్తాయి. మధ్యమం ప్రధానంగా వినబడుతుంది. ఎందుకంటే దుర్గా రాగంలో అవరోహణ స ధ మ రి స అన్న పద్ధతిలో సాగుతుంది. ఈ రాగాన్ని నాకు తెలిసినంత వరకూ ఇంత అందంగా లలితసంగీతంలో ఏ ఇతర సంగీతదర్శకుడూ ఉపయోగించుకోలేదు. ఈ రాగాన్ని భీంసేన్ జోషీ శాస్త్రీయంగా పాడిన విధానం మనకు దొరుకుతోంది.

రెండో పద్యంలో 1శుద్ధ సారంగ్‌కూడా చాలా ప్రౌఢంగా అనిపిస్తుంది. (ఆరోహణ ని2 స రి2 మ2 ప ని2 స, అవరోహణ స ని2 ధ2 ప రి2 మ1 రి2 మ1 స). శాస్త్రీయసంగీతంలో ప్రవేశం, పటిమ ఉన్నవారికి రాగలక్షణాలు బాగా అర్థమవుతాయి. భావుకత, ఉన్నతమైన కల్పనాశక్తికూడా ఉంటే లలిత సంగీతానికి ఆ లక్షణాలను చక్కగా వాడుకోవడం వీలవుతుంది. ఈ పద్యంలో ‘జాలువారు’ అనే పదం ఎంత అందంగా రాగభావాన్ని పలికిస్తుందో గమనించవచ్చు. కర్నాటక సంగీతంలో లేని ఈ రాగాన్ని తెలుసుకోవడానికి కొన్ని మంచి ఉదాహరణలున్నాయి. ఈ రాగాన్ని పెండ్యాల ‘ఎవరో అతడెవరో’ అనే పాటలో అద్భుతంగా వాడుకున్నారు. ‘జయజయశారదా’ కూడా ఈ రాగంలోని ఆయన స్వరరచనే. అలాగే, చక్రపాణి లో రాజా పాడిన ‘ఓ ప్రియురాలా’ కూడా ఇదే రాగం.

మూడోది 2భీంపలాస్ (ఆభేరి) రాగం. ఇందులోకూడా ఘంటసాల సోఫిస్టికేషన్ చాలా గొప్పగా అనిపిస్తుంది. ‘రసవాబ్ధి’ అంటున్నప్పుడు కావాలని ధైవతాన్ని వదిలేసి గ స ని ప అనే ప్రయోగం ఉపయోగించారు. రాజేశ్వరరావు, పెండ్యాలవంటి సంగీతదర్శకులు డజన్లకొద్దీ ట్యూన్లకు ఎంతో అందంగా ఉపయోగించిన ఈ రాగాన్ని ఘంటసాల తనదనిపించే శైలిలో చెయ్యడం చెప్పుకోదగ్గ విషయం.

చివరిది బాగేశ్రీ రాగం. (ఆరోహణ స గ1 మ1 ధ2 ని1 స, అవరోహణ స ని1 ధ2 మ1 ప ధ2 మ1 గ1 రి2 స). ఈ రాగంలో మధ్యమం బలంగా వినిపిస్తుంది. అయితే ఎత్తుగడలోనే పంచమంమీద కాసేపు నిలిచే ఈ ట్యూన్ సంగీతదర్శకుడి స్వతంత్రధోరణిని సూచిస్తుంది. పద్యభావాన్నీ, రాగభావాన్నీ అతికించినట్టుగా అన్వయించడం ఘంటసాలకు మాత్రమే సాధ్యం. ‘బిట్టుగా చేకిసల్’ అంటున్నప్పుడూ, ‘పొమ్మన్నచో’ అంటున్నప్పుడూ ఈ సంగతి ప్రస్ఫుటంగా గమనించవచ్చు. ఈ రాగంలో చేసిన హిందీ, తెలుగు సినిమా పాటలన్నీ ఒక ఎత్తూ, ఈ పద్యం ఒక ఎత్తూ అని నేననుకుంటాను.

కవిత్వం మాటకొస్తే పసిపిల్లవాడిమీద ఇంతకన్నా ఎవరూ బాగా పద్యాలు రాయలేరనేది కాదనలేని విషయం. సంగీతం మాటకొస్తే హిందూస్తానీ అయినా కర్నాటకం అయినా శాస్త్రీయ సంగీతాన్నీ, ఆ రాగాలనూ పూర్తిగా అర్థంచేసుకుని, వాటి అందం, నిర్మాణం చెడకుండా లలితగీతాల భావాలకు సరిగ్గా సరిపోయేట్టు ఉపయోగించుకోవడం సామాన్యమైన విషయంకాదు. ఈ పని సమర్థతతో చేసిన ఘంటసాల, రాజేశ్వరరావు, పెండ్యాలవంటి స్వరరచయితలు చాలా కొద్దిమందే. ఇప్పటి సినిమాల, సంగీతదర్శకుల గురించి ఈ పద్ధతిలో ఆలోచించడం కూడా అనవసరమేనేమో.


(ఈ వ్యాసం రాసి పట్రాయని సంగీతరావు గారికి చూపించాను. ఆయన ఆసక్తి కలిగించే కొన్ని సంగతులు చెప్తూ ఇలా జవాబిచ్చారు)

బాబూ,

పద్య పఠనంలోని వివిధ దశలు, ప్రక్రియల గురించి ఇంకా చెప్పవలసిన అవసరం ఉంది. శ్రీ ఘంటసాల పాడిన కరుణశ్రీ పద్యాలు, జాషువాగారి పాపాయి పద్యాలు, సంగీత సాహిత్య పరంగా ఎంత ప్రశస్థమైనవో మీ వ్యాసంలో తెలియజేసారు. ముఖ్యంగా రాగ ప్రయోగంలో శ్రీ ఘంటసాల విశిష్టత చక్కగా నిరూపించేరు.

1 వినగానే శుధ్ధసారంగ్ అనే భ్రమ కలిగించే రాగం, కర్ణాటక సంగీతంలో హంసనాదం. స రి2 మ2 ప ని2 స. అవరోహణలో స ని2 ద3 ని2 ప మ2 రి2 స. షట్ శృతి ధైవతం ఉంది. కాని ఎవరూ అది పాటిస్తున్నట్టు లేదు. శుధ్ధసారంగ్ లో ఘంటసాల స్వరపరచిన పాట పార్వతీకళ్యాణంలో జయజయ సుందర నటరాజా అనే చక్కటి పాట. హంసనాదం లో కీర్తన బంటురీతి కొలువీయవయ్య.

2 అభేరి నఠభైరవి జన్యం కింద ఉంది. అంటే శుధ్ధధైవతం వేయాలి. కానీ వాడుకలో చతుశ్శృతి ధైవత ప్రయోగమే ఉంది. నగుమోము గనలేని అన్నప్పుడు, గనలేని – ద1 ప మా మ అన్న ప్రయోగం ఎబ్బేట్టుగా వినిపించదు. ప్రస్తుతం ఈ రాగం కర్ణాటక దేవగాంధారిగా ప్రచారంలో ఉంది. వాసుదేవాచారి కృతి ‘భజరే మానస’ కర్ణాటక దేవగాంధారే.

భీంపలాస్ లో ధైవతం లేకుండా – స గ మ ప ని స – స ని ప మ గ రి స – అనే మూర్ఛనలో ఉన్న పాట ‘అందమే ఆనందం’ అన్న పాట. ఆ పాట భీంపలాస్ కాదంటే కాసేపు అనుమానంగా చూసాడొకాయన.

ఈ మూర్ఛన కలిగిన రాగానికి ‘అగ్నికోపం’ అనే పేరు ఉంది. బహుశ హిందుస్తానీ సంగీతంలో ధనాశ్రీ గా పిలవబడుతోంది. మరో మాట భరతనాట్యం వారు కూడా స్వాతి తిరునాళ్ తిల్లానా చేస్తూ ఉంటారు. అది ధనాశ్రీ. సాగ నిస సా. ని మ పా గ మ ని ప గా రి అని వస్తుంది. (స్వాతి తిరునాళ్ సినిమా లో జేసుదాస్ పాడారు).

పుష్పవిలాపం, కుంతికుమారి, సాంధ్యశ్రీ, పాపాయి మొదలైన వాటిలో ఘంటసాలగారి పద్యపఠనం వినూత్నమైన శైలి. అంతవరకూ ఎవరూ ప్రయోగించనిది. వర్ణనాత్మకమైన, అనుభూతి పరమైన భావాలను, కథనం రాగయుక్తంగా ప్రకటించడానికి వీలైనది. రాగభావం, సాహిత్య భావం రెండూ సమన్వయంతో నడుస్తాయి. తెలుగు నాటకాలద్వారా ప్రచారంపొందిన పద్యపఠన పధ్ధతికి అది భిన్నమైనది.

నాటక పద్యపఠనాలలో ప్రధానమైన శైలి శ్రీ అద్దంకి శ్రీరామమూర్తిగారి శైలి. సినిమాలుగా రూపాంతరం చెందిన హరిశ్చంద్ర, కృష్ణతులాభారం, కృష్ణపాండవీయం, పాండవ వనవాసం మొదలైన వాటిలో పద్యపఠనం అద్దంకి శైలే. అది సాధారణంగా కర్ణాటక రాగాలలో ఉంటుంది.

మరో శైలి C S R ఆంజనేయులుగారిది. ఆయన ఆరోజుల్లో పాడిన పద్యాలు – ‘ప్రమదల గూడి మాడగనే’ (కాపీ), ‘శ్రీకృష్ణుడను పేర చెన్నార ధరణిపై జలజాక్షుడెచ్చోట జననమందె’ (మోహన) రామదాసు నాటకంలో – ఆయన శైలి నిరూపిస్తాయి. హిందుస్తానీ రాగాలను అనుసరిస్తూ ఉంటుంది ఆ బానీ. ఆ రోజుల్లో కపిలవాయి రామనాథ శాస్త్రి పద్యాలు విని జనం ముగ్ధులయేరు. కానీ ఆ బానీ నిలవలేదు. K. రఘురామయ్య – ఆయన పఠనం ప్రధానంగా రాగాలాపన. సూరిబాబు శైలి అద్దంకి శైలికి దగ్గర. ఇంకా ఉన్నారు. షణ్ముఖి ఆంజనేయులు, అబ్బూరి వరప్రసాదరావు, మరికొందరు. వాళ్ళ బానీ ఇటు పద్య భావానికి గాని, అటు రాగభావనికి గాని న్యాయం చేయదు.

ఘంటసాలగారి పద్యపఠనానికి మూలం ఏదైనా ఉందా అంటే అది పట్రాయని సీతారామశాస్త్రి గారి పాట విన్న వాళ్ళకి తెలుసును. ఆయన కచేరీ ముందు స్వీయ రచన ప్రార్ధన పద్యంగా చదివేవారు.

మంజులగాత్ర మాధురి సమంజసమై శృతియందు లీనమై
రంజిల తాళజాతులు తిరంబగు మార్గమున నాజలంగ ర
క్తింజెలువార నెమ్మనము కీర్తనలలో స్వరరాగ భావయు
క్తింజిలుకంగ పాడెదనుతించుచు నిన్ను మదంబ శారదాంబ

ఘంటసాల పాడిన – ‘చూచెదవేలనో ప్రణయసుందరీ’ వింటున్నప్పుడు నాకు ఈ పద్యం శాస్త్రిగారు పాడినది జ్ఞాపకం వస్తూంటుంది. ఈమాట ఘంటసాలను కించపరచడానికి కాదు.

శ్రీ ఘంటసాల కర్ణాటక రాగాలను ప్రయోగించినా కర్ణాటక శైలిని నిరూపించే ‘పట్టు’, ‘ఒరయిక’ వంటి గమకాలను విసర్జించేరు. అయితే ఆయన కన్యాశుల్కంలో చేసిన జావళీ ‘సరసుడ దరిజేరరా’ (కమాచ్) అన్నది కర్ణాటక బానీలోనే వినిపిస్తుంది. అలాగే సతీ అనసూయలోని శ్రీరంజని రాగం జావళీ ‘మారు పల్కవదేమిరా’ అన్నది. ఈ జావళీ M.L. వసంతకుమారి పాడేరు. తన కచేరీలలో ఈ జావళీని పాడడానికి ఘంటసాలగారి అనుమతి కూడ కోరారు.

శ్రీ జాషువా మద్రాసు రేడియో స్టేషన్ లో పనిచేసినప్పుడు శ్రీ జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారూ రేడియో ఉద్యోగే. నాకు రుక్మిణీనాథ శాస్త్రి గారితో బాగానే పరిచయం. ఆయన మాట్లాడే తీరును బట్టి వారిద్దరి మధ్య వాది సంవాది స్వరాలు లేవనిపించేది.

తెలుగు నాటక సంగీతంలో పద్య పఠనం ప్రధానాంశం. తెలుగు నాటకంలో పాటలు ఏనాడో పోయాయి. మైలవరం కంపెనీ నాటి పాటలు, ‘పో బేల పొమ్మికన్’, ‘పోవుచున్నావా’ మొదలైన పాటలు హాస్యాస్పదంగా పాడుతున్నారు. తుంగల చలపతిరావు (సక్కుబాయి నాటకం), జొన్నవిత్తుల శేషగిరిరావు, పారుపల్లి సత్యనారాయణ, దాసరి కోటిరత్నం, రామతిలకం, మరికొందరు మంచి స్టేజీ గాయకులు. ఈనాడు నాటక సంగీతం కేవలం పద్యపఠనమే. పాండవోద్యోగవిజయాలు తప్పించి మరో పద్య నాటకం ఇటీవల చూడలేదు.

సంగీతరావు

15 ఆగస్ట్ 2009


కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

రచయిత కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ గురించి: కొడవటిగంటి రోహిణీప్రసాద్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత. పాపులర్ సైన్సు, సంగీతం మరియు ఇతర విషయాల గురించి తన మాతృభాషైన తెలుగులోను, ఆంగ్లంలోను పలు వ్యాసాలు రాశాడు. ఆయన ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు కుమారుడు. ...