“ఈమాట” మాటేమిటంటే ..

1998 వేసవి. ఇంటర్నెట్‌ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా విజంభిస్తోంది. దూరాల్ని దూరం చేస్తోంది. వార్తాపత్రికల నుంచి వ్యక్తిగత ఫోటోల దాకా, కొత్త సినిమా పాటల నుంచి శతాబ్దాలనాటి రాతకోతల దాకా వెబ్‌ మీద నివాసం ఏర్పరచుకొంటోన్నాయి.

ఈ సంధికాలంలో ఆస్టిన్‌, టెక్సస్‌ లో సాహిత్యాభిరుచి ఉన్న వాళ్ళం కొందరం కొంత తరచుగా కలుసుకుని సాహిత్యవిషయాల్ని చర్చించుకోవటం జరుగుతుండేది. ఆసందర్భాల్లో రచనలు చెయ్యటం, వాటిని ప్రచురించటం గురించిన ఆలోచనలు కూడా సాగేవి. ఒకవంక అమెరికా నివాసం వల్ల కలిగిన, కలుగుతోన్న అనుభూతుల్ని, అనుభవాల్ని రచనల్లో ప్రతిబింబించాలనే అభిలాష. మరోవంక అలాటి రచనల్ని ప్రచురించే పత్రికలు గాని మరో ఉదాత్తమైన మార్గాలు కాని కనిపించని నిరాశ.
అప్పటికే అమెరికా రచయితలు కొందరు తమ రచనల్ని ఇండియా పత్రికల్లో ప్రచురిస్తోన్నా, వాటిలో ఎక్కువభాగం ఇండియాలోని అనుభవాలు, జ్ఞాపకాలు, సమస్యల గురించే అయ్యేవి. ఎక్కడన్నా ఇక్కడి జీవితానుభవాలకి సంబంధించిన రచనలు ఉన్నా అవి చాలావరకు ఇండియాలో ఉన్న వారికి అమెరికన్‌ సమాజాన్ని పైపైన, బులబులాగ్గా, చాలా తేలికపాటు (సింప్లిస్టిక్‌) గా, ఏవిధంగా ఉంటే ఇండియాలోని వాళ్ళకు నచ్చుతాయో అలా చూపిస్తూ ఉండేవి. తెలుగు సినిమాల్లో ఇంగ్లీష్‌ డైలాగ్‌ చెప్పి దానికి వెంటనే తెలుగు అనువాదం చెప్పినట్టు రచనల్లో కూడ పొరపాటున అమెరికా జీవితానికి సంబంధించిన విషయం ఏదన్నా అన్నా వెంటనే దాన్ని చాలాసార్లు గుడ్డివాళ్ళు ఏనుగుని వర్ణించే విధంగా వివరించటం జరుగుతుండేది.

ఇదంతా చూస్తోంటే విదేశాల్లో ఉంటున్న తెలుగు రచయిత్రు(త)లు తమ హదయాల్ని ఆవిష్కరించగలిగే రచనలు చెయ్యాలంటే వేరే మార్గాలు కావాలని స్పష్టంగా తేలిపోయింది మాకు.

ఈ నేపథ్యంలో మేమే ఒక పత్రికను ప్రారంభిస్తే ఎలా వుంటుందనే ఆలోచన రూపుదిద్దుకోసాగింది. ఆ సందర్భంలో రెండు అంశాలు స్పష్టంగా తేలాయి.
మొదటిది ఈపత్రిక ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి, ముఖ్యంగా విదేశాంధ్రులకి అందుబాటులో ఉండాలనేది. రెండోది అది ముద్రితపత్రిక కాకూడదు అనేది. దీనికి ఒక కారణం ముద్రిత పత్రికను నడిపే సమయం గాని, అనుభవం గాని మాలో ఎవరికీ లేకపోవటం ఐతే రెండోది అలాటి పత్రికని విదేశాంధ్రులకి అందుబాటులోకి తేవటం జరిగేపని కాదనేది.

ఈ అంశాల దృష్య్టా అది ఇంటర్నెట్‌ పత్రిక కావటం ఒకటే మార్గమని అర్థమైపోయింది.
నలుగురం కలిసి ఈపనికి నడుం కట్టాం నేను, విష్ణుభొట్ల లక్ష్మన్న, కొంపెల్ల భాస్కర్‌, కొలిచాల సురేశ్‌.
తెలుగు కంప్యూటరీకరణ మీద విశేషకృషి చేసిన చోడవరపు ప్రసాద్‌ మా ప్రయత్నానికి సహకారం అందించారు. “తెలుసా” చాట్‌ గ్రూప్‌కి తమ సర్వర్‌ మీద ఆతిథ్యం ఇచ్చిన జువ్వాడి రమణ ఈ పత్రికను కూడ అక్కడే ఉంచటానికి అంగీకరించారు. ఇలా “ఈమాట” రాకకి రంగం సిద్ధమయింది.
అమెరికా తెలుగు సాహితీలోకంలో ప్రముఖులకు మా ఆలోచనని తెలియపరిచి సలహాలు, సహాయం అడిగాం. వారు అమెరికాలో తెలుగు పత్రికను నడపటంలో ఉన్న కష్టనష్టాల్ని తమ అనుభవాల్నుంచి వివరించి హెచ్చరించారు.

అలా, 1998 విజయదశమికి వెలువడింది “ఈమాట” తొలిసంచిక. రెండులక్ష్యాలు ఈపత్రిక గమనానికి దారిచూపాయి, చూపుతున్నాయి విదేశాల్లో ఉంటున్న తెలుగువారి అనుభవాల్ని, అనుభూతుల్ని స్పష్టంగా, మొహమాటాలు లేకుండా, అలాటి అనుభవాలే ఉన్న ఇతరుల్తో పంచుకునే అవకాశం కలిగించటం; రాజకీయాలకీ, వ్యాపారధోరణికీ దూరంగా ఉండటం. ఈమూడున్నర ఏళ్ళ కాలంలో జరిగిన సంఘటనల్ని చూస్తోంటే అప్పటి మానిర్ణయం సరైనదన్న నమ్మకం ఇంకా బలపడుతోందిప్పుడు.

ఇప్పటికి వెలువడిన పద్దెనిమిది సంచికలలోను కథలు, కవితలతో పాటు “ఈమాట” ఎన్నో సాహిత్యవ్యాసాలు, వ్యాసాలు ప్రచురించింది. “సంప్రదాయ కథాలహరి” శీర్షికన ప్రభావతీప్రద్యుమ్నం, ఆముక్తమాల్యద, కళాపూర్ణోదయం వంటి తెలుగు గ్రంథాల్ని, స్వప్నవాసవదత్తం వంటి సంస్కృతనాటకాల్ని తేలికైన సమకాలీన వాడుక తెలుగులో అందించింది.

ఇంతేకాకుండా భాగవతంలోని కొన్నిపద్యాలు ఒక విఖ్యాత సంగీతజ్ఞుడు పాడగా వాటిని కూడ “ఈమాట” పాఠకశ్రోతలకు అందించింది. (ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉన్న ఎవరైనా http://www.eemaata.com వద్ద ఇప్పటి వరకు వెలువడ్డ “ఈమాట” రచనలన్నిటినీ చదవొచ్చు, వినొచ్చు.)

ఇక, ఈసంకలనం విషయానికి వస్తే ..

ఇప్పటివరకు “ఈమాట”లో వచ్చిన రెండువందల పైచిలుకు రచనల నుంచి ఎంచి కూర్పించినవి ఇవి. ఈ ఎన్నికలో వెదికింది రచన విశిష్టంగా ఉందా లేదా అనే ఒకే ఒక్క గుణం కోసం. స్థలాభావం వల్ల ఎన్నో మంచిరచనల్ని ఇందులో చేర్చటానికి కుదరలేదు. అందుకు చాలా చింతిస్తున్నాం. ఐతే “ఈమాట” పాఠకుల కోసం అవన్నీ వెబ్‌ మీద ఉన్నాయి.

స్వేఛ్ఛగా రాయగలిగినప్పుడు ఆంధ్రుల వాణి, బాణి కూడ ప్రత్యేకంగా వినిపిస్తాయని “ఈమాట” నిరూపించింది. ఆవిషయం ఈసంకలనంలో ఇంకా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అలాగే ఈరచనల వస్తువులో, శైలిలో, శిల్పంలో కొన్ని కొత్తదారులు కనిపిస్తాయి.

నాకు మరీ నచ్చిన ఒక అంశం “ఈమాట” రచయిత్రు(త)లు తాము చెప్పదలుచుకున్న విషయాన్ని ఏమాత్రం తడబాటు, జంకు, మొహమాటం లేకుండా చెప్పటం. ఎవరి ఒప్పుదల కోసమో మెప్పుదల కోసమో కాకుండా వీరు తమకోసం తాము రాస్తున్నారనటానికి ఇది ఒక నిదర్శనం. ఇది “ఈమాట” కోసం జరుగుతున్న కృషికి సార్థకత కలిగిస్తోందని నా నమ్మకం.

మొన్నమొన్నటివరకు అమెరికా తెలుగు కథకులకు కనిపించిన వస్తువులు పిల్లల పెళ్లిళ్లు, అక్కడిఇక్కడి విలువల తేడాలు, మారని మగవారి మనస్తత్వాలు,.. ఇలాటివైతే, ఈసంకలనంలో అందుకు చాలా భిన్నమైన విషయాల గురించిన కథలు కనిపించటం మరో విశేషం. ఇది పరిణతి చెందుతున్న పరిశీలనకు, పెరుగుతోన్న భావవైశాల్యానికి తార్కాణంగా భావిస్తాను నేను.

ఈసంకలనం మీలో తెలుగు రచనలు చేయటానికి, (కనీసం “ఈమాట” పత్రికనైనా) చదవటానికి, ఆసక్తి కలిగిస్తుందని ఆశిస్తున్నాం. పత్రిక చిరునామా మరోమారు: www.eemaata.com .