దాదాపు ముప్పైయేళ్ళ క్రితం గుంటూరు జిల్లాలో జన్మించి, ఆంధ్రప్రదేశ్ పలుప్రాంతాల్లో విద్యాభ్యసించి, దేశం కొన్ని ప్రాంతాల్లో నివాసించి, జె.పి.సార్త్ర్ పై పరిశోధించి; డాక్టరేట్ ముగియకుండా, పోస్ట్ డాక్టరేట్ మొదలవకుండా, అటూ యిటూ యెటూ కాకుండా, యెక్కడో నివసిస్తూ, మరెక్కడో వసిస్తూ, తనలో కసిస్తూ --
"యెట్టాగో వున్నాది వో లమ్మి" నుంచి త్యాగరాజు "నను పాలింప" వరకు తనకిష్టం. చలికాలం వుదయం నీటి బిందువుల్లో నీలం గడ్డిపూల నుంచి పగిలిన మొహంజొదారొ పాలరాతి స్నానంతొట్ల వరకు తనకిష్టం. "నవలారాణి" కలాక్షేపం నుంచి "పొడుంనాధ" వైభవక్షేపం వరకు తన కిష్టం.
యివన్నీ తనకిష్టం. కానీ, "నా యిష్టం నా యిష్టమే. నిన్ను నువ్వు తెలుసుకో -- అన్నారు వుపనిషత్తుల నుంచి రమణ మహర్షి వరకు. ముందుగా నన్ను నేను పొందాలిగా నన్ను నేను తెలుసుకోటానికి!" అని సార్త్రిస్తూ --
తనని తను పొందే అన్వేషణ యత్నంలో, (జనవరి 19, 1981) పౌష్య రౌద్రి పౌర్నిమ రాత్రి, యీ లోకపుటంచులు దాటి విశ్రాంతిగా పవళించి వెళ్ళిపోయింది -- అజ్ఞాత శాక్తానంతంలోకి.
--పబ్లిషర్