ఆకలి నిజాయితీ
ఆకలి దహిస్తూండబట్టి గానీ లేపోతే నేనూ
ఈ శరద్రాత్రి కంటికొస లోంచి గాఢత్వపు మంచుబిందువునై
జారి ఉందును
ఈ చిక్కని చీకటిలోని కాంతిని దోసిళ్ళతో
తాగి ఉందునుఆకలి దహిస్తూండబట్టి గానీ లేపోతే నేనూ
ఈ ఉభయ సంధ్యల రంగులతో నా మానసాన్ని
సింగారించుకుని ఉందును
ఈ చిరుగాలికీ ఈ మెత్తని పచ్చికకీ ఈ చుక్కల గగనానికీ
స్పందించి ఉందునుఈ క్షుద్బాధా తప్త విస్పృహలోని సెగ
ఈ అవమాన వ్యధా కలిత మానసం
ఈ దారిద్ర్య అనారోగ్య గ్రస్త శరీరం
కార్చిచ్చులా రగులుతుంది
కాంతి కిరణంలా దూసుకెడుతుంది
ఉన్మాద శక్తిలా తిరగబడుతుంది
అని నికరంగా అనిపిస్తుందికానీ అప్పుడప్పుడూ ఎప్పుడన్నా మరీమరీ నిజాయితీక్షణాలలో
ఆకలి దహిస్తూండబట్టి గానీ లేపోతే నేనూ
వాళ్ళలా
అందుకే భయం నాలోకి నేను తొంగిచూసుకోవటం